భానుప్రియతో వంశీ చివరి చిత్రం..: 'ఆలాపన'కు 40 ఏళ్లు

ABN , Publish Date - May 13 , 2026 | 09:46 AM

కొన్ని సినిమాలు టిక్కెట్ రేటుకు సరిపడా సంతోషాన్నిస్తాయి. మరికొన్ని అంతకు మించి ఆనందమిస్తాయి. ఇంకొన్ని మనసుల్లో తిష్ట వేసుకుంటాయి. నలభై ఏళ్ళ క్రితం డైరెక్టర్ వంశీ తీసిన 'ఆలాపన' మూడోరకానికి చెందింది.

Aalapana

నాలుగు పదుల సంవత్సరాల క్రితం తమిళనాట హీరో మోహన్ (Mohan)కు యువతలో విశేషమైన ఆదరణ ఉండేది. ఆయన నటించిన అనేక చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. అడపాదడపా తెలుగు సినిమాల్లోనూ నటించేవారు మోహన్. ఆయన హీరోగా, భానుప్రియ నాయికగా వంశీ (Vamsi) తెరకెక్కించిన చిత్రం ఆలాపన (Aalapana). అమరేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1986 మే 12న వెలుగు చూసింది.

ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకల్పన అతి పెద్ద ఆకర్షణ. ఇళయరాజా (Ilayaraja) బాణీలకు సి.నారాయణ రెడ్డి, వేటూరి పాటలు పలకించారు. అప్పటి దాకా వంశీ తెరకెక్కించిన చిత్రాలు నాలుగే. వాటిలో రెండు హిట్లు- రెండు ఫట్లు ఉన్నాయి. ఆయన రూపొందించిన ఐదో సినిమా 'ఆలపన'... ఈ సినిమా అందరినీ కాకపోయినా కొందరిని భలేగా ఆకట్టుకుంది.

పాత కథనైనా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసేవారు వంశీ. ఆయన పాటల చిత్రీకరణ, సీన్స్ టేకింగ్ అంటే ఈ నాటికీ ఇష్టపడేవారున్నారు. 'ఆలాపన' కథ విషయానికి వస్తే - అద్భుతమైన నర్తకి ఉషకి చిన్నప్పుడే బెనర్జీ అనే నీచుడితో పెళ్ళయి ఉంటుంది. చాలా ఏళ్ళ తరువాత వచ్చి ఉషను లోబరచుకోవాలని చూస్తాడు బెనర్జీ. వాడి నుండి పారిపోతూ ఓ రైలు ఎక్కుతుంది. ఓ పాట విని ఓ స్టేషన్ లో దిగుతుంది.

ఆ పాట పాడిన శివునితో పరిచయం, తరువాత అది ప్రణయంగా మారడం జరుగుతాయి. శివుని పాట, ఉష ఆట ఆనందంగా సాగుతాయని భావిస్తారు ఊరి జనం. బెనర్జీ వచ్చి ఉషని తీసుకువెళ్ళాలని చూస్తాడు. గ్రామస్థుల సాయంతో శివుడు, ఉష వాణ్ణి చంపేస్తారు. వారిద్దరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథను వంశీ వైవిధ్యంగా తెరకెక్కించారు.

భానుప్రియతో వంశీ చివరి చిత్రం..

వంశీ తన రెండో చిత్రం 'సితార'తో భానుప్రియను తెలుగు తెరకు పరిచయం చేశారు. తరువాత వరుసగా భానుప్రియ నాయికగా "అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన" చిత్రాలను తెరకెక్కించారు వంశీ. ఆ తరువాత ఎందుకనో వంశీ చిత్రాల్లో మళ్ళీ భానుప్రియ కనిపించలేదు.

అయితే ప్రతి చిత్రంలోనూ భానుప్రియలోని ప్రతిభను అద్భుతంగా ఆవిష్కరించారు వంశీ. భానుప్రియలోని నర్తకిని 'ఆలాపన'లో చక్కగా జనం ముందు నిలిపారు. 'ఆలాపన' చిత్రం మోహన్, భానుప్రియ, వంశీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక ఇందులోని ఇళయరాజా బాణీలు ఈ నాటికీ సంగీతాభిమానులను పులకింప చేస్తూనే ఉన్నాయి.

Updated Date - May 13 , 2026 | 09:46 AM