సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారత్‌లో పాకిస్థానీ వెబ్ సిరీస్‌కు బ్రేక్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!

ABN, Publish Date - Nov 27 , 2026 | 08:31 AM

పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను భారత్‌లో ప్రసారం చేయవద్దని నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Netflix Pakistani Web Series Controversy

ఓటీటీ వేదికలపై ఏ దేశానికి చెందిన కంటెంట్ అయినా అందుబాటులో ఉంటుందనే పరిస్థితికి భారత్‌లో కొన్ని పరిమితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లో రూపొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన వైఖరి తీసుకుంది. భారత్‌లో పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ (Pakistan) కంటెంట్‌ను భారతీయ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచకూడదని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix India) కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting - MIB) ఆదేశాలు జారీ చేసింది. త్వ‌ర‌లో రిలీజ్ కావాల్సి ఉన్న ఓ వెబ్ సిరీస్ నేపథ్యంలో ఈ అంశం మరోసారి స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జో బచాయ్ హై సంగ్ సమైట్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) వెబ్ సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే, పాకిస్థానీ కంటెంట్‌ను భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వెబ్ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) లేఖ రాసింది. ఆ సంస్థ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా పాకిస్థానీ కంటెంట్‌ను భారతీయ స్క్రీన్‌లపై ప్రదర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి చెందిన కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయడానికి అనుమతించ కూడదని లేఖలో పేర్కొన్నారు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. మ‌న‌దేశంలో వ్యాపారం చేస్తున్న ఓటీటీ సంస్థలు సైతం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పాకిస్థానీ కంటెంట్ విషయంలో అన్ని ప్లాట్‌ఫామ్‌లు ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 మే 8న కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన కంటెంట్‌ను భారతదేశంలో ప్రసారం చేయకుండా ఉండాలని అందులో సూచించింది. తాజాగా ఇదే మార్గదర్శకాలను పాటించాలని నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కాగా గతేడాది జూన్‌లోనూ పాకిస్థాన్‌లో నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను భారతీయ చందాదారులకు అందుబాటులో ఉంచబోమని నెట్‌ఫ్లిక్స్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రచయిత ఫర్హత్ ఇష్తియాక్ రాసిన నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటలీ నేపథ్యంలో ప్రేమ, రొమాన్స్ అంశాలతో ఈ కథను తెరకెక్కించారు. పాకిస్థాన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ సిరీస్ అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే, విడుదలకు ముందే భారత్‌లో దీనిపై వివాదం మొదలైంది. ఒకవైపు కళలు, వినోదానికి సరిహద్దులు ఉండకూడదనే అభిప్రాయాలు వినిపిస్తుండగా.. మరోవైపు జాతీయ భద్రత, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇండియాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ లేన‌ట్లే.

Updated Date - Nov 27 , 2026 | 08:36 AM