పోచమ్మ వెబ్ సీరిస్ రివ్యూ
ABN, Publish Date - Apr 18 , 2026 | 04:41 PM
బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ కీలక పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'పోచమ్మ'. ఆహాలో శుక్రవారం నుండి ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటీవల ఓటీటీకి వచ్చిన వెబ్ సిరీస్ ‘పోచమ్మ’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 17 (శుక్రవారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంబటి అర్జున్, పూజారెడ్డి, రమేష్ ఇందిర, అచ్యుత్ కుమార్, ప్రియా శతమార్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు కీలక పాత్రల్లో నటించగా రమేశ్ ఇంద్ర దీనికి దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలో విలాసవంతమైన ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన వ్యాపారవేత్త ఫెడ్రిక్ తన భార్య, ఇద్దరు కూతుర్లు, అల్లుడుతో కలిసి ఆక్కడ ఉండేందుకు వస్తాడు. రఘుపతి అనే వ్యక్తి ఆ ఎస్టేట్ మేనేజర్‌గా, అతని కుటుంబం పనివాళ్లుగా ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అయితే క్రిస్టియన్ అయిన ఫెడ్రిక్ ఎస్టేట్‌లో ఉన్న మహిమ గల పోచమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి బయట పడవేయిస్తాడు. నాటి నుంచి ఆ ఎస్టేట్‌లో అనుకోని పరిణామాలు సంభవిస్తుంటాయి. తొలుత ఫెడ్రిక్ చిన్న కూతురు సూసైడ్ చేసుకోగా మరో ప్రమాదంలో అల్లుడు మరణిస్తాడు. పెద్ద కూతురు ప్రమాదం నుంచి బయట పడుతుంది.
ఈ నేపథ్యంలో ఫ్యామిలీలో వరుస విషాదాలతో సతమవుతున్న ఫెడ్రిక్ తన భార్య సలహా మేరకు ఆ ఎస్టేట్ నుంచి తిరిగి వెళ్లిపోవాలనుకుంటారు. ఈ క్రమంలో ఆ తర్వాత ఎలాంటి ఘటనలు ఆ ఎస్టేట్‌లో చోటు చేసుకున్నాయి? పోచమ్మ విగ్రహాన్ని ఫెడ్రిక్ ఎందుకు తొలగించాడు? అసలు ఆ ఎస్టేట్‌లో వరుస ప్రమాదాల వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా? గ్రామ దేవత పోచమ్మ ఆ ఎస్టేట్‌లో ఉందా లేదా, పోచమ్మ విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ఠించగలిగారా? లేదా? అనే ఆసక్తికరమైన కథ,కథనాలతో ఈ సిరీస్ ఆద్యంతం సస్పెన్స్ తో సాగింది. మంచి థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే చివరలో ఒకటి రెండు డ్రగ్స్ సన్నివేశాలు స్కిప్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎక్కడా అసభ్యత, అశ్లీల సన్నివేశాలైతే లేవు.
పోచమ్మ వెబ్ సిరీస్ జెస్సీ సూసైడ్ ట్విస్ట్‌తో ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఆమె మరణం చుట్టూ తిరిగే పోలీస్ దర్యాప్తు సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉంటాయి. దర్శకుడు రమేష్ స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంది. మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించినా, పోచమ్మ విగ్రహాంకు సంబంధించి వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా హైలైట్ అయ్యాయి. కొన్ని సన్నివేశాలు ఊహకు అందేలా ఉండటం కాస్త మైనస్. కానీ క్లైమాక్స్ బాగా హ్యాండిల్ చేయడంతో సిరీస్ థ్రిల్లింగ్‌గా ముగుస్తుంది. అయితే.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు ఒకరిద్దరు మాత్రమే ఉండడం మిగతా అంతా కన్నడ నటులే కావడం మనకు తెలుగు సిరీస్ చూస్తున్నాం అనే ఫీల్ రాదు. అయినా రమేష్ ఇందిరా దర్శకుడిగానే గాక నటుడిగా కూడా ఫెడ్రిక్ పాత్రలో మెప్పించాడు. అంబటి అర్జున్ తక్కువ సేపే కనిపించినా గుర్తుంటాడు. 90స్ బయోపిక్ ఫేమ్ స్నేహల్, ‘ఓదెల-2’ పూజా రెడ్డి ఇద్దరూ గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ పాత్ర అన్నింటికి మించి సర్‌ప్రైజ్ . టెక్నికల్‌గా సినిమాటోగ్రఫి, మ్యూజిక్ కు ప్లస్ పాయింట్స్ పడతాయి. ముఖ్యంగా పోచమ్మ ఎపిసోడ్స్‌లో బీజీఎం ఎఫెక్టివ్‌గా ఉంది. కాఫీ తోటల విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు మెరుగ్గా ఉన్నాయి. మొత్తంగా దైవత్వం, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది.
ట్యాగ్ లైన్: ‘ఆహా’ అనిపించే ‘పోచమ్మ’
రేటింగ్: 3/5