పంచనామా.. ఉదయభాను నిర్మించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే
ABN, Publish Date - Sep 15 , 2026 | 05:03 PM
ఈమధ్య క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మలయాళంలో వచ్చిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వచ్చింది. అదే పంచనామా.
ఈమధ్య క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మలయాళంలో వచ్చిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వచ్చింది. అదే పంచనామా (Panchanama). 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ (Bharath) హీరోగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ పంచనామా. ఈ సినిమాను ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఉదయభాను, మిద్దే విజయేంద్ర మౌళితో కలిసి నిర్మించింది. గత శుక్రవారం జీ5లో రిలీజ్ అయిన పంచనామా ఎలా ఉంది.. ? అనేది తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే.. జయరామ్ (భరత్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అక్క, బావల వద్ద పెరుగుతాడు. కానీ, అనుకోకుండా వారు కూడా అతనికి దూరమవుతారు. ఇక జయరామ్ కష్టపడి పోలీస్ అవుతాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో జయరామ్ తమ్ముడు ఆది (చరణ్ బాబు) అనుమానాస్పద రీతిలో హాస్టల్ గదిలో మరణిస్తాడు. పోలీసులు అది సాధారణ చావుగా భావించినప్పటికీ, జయరామ్ మాత్రం దాన్ని హత్యగా అనుమానిస్తాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా ఒక్క ఆది మాత్రమే కాక, అదే రోజు మరణించిన మరో ఇద్దరి వేలిముద్రలు కూడా ఒక్కటే అని తేలడంతో కథలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ఈ వరుస మరణాల వెనుక వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాలు, హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్, మెడికల్ మాఫియా ఉన్నాయని గ్రహించిన జయరామ్, ఆ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఎలా ఛేదించాడు.. ? మెడికల్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు.. ? అసలు ఆది ఎవరు.. ? అనేది పంచనామా చూసి తెలుసుకోవాల్సిందే.
మొత్తం 6 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌ను దర్శకుడు ఒక ఆసక్తికరమైన మెడికల్ థ్రిల్లర్ పాయింట్‌తో ప్రారంభించాడు. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని ఫార్మా కంపెనీలు చేసే ప్రయోగాలు, ఆర్గాన్స్ ట్రాఫికింగ్ వంటి అంశాలను చూపించిన తీరు బాగుంది. ప్రారంభ ఎపిసోడ్లలో ఫింగర్ ప్రింట్ మిస్టరీ, ఒక్కో క్లూ ఆధారంగా హీరో ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే సన్నివేశాలు ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తిని కలిగిస్తాయి. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ద్వారా కథలోని ఎమోషనల్ యాంగిల్స్, నేర నేపథ్యాన్ని కనెక్ట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే, మొదటి నాలుగు ఎపిసోడ్లలో ఉన్న వేగం, ఉత్కంఠ చివరి రెండు ఎపిసోడ్లకు వచ్చేసరికి కాస్త మందగిస్తాయి. రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మాట్ కావడంతో మెయిన్ విలన్ ఎవరనేది ఊహించడం తేలికైపోయింది, దీనివల్ల క్లైమాక్స్ ట్విస్ట్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
నటీనటుల విషయానికి వస్తే, భరత్ ఖాకీ దుస్తుల్లో పోలీస్ ఆఫీసర్‌గా చాలా సీరియస్ పాత్రలో ఒదిగిపోయాడు. కథను తన భుజాలపై నడిపించడంలో ఆయన నటన ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భరత్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. హీరోయిన్‌గా మేథా రెడ్డి, నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో రూపా లక్ష్మి, సూర్య శ్రీనివాస్, తండ్రి పాత్రలో శివాజీరాజా తమ పరిధి మేర మెప్పించారు. అసలు కథ సెకండ్ సీజన్ లో ఉంటుందని చెప్పి ముగించడంతో సిరీస్ అంతా పూర్తి అయిన సంతృప్తి కలగదు. ఏదో త్వరత్వరగా ముగించాలి అని చేసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్ కానీ, ఉత్కంఠని దర్శకుడు మర్చిపోయినట్లు ఉన్నాడు. సాంకేతికంగా నరేష్ కుమారన్ నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ సీన్లను ఎలివేట్ చేయగా, సందీప్ కాంత్ ఛాయాగ్రహణం సిరీస్‌కు కావాల్సిన క్రైమ్ మూడ్‌ను అందించింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే స్క్రీన్‌ప్లే మరింత రేసీగా ఉండేది. మొదటిసారి ప్రొడ్యూసర్‌గా మారిన ఉదయభాను నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా బాగున్నాయి. కానీ, మంచి పాయింట్ తో ఉదయభాను వచ్చి ఉంటే బావుండేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
మొత్తంగా చెప్పాలంటే, పంచనామా సిరీస్ రొటీన్ ప్రిడిక్టబుల్ స్క్రీన్‌ప్లేతో అక్కడక్కడా మందగించినప్పటికీ, 20-25 నిమిషాల నిడివితో ఉండే ఆరు ఎపిసోడ్లను పెద్దగా సాగదీయకుండా క్రిస్పీగా పూర్తి చేయడం రిలీఫ్ ఇస్తుంది. క్రైమ్, మెడికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులు జీ5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను ఒకసారి వీక్షించవచ్చు.