సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anbil Avan OTT Review: భార్య కోరిందని బంగ్లా కొన్న భర్త.. చివరికి ఏమైందంటే

ABN, Publish Date - Nov 21 , 2026 | 05:14 PM

విలక్షణ కథలను ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన యువ హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan) ప్రధాన పాత్రలో నటించిన తాజా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అన్బిల్ అవన్(Anbil Avan).

Anbil Avan

విలక్షణ కథలను ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన యువ హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan) ప్రధాన పాత్రలో నటించిన తాజా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అన్బిల్ అవన్(Anbil Avan). ఈ చిత్రానికి ఆర్. కార్తికేయన్ దర్శకుడిగా పరిచయమవ్వగా.. పోర్ తొజిల్ ఫేమ్ విఘ్నేష్ రాజా ఈ సినిమాకు కథను అందించాడు. అయింగరన్ ఇంటర్నేషనల్, హ్యాపీ హై పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, సబుమోన్ అబ్దుసమద్ కీలక పాత్ర పోషించాడు. ఇది హాలీవుడ్ చిత్రం స్ట్రా డాగ్స్, మలయాళ చిత్రం వరతన్ సినిమాకి అనధికారిక రీమేక్ అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది. ఈ శుక్రవారం నుంచి సోనీలీవ్ లో అన్బిల్ అవన్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం.


కథ విషయానికొస్తే.. ఏడేళ్ల ప్రేమ తర్వాత కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న సూర్య (అశోక్ సెల్వన్), ఇందు( ప్రీతి ముకుందన్).. నగరంలోని ఫైవ్‌స్టార్ హోటల్ ఉద్యోగాల్లో ఒత్తిడి, జీవన పోరాటంతో విసిగిపోతారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా, సొంతంగా ఒక అందమైన హోమ్‌స్టే ప్రారంభించాలనే ఇందు చిరకాల కలను నిజం చేయడానికి ఇద్దరూ తమ కష్టార్జితాన్ని, పొదుపును అంతా కలిపి ఒక సుందరమైన కొండ ప్రాంతానికి మకాం మారుస్తారు. అక్కడ మాజీ రాణి (రేవతి) వద్ద ఉన్న ఒక పురాతన బంగ్లాను ఎంతో కష్టపడి కొనుగోలు చేసి తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు.


అనుకున్నట్లుగానే కొత్త జీవితం సాఫీగా ప్రారంభమవుతున్న సమయంలో, ఆ ఊరిలోని అవినీతి, అక్రమ నెట్‌వర్క్‌తో వీరికి అనుకోని ఘర్షణ మొదలవుతుంది. స్థానికంగా పలుకుబడి ఉన్న దుర్మార్గుడైన ఎమ్మెల్యే రాజనాయగం (కదిర్‌బాలు), మోసపూరిత లాయర్ మార్టిన్ (సబుమోన్ అబ్దుసమద్), అవినీతి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తవసి (మహా ఢిల్లీ గణేష్) వంటి వారి టార్గెట్‌గా ఈ జంట మారుతారు. తమ కలల ఇంటినే ఒక భయంకరమైన ఉచ్చుగా మార్చేలా స్థానిక శక్తులు వీరిని వేధింపులకు, దాడులకు గురిచేస్తుంటాయి. ఉన్నదంతా పోగొట్టుకుని, ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి రావడంతో ఈ జంట ఏం చేశారు..? అసలు ఎమ్మెల్యేకి వీరిపై అంత పగ ఎందుకు.. ? చివరికి సూర్య.. ఇందు కలను నిజం చేశాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


దర్శకుడు ఆర్. కార్తికేయన్ తన తొలి సినిమా అయినప్పటికీ, రొమాన్స్, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో బ్యాలెన్స్ చేయడంలో సఫలమయ్యాడు. మొదటి భాగం హీరో హీరోయిన్ల మధ్య సాగే అందమైన ప్రేమ సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సాగితే, ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా ఒక్కసారిగా గేర్ మారుస్తుంది. భార్య కోసం భర్త ఏదైనా చేస్తాడు అనే పాయింట్ తోనే సెకండాఫ్ మొదలవుతుంది. కొద్దిగా లాగ్ ఉన్నా కూడా హీరో ఏం చేస్తాడు.. ? విలన్స్ ని ఎలా దెబ్బ కొడతాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేలా సస్పెన్స్ ని కొనసాగించాడు డైరెక్టర్. విఘ్నేష్ రాజా అందించిన కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఛేజింగ్ సీక్వెన్సులు, మైండ్ గేమ్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఉత్కంఠను మరింత పెంచగా, సినిమాటోగ్రఫీ విజువల్స్ ఎంతో రిచ్‌గా, నేచురల్‌గా ఉన్నాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో వేగం కాస్త తగ్గినట్లు అనిపించినా, క్లైమాక్స్ ఇచ్చే కిక్ ఆ లోపాలను కప్పిపుచ్చుతుంది.


అశోక్ సెల్వన్ తన సహజమైన నటనతో, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పరిణతి కనబరిచాడు. ప్రీతి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, విలన్ ఛాయలున్న పాత్రలో సబుమోన్ అబ్దుసమద్ తనదైన మార్క్ విలనిజంతో భయపెట్టాడు. మొత్తంగా చెప్పాలంటే, బలమైన ఎమోషన్స్‌తో కూడిన గ్రిప్పింగ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి అన్బిల్ అవన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.

Updated Date - Nov 21 , 2026 | 05:15 PM