సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వివాదాల్లో రిసార్ట్ వెబ్ సీరిస్‌ హీరో విజయ్‌ కుమార్!

ABN, Publish Date - Apr 28 , 2026 | 04:08 PM

జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న 'రిసార్ట్' వెబ్ సీరిస్‌ చిక్కుల్లో పడింది. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుగ్రహ నంబియార్‌ హీరో విజయ్‌ కుమార్‌ రాజేంద్రన్, అతని భార్య నక్షత్రపై తీవ్ర ఆరోపణలు చేసింది.

Resort Web Series

తమిళ వెబ్ సీరిస్‌ 'రిసార్ట్' (Resort) మార్చి 13 నుంచి ప్రధాన భారతీయ భాషల్లో ప్రసారం అవుతోంది. ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. విజయ్‌ కుమార్ రాజేంద్రన్ హీరోగా నటిస్తున్న 'రిసార్ట్' వెబ్ సీరిస్‌లో అభినయ నేత్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సీనియర్‌ నటుడు తలైవాసల్‌ విజయ్‌, దర్శన శ్రీపాల్‌, ధన్య పల్లట్‌, సౌందర్య శరవణన్, బడవ గోపి, లల్లూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో జరిగే కిచెన్‌ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్‌ రూపుదిద్దుకుంది. గొప్పగా ఉందనలేం కానీ టైమ్ పాస్‌గా దీన్ని వీక్షకులు భావిస్తున్నారు. దర్శకుడు ప్రవీణ్‌ బెన్నెత్‌ ఎంచుకున్న నేపథ్యం కాస్తంత కొత్తగా ఉండటం... మల్టీ లేయర్స్‌లో కథ సాగుతుండటంతో వీక్షకులలో కొంత క్యూరియాసిటీని 'రిసార్ట్' వెబ్ సీరిస్‌ కలగచేస్తోంది. దాంతో శుక్రవారం వచ్చే కొత్త ఎపిసోడ్స్ కోసం కొందరు ఎదురు చూస్తూ ఉన్నారు.


'రిసార్ట్' వెబ్ సీరిస్‌ సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఇందులో శ్రీనిధి అనే పాత్ర చేసిన కేరళకు చెందిన ఇరవై మూడేళ్ళ అనుగ్రహ ఎస్ నంబియార్ హీరో విజయ్‌ కుమార్‌ రాజేంద్రన్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. దాంతో ఈ వెబ్ సీరిస్‌ చిక్కుల్లో పడుతుందేమోననే ఆందోళనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. 'తనతో ఈ వెబ్ సీరిస్ కోసం యేడాదికి అగ్రిమెంట్‌ చేసుకుని, నాలుగు నెలలుగా తనకు నటించే అవకాశం ఇవ్వడం లేదని, బయటి సంస్థలలోనూ అగ్రిమెంట్‌ను సాకుగా చూపి పనిచేయనివ్వడం లేద'ని అనుగ్రహ నంబియార్ ఆరోపిస్తోంది. దీనికి హీరో విజయ్‌ కుమార్‌ రాజేంద్రన్, అతని భార్య నక్షత్ర కారణమని ఆమె అంటోంది. అలానే షూటింగ్‌ సమయంలోనూ తనకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, వసతులు కల్పించకపోవడంతో తాను అనారోగ్యం పాలయ్యాయనని ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆర్థికంగా తాను ఈ సీరిస్‌ కారణంగా ఎంతో నష్టపోయానని, రెమ్యూరేషన్ కూడా తనకు సరిగ్గా ఇవ్వడం లేదని వాపోయింది. ఈ విషయంలో సంబంధిత వ్యక్తులు స్పందించపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.


అనుగ్రహ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు 'రిసార్ట్' వెబ్ సీరిస్‌ హీరో విజయ్‌ కుమార్ రాజేంద్రన్ స్పందించాడు. అనుగ్రహ తనపై ఆరోపణలు చేయడంలో అర్థం లేదని, ఆ వెబ్ సీరిస్‌కు తాను నిర్మాతనో దర్శకుడినో కాదని స్పష్టం చేశాడు. అలానే తన భార్య నక్షత్రను ఈ వివాదంలోకి లాగడంపైనా అతను అభ్యంతరం తెలిపాడు. ఈ వెబ్ సీరిస్‌కు తాను కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నానని, ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం కల్పించాలని కోరుకుంటోందని, అందుకు ఒప్పుకోకపోవడంతో ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేస్తోందని బదులిచ్చాడు. ఇదిలా ఉంటే అనుగ్రహ నంబియార్‌ ఆరోపణలను మరో నటి మాళవిక శ్రీనాథ్‌ సమర్థించింది. 'రిసార్ట్' వెబ్ సీరిస్‌ టీమ్‌ నటీనటుల అవసరాల గురించి సరిగా పట్టించుకోవడంలేదని ఆరోపణ చేసింది.

ఇప్పుడిప్పుడే గాడిలో పడి, వీక్షకులను ఆకట్టుకుంటున్న 'రిసార్ట్' బృందంపై వస్తున్న ఈ ఆరోపణల కారణంగా దాని వ్యూవర్ షిప్ తగ్గే ఆస్కారం ఉందని, వెంటనే ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే... రాబోయే ఎపిసోడ్స్ మీద ప్రభావం పడుతుందని కొందరంటున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 04:11 PM