సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Balakrishna: 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'సీతారామ కళ్యాణం'

ABN, Publish Date - Apr 18 , 2026 | 03:57 PM

నాడు 'యువరత్న'గా వెలుగొందుతున్న బాలకృష్ణతో జంధ్యాల రూపొందించిన 'సీతారామకళ్యాణం' విశేషాదరణ చూరగొంది. మ్యూజికల్ హిట్ గానూ నిలచిన ఈ చిత్రం 40 ఏళ్ళ క్రితం భలేగా సందడి చేసింది.

Seetharama Kalyanam Movie

పాటల పందిట్లో... 'సీతారామకళ్యాణం'

అంతకు ముందు బాలకృష్ణ హీరోగా జంధ్యాల 'బాబాయ్-అబ్బాయ్' వంటి హాస్యరస చిత్రం రూపొందించారు.. ఆ మూవీ అంతగా అలరించలేక పోయింది.. తరువాత బాలయ్య- జంధ్యాల కాంబోలో తెరకెక్కిన చిత్రం 'సీతారామకళ్యాణం'... యువచిత్ర బ్యానర్ లో బాలయ్యకు ఇదే మొదటి సినిమా... కె.మురారి నిర్మించిన ఈ సినిమా 1986 ఏప్రిల్ 18న విడుదలై విజయఢంకా మోగించింది... రజనీ నాయికగా నటించిన ఈ చిత్రానికి కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు... ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటలతో ఈ చిత్రం సంగీతాభిమానులను అలరించింది... ఇందులోని ఆరు పాటలూ ప్రేక్షకులను ఎంతగానో మురిపించాయి... "కళ్యాణ వైభోగమే... శ్రీసీతారాముల కళ్యాణమే...", "రాళ్ళల్లో ఇసకల్లో...", "ఏమని పాడను..." (వేటూరి), "వీళ్ళూ వాళ్ళూ ఎవరంటా...", "ఎంత నేర్చినా...", "పసుపు కెంపూ ఆకుపచ్చ నారింజ..." (ఆరుద్ర)- అంటూ సాగే పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను మురిపిస్తూనే ఉండడం విశేషం!

'సీతారామకళ్యాణం' చిత్రాన్ని టైటిల్ కు తగ్గట్టుగానే రూపొందించారు జంధ్యాల... సీతారాముల విగ్రహాలకోసం రెండు గ్రామాలు కొట్టుకోవడం, బంధుత్వాలు విడిపోవడం జరుగుతాయి... అందువల్ల బాల్యంలోనే భార్యాభర్తలు అనుకున్న బావామరదళ్ళు విడిపోతారు... వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ చిత్రకథ... ఈ కథను జంధ్యాల తన మార్కు హాస్యరచనతో భలేగా రక్తి కట్టించారు... ఇందులో జగ్గయ్య, రామకృష్ణ, సంగీత, గొల్లపూడి, రాజేశ్, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు తదితరులు నటించారు... బాలకృష్ణ, రజనీ జంట ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది... అలాగే ఇందులో శ్రీరామ, శివుడు గెటప్స్ లో బాలయ్య కనిపించడం విశేషం.


'సీతారామకళ్యాణం' చిత్రం విజయఢంకా మోగించింది... పోటీ చిత్రాలను పక్కకు నెట్టి విజయపథంలో మేటిగా నిలచింది... 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది... అంతకు ముందు దేశంలో తొలిసారి యన్టీఆర్ 'అడవిరాముడు' (1977) రోజూ 5 ఆటలతో నెల్లూరు కనకమహల్ లో 102 రోజులు ప్రదర్శితమై రికార్డ్ నెలకొల్పింది... ఆ తరువాత తిరుపతి- మినీప్రతాప్ లో రోజూ 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా 'సీతారామకళ్యాణం' నిలచింది... ఆ పై ఇతర హీరోల సూపర్ హిట్ మూవీస్ కూడా 5 ఆటలతో వంద రోజులు ఆడే సంప్రదాయానికి 'సీతారామకళ్యాణం' శ్రీకారం చుట్టింది.... అలా ట్రెండ్ సెట్టర్ గా నిలచిందీ చిత్రం... ఇక అనంతపురం గంగలోనూ రోజూ 4 ఆటలతో 'సీతారామకళ్యాణం' శతదినోత్సవం జరుపుకోవడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు... ఏది ఏమైనా 1986లో బాలయ్య వరుసగా ఆరు విజయాలు సాధించిన రికార్డులో 'సీతారామకళ్యాణం' రెండో సినిమాగా నిలచింది.


ఫ్యాన్స్ బాధను మరిపించిన బాలయ్య సినిమా !

నటసింహ నందమూరి బాలకృష్ణ మంచి క్రికెటర్ అని అందరికీ తెలుసు. బాలయ్య ఫ్యాన్స్ లోనూ అత్యధికులు క్రికెట్ అభిమానులుగా మారడానికి ఆయనే కారణం. ఈ నేపథ్యంలోనే 1985లో బాలయ్య నటించిన 'పట్టాభిషేకం' విడుదల సందర్భంలో కర్నూలు, నంద్యాల, బళ్ళారి, గుంతకల్ వంటి సెంటర్స్ లో బాలయ్య ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచెస్ నిర్వహించారు. తరువాతి రోజుల్లో ఈ సంప్రదాయాన్ని ఆయన బర్త్ డే సందర్భంగా కొనసాగించారు. అలాంటి అభిమానులు 'సీతారామకళ్యాణం' విడుదలైన 1986 ఏప్రిల్ 18న కొందరు ఈ మూవీని తొలి ఆట చూడలేదు. కారణం అదే రోజున షార్జాలో 'ఆస్ట్రల్ ఆసియా కప్' ఫైనల్- ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ లో క్రికెట్ అభిమానులందరూ ఆ 'ఒన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్'కు అతుక్కుపోయారు. అది యాభై ఓవర్ల మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్స్ కోల్పోయి 245 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 242 పరుగులతో యాభై ఓవర్ లో చివరి బంతిని ఎదుర్కొనే స్థితిలో ఉంది. బ్యాటింగ్ పొజిషన్ లో జావేద్ మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. అప్పటికే మియాందాద్ 110 పరుగులు చేశాడు. చివరి బంతికి మియాందాద్ ను చేతన్ ఔట్ చేస్తే పాక్ ఆల్ ఔట్ అయి, ఇండియా గెలుస్తుంది. ఆ మ్యాచ్ ను టీవీల్లో చూస్తున్నవారందరిలోనూ తీవ్రమైన ఉత్కంఠ! ఎట్టి పరిస్థితుల్లో మియాందాద్ బౌండరీ కొట్టాలి. ఆ మ్యాచ్ ను టీవీల్లో చూస్తున్నవారందరిలోనూ తీవ్రమైన ఉత్కంఠ! అందరూ ఊపిరి బిగబట్టి చూసిన ఈ మ్యాచ్ లో 'చివరి బంతిని సిక్సర్ గా కొట్టి' పాక్ ను విజేతగా నిలిపాడు మియాందాద్. 'ఒన్ డే ఇంటర్నేషనల్స్'లో లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి విజయం సాధించడం అన్నది అలా నలభై ఏళ్ళ క్రితం మొదలయింది. ఆ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో భారత్ ఓటమిని దేశవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.


అయితే బాలయ్య ఫ్యాన్స్ ఆ బాధను మరచిపోవడానికి అన్నట్టు 'సీతారామకళ్యాణం' సినిమాను చూడటానికి తండోపతండాలుగా వెళ్ళారు. ఈ చిత్రం వారి బాధను తుడిచేస్తూ 'సూపర్ హిట్' టాక్ ను సొంతం చేసుకుంది. ఇదే సినిమా రాయలసీమ - తిరుపతి-మినీ ప్రతాప్ లో రోజూ 5 ఆటలతో వంద రోజులు ఆడిన తొలి చిత్రంగానూ చరిత్రలో నిలచింది. దాంతో ఫ్యాన్స్ తరువాత సంబరాలు చేసుకున్నారు. ఈ నాటికీ ఆ నాటి 'ఆస్ట్రల్- ఆసియా కప్' ఫైనల్ ను తలచుకొనే బాలయ్య క్రికెట్ ఫ్యాన్స్ కు 'సీతారామకళ్యాణం' అలా గుర్తుండిపోయింది.

Updated Date - Apr 18 , 2026 | 04:24 PM