ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ABN, Publish Date - Sep 13 , 2026 | 11:44 AM
మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) ఆగస్టు 21న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కీలకమైన నటనతో ఆకట్టుకున్నారు. ఓ వైపు మద్యానికి బానిసైన తండ్రి, మరోవైపు తన కుమార్తెతో అతనికి ఉన్న అనుబంధం.. వీటి చుట్టూ సాగే భావోద్వేగ ప్రయాణంగా ‘ఇరుముడి’ తెరకెక్కింది. ఇందులో ఆధ్యాత్మిక అంశాలను కూడా కథలో మేళవించారు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కథ:
అది ఉత్తరాంధ్రలోని ఓ పల్లె. పేరు పొల్లూరు. ఆ గ్రామంలో అరటి చెట్లను పండిస్తూ, ఆటో నడిపే త్రినాథ రావుకు (రవితేజ) ఒక్కగానొక్క కూతురు. ఆమే మణెమ్మ (నక్షత్ర). తన భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్) కోరిక మేరకు త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కూతురు పుడుతుంది. అందుకే కూతురంటే త్రినాథరావుకు అయ్యప్ప స్వామంత ప్రేమ! అయితే అతనికి తాగుడనే వ్యసనం ఉంటుంది. తాగినప్పుడు ఎవరు ఏం చెప్పినా బుర్రకెక్కించుకోడు, తన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే, ఎంత వరకైనా వెళ్ళిపోతాడు. అదే ఊరిలో ఉండే గురుస్వామి (సాయికుమార్) ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆయన కూతురు గాయత్రిని కూడా త్రినాథ్ సొంత కూతురులానే చూసుకుంటాడు. ఆరో తరగతికి వచ్చిన తన కూతురు మణెమ్మను, గాయత్రితోనే పట్టణంలోని హైస్కూల్ కు పంపుతాడు. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏదో జరగకూడనిది జరుగుతుంటుంది. అక్కడ చదువుకునే నలుగురు అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతారు. వారి మరణాలకు కారణం ఏమిటీ? అదే స్కూల్ లో చదువుకోవడానికి వెళ్ళిన త్రినాథరావు కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తన కళ్లముందు ఏది జరిగినా తండ్రికి వెంటనే చెప్పేసే మణెమ్మ అక్కడి దారుణాన్ని ఎందుకు వెంటనే చెప్పలేకపోయింది? దాని పర్యవసానం ఏమిటీ? అనేదే ఈ సినిమా కథ.