ఆరుపదుల 'శ్రీకృష్ణ తులాభారము'

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:55 PM

ఎన్టీఆర్‌, అంజలీదేవి, జమున ప్రధాన పాత్రలు పోషించిన 'శ్రీకృష్ణతులాభారం' విడుదలై అరవై సంత్సరాలు పూర్తయ్యింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో డి. రామానాయుడు ఈ సినిమా నిర్మించారు.

Srikrishna Thulaabharamu Movie

శ్రీకృష్ణ పాత్రలో నటరత్నయన్టీఆర్ అనేక చిత్రాల్లో మెప్పించారు.. అరవై ఏళ్ళ క్రితం వెలుగు చూసిన 'శ్రీకృష్ణతులాభారము'లోనూ యన్టీఆర్ అభినయం అనితరసాధ్యంగా సాగింది. ఆ చిత్ర విశేషాలను మననం చేసుకుందాం.

అప్పటికే ఏడు పౌరాణిక చిత్రాల్లో నటరత్నయన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలో జీవించారు. ఆయన తెరపై కృష్ణునిగా కనిపిస్తే చాలు ప్రేక్షకులు భక్తిభావంతో హారతులు పట్టేవారు. అభిమానులు ఆనందంతో పరవశించిపోయేవారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు 'శ్రీకృష్ణ తులాభారము' చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'పద్మపురాణం'లో కనిపించే 'శ్రీకృష్ణతులాభారము' కథను నంది తిమ్మన 'పారిజాతాపహరణం'గా తెలుగు కావ్యం రచించారు. దీనిని నాటకంగా మలచి తెలుగునేలపై విశేషంగా ప్రదర్శించారు. ఆ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే 'శ్రీకృష్ణతులాభారము'.. సముద్రాల రచనతో రూపొందిన ఈ చిత్రం 1966 ఆగస్టు 25వ తేదీన విడుదలయింది. సత్యభామగా జమున అభినయం జనాన్ని ఆకట్టుకుంది.


భక్తికి దాసుడు స్వామి...

నరకాసురుడు అపహరించిన అదితి కర్ణకుండలాలను ఇవ్వడానికి స్వర్గానికి సత్య సమేతంగా వెళతాడు శ్రీకృష్ణుడు. అప్పుడే పారిజాతాపహరణం జరుగుతుంది. తరువాత తన పతి తనకే సొంతం కావాలన్న ఆలోచన సత్యభామకు కలుగుతుంది. అందుకు పతిని దానం చేసే వ్రతం ఉందని నారదుని సలహాపై అలాగే చేస్తుంది. నారదునికే శ్రీకృష్ణుని దానం చేస్తుంది. తరువాత తన చెంతనున్న ధన,కనక,ధనేతరంతో స్వామిని తులభారములో తూచినా సరిపోదు. శ్రీకృష్ణుని అంగడివీధిలో పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తాడు నారదుడు. చివరకు రుక్మిణీదేవి భక్తితో ఒక్క తులసీదళం త్రాసులో వేయగానే స్వామివారు సరితూగుతారు. భక్తికి దాసుడు శ్రీకృష్ణుడు అని చాటుతూ కథ సుఖాంతమవుతుంది. ఇందులో కొన్ని చోట్ల అనువుగా 'పారిజాతాపహరణం'లోని పద్యాలనే వినియోగించుకున్నారు.


'శ్రీకృష్ణతులాభారము' చిత్రంలో రుక్మిణిగా అంజలీదేవి, జాంబవతిగా కృష్ణకుమారి నటించారు. నారద పాత్రలో కాంతారావు, వసంతకునిగా పద్మనాభం, నళినిగా వాణిశ్రీ కనిపించారు. పెండ్యాల సంగీతం సమకూర్చారు. చందాల కేశవదాసు, ముత్తరాజు సుబ్బారావు, సముద్రాల, శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి, ఆరుద్ర పాటలు రాశారు. తరువాతి రోజుల్లో సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారానే దర్శకులైన జి.వి.శేషగిరిరావు, కె.బాపయ్య ఈ సినిమాకు అసోసియేట్స్ గా పనిచేశారు. 'శ్రీకృష్ణతులాభారము'లో యన్టీఆర్ ఎంతో అందంగా కనిపించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది. అయితే రెండువారాలకే యన్టీఆర్ జానపద చిత్రం 'పిడుగురాముడు' విడుదల కావడంతో జనం ఆ సినిమాను పరుగులు తీస్తూ చూశారు. అలా 'శ్రీకృష్ణతులాభారము' వసూళ్ళకు దెబ్బ పడింది. తరువాతి రోజుల్లో 'శ్రీకృష్ణ తులాభారము' నిర్మాతకు లాభాలు సంపాదించి పెట్టింది.

ఇవి కూడా చదవండి:

Arjun Das: దర్శకుడు ఏ మాత్రం తగ్గలేదు..

ఇరుముడి మణమ్మ జీవితంలో ఇంత విషాదమా.. కన్నీళ్లు వచ్చేస్తాయి

రష్మిక తల్లి కాబోతుందా...

Updated Date - Aug 25 , 2026 | 03:56 PM