Naga Chaitanya: 'దూత' సెకండ్ సీజన్ షూటింగ్ షురూ!
ABN, Publish Date - Jun 05 , 2026 | 02:10 PM
అక్కినేని నాగచైతన్య సైతం నిర్మాతగా మారారు. 'దూత' వెబ్ సీరిస్ సీజన్ 2ను ఆయన శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రావడానికి భయ పడుతున్న సమయంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ బాట పట్టారు. అలా అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) నటించిన తొలి వెబ్ సీరిస్ 'దూత' (Dhootha) 2023 డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. దీనిని నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌లో 'మనం' (Manam) ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఎనిమిది ఎపిసోడ్స్‌తో సాగిన 'దూత' వెబ్ సీరిస్ వన్ లో ప్రియ భవానీ శంకర్, పార్వతి తిరువతు, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగచైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాడు. ఆ వెబ్ సీరిస్‌కు ఖచ్చితంగా సీజన్ 2 ఉంటుందని అంతా భావించారు. అయితే కాస్తంత ఆలస్యంగా అది మొదలైంది.
జూన్ 5న 'దూత' సీజన్ 2 షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. విశేషం ఏమంటే... దీనికి అతనే నిర్మాత కూడా. మొదటి సీజన్‌ను నిర్మించిన శరత్ మరార్‌తో కలిసి చైతు ఈ సీజన్ 2 ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిత్రం ఏమంటే... అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఉన్నా... నాగార్జున 'గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్' బ్యానర్ పెట్టి 'సిసింద్రి' మూవీని ప్రొడ్యూస్ చేశారు. అలానే ఇప్పుడు నాగచైతన్య సైతం తనకంటూ ఓ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్టయ్యింది. ఇదిలా ఉంటే 'దూత'లో నటిస్తున్న ప్రధాన తారాగణంపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) క్లాప్ కొట్టారు. మొదటి సీజన్ ను డైరెక్ట్ చేసిన విక్రమ్‌కుమార్ దీన్ని రూపొందిస్తున్నారు. అయితే 'దూత' సీజన్ 2 ఎప్పుడు స్ట్రీమింగ్ కు రెడీ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య 'వృషకర్మ' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?
Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?
Rashmika Mandanna: ఆ పాత్రలో నటించేందుకు.. ముందు భయపడ్డా...