Resort Web Series: రసకందాయంలో... 'రిసార్ట్'!
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:48 PM
తమిళ వెబ్ సీరిస్ 'రిసార్ట్'కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. తాజాగా స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ మలయాళ చిత్రం 'హెలెన్' గుర్తుకు తీసుకు రావడంతో వీక్షకులు మరింత ఉత్సుకతకు లోనవుతున్నారు.
తమిళ వెబ్ సీరిస్ 'రిసార్ట్' (Resort) మూడు మాసాలుగా జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో వివిధ భాషల్లో ప్రసారం అవుతోంది. ప్రతి శుక్రవారం ఈ వెబ్ సీరిస్ లోని నాలుగు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేస్తుంటారు. ఒక్కొక్కటీ సుమారుగా ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల నిడివితో సాగుతుంది. బేసికల్‌గా తమిళ వెబ్ సీరిసే అయినా దర్శకుడు ప్రవీణ్ బెన్నెత్ ఎంచుకున్న కథ, దాన్ని రూపొందిస్తున్న విధానం కారణంగా ఇతర భాషల్లోనూ దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో 'రిసార్ట్' వెబ్ సీరిస్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫ్రెష్ బ్రీజ్ లాంటి ఫీలింగ్‌ను కలిగిస్తోంది.
కథ విషయానికి వస్తే... ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తండ్రి చిదంబరం చేసిన అప్పులను తీర్చుతూ, తల్లిని చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కథానాయకుడు వెట్రీ. తండ్రిలానే మంచి చెఫ్ కావాలన్నది అతని కోరిక. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మహాబలిపురంలో ఆర్.ఆర్. రిసార్ట్ లో రూమ్ సర్వీస్ బోయ్ ఉంటాడు. రాత్రి పూట స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లో పార్ట్ టైమ్ చేస్తుంటాడు. అతనికి ఉన్న టాలెంట్‌కు కొన్ని రోజులు చెఫ్ గా పనిచేసే ఛాన్స్ వచ్చినా, కిచెన్ పాలిటిక్స్‌తో దాన్ని నిలుపుకోలేక పోతాడు. ఆర్.ఆర్. రిసార్ట్ అధినేత రఘుపతి, కిచెన్‌ను నిర్వహించే చీఫ్ చెఫ్ నెడుమారన్ లకు వెట్రీ తండ్రి చిదంబరంతో గతంలోనే పరిచయం ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఇదే రిసార్ట్‌లో పనిచేసిన చిదంబరం ఉన్నట్టుండి మాయమౌతాడు. అతను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడేమోనని రఘుపతికి సందేహం కలుగుతుంది. చిదంబరం ఆచూకీ కోసం రఘుపతి ప్రయత్నించిన ప్రతిసారి నెడుమారన్ ఏదో రకంగా అడ్డంకులు సృష్టిస్తుంటాడు.
తన తండ్రి అదే రిసార్ట్‌లో పనిచేశాడనే విషయం వెట్రీకి తెలియదు. ఆ విషయం తెలిసిన రఘుపతి... వెట్రి పట్ల సానుభూతి చూపుతుంటాడు. అదే రిసార్ట్‌లో సూ చెఫ్ గా ఉన్న నెడుమారన్ కూతురు ఐశ్వర్యకు వెట్రీ అంటే ఇష్టం. పాటలు పాడటం అంటే మరీ ఇష్టమే. నైట్ క్లబ్‌లో తండ్రికి తెలియకుండా పాటలు పాడుతూ ఉంటుంది. ఇదే సమయంలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ రన్ చేసే ఆమె కూతురు రమ్యకు కొద్ది రోజులు ఆర్.ఆర్. రిసార్ట్ లో చెఫ్ గా పనిచేసే ఛాన్స్ దక్కుతుంది. అందరితో మంచి ఉంటూ చక్కని పేరు తెచ్చుకోమని రమ్యకు వెట్రీ హితవు పలుకుతాడు. అందులో చేరిన రెండో రోజే అనుకోని పరిస్థితుల్లో రమ్య రిసార్ట్‌కు చెందిన కోల్ట్ స్టోరేజీలో చిక్కుకు పోతుంది. అందులోంచి ఆమెను ఎవరు, ఎలా కాపాడారు? అనే సస్పెన్స్ లో ఈ వారం ఎపిసోడ్‌ను దర్శకుడు ముగించాడు.
గతంలో వచ్చిన మలయాళ చిత్రం 'హెలెన్'ను ఈసారి ఎపిసోడ్ గుర్తు చేసింది. 'హెలెన్'లో హీరోయిన్ పొరపాటున తాను పనిచేసే పిజ్జా సెంటర్ కోల్డ్ స్టోరేజ్‌లో చిక్కుకుపోతుంది. ఆమె ఏమైందో తెలియక కుటుంబ సభ్యులు కంగారు పడతారు. అందులోంచి ఆమె ఎలా తన ప్రాణాలను కాపాడుకుని బయటపడిందనేదే 'హెలెన్' కథాంశం. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తో రీ-మేక్ చేద్దామనుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు 'రిసార్ట్' తాజా ఎపిసోడ్‌నూ అదే తరహాలో తీసుకెళ్ళడంతో ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే... ఇటీవల 'రిసార్ట్' టీమ్ మరో విషయంలో వార్తల్లో నిలిచింది. ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్న అనుగ్రహ ఎస్ నంబియార్... వెబ్ సీరిస్ టీమ్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో అగ్రిమెంట్ చేసుకుని ఖాళీగా కూర్చోపెడుతున్నారని, నటించే ఛాన్స్ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. అలానే టీమ్ ట్రీట్‌మెంట్ మీద, హీరోగా నటిస్తున్న విజయ్ కుమార్ రాజేంద్రన్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వాపోతూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఆరోపణలను టీమ్ ఖండించింది. ఇప్పుడీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా అనుగ్రహ వెబ్ సీరిస్‌లో కనిపిస్తూనే ఉంది. అయితే... ఇదంతా వెబ్ సీరిస్ మీదకు జనాల దృష్టి మళ్ళించడానికి చేసిన ట్రిక్ అని కొందరు నెటిజన్స్ వ్యాఖ్యానించారు.
విజయ్ కుమార్ రాజేంద్రన్ ఈ వెబ్ సీరిస్ లో వెట్రీ పాత్రను పోషించడమే కాకుండా కథ, కథనాల తయారీలోనూ పాలుపంచుకుంటున్నాడు. హీరోయిన్ ఐశ్వర్య గా అభినయ నేత్రన్ చేస్తోంది. ఇతర కీలక పాత్రలను ప్రముఖ నటుడు తలైవాసల్ విజయ్, దర్శన శ్రీపాల్, ధన్య పల్లట్, సౌందర్య శరవణన్, బడవ గోపీ, కవిప్రియ తదితరులు పోషిస్తున్నారు. మొత్తం మీద ఆసక్తికరమైన కథనం, వివాదాస్పద సంఘటనలతో 'రిసార్ట్' వీక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!