NT Ramarao: హిందీ 'దో ఆంఖే బారా హాత్' ఆధారంగా 'మా దైవం'

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:36 PM

నటరత్న యన్టీఆర్ నటించిన 'మా దైవం' అభిమానులకు ఆనందం పంచింది. యాభై ఏళ్ళ క్రితం విడుదలైన 'మా దైవం' కొన్ని విశేషాలకు నెలవయింది. అప్పట్లో 'మా దైవం' సాగిన తీరును గుర్తు చేసుకుందాం.

Maa Daivam Movie

నటరత్న యన్టీఆర్ హిందీ రీమేక్స్ తో వరుస విజయాలు సాధిస్తున్న సమయమది. 1974లో 'నిప్పులాంటి మనిషి' ఘనవిజయంతో యన్టీఆర్ తో హిందీ రీమేక్స్ తెరకెక్కించాలని నిర్మాతలు పరుగులు తీశారు. అంతకు ముందు కూడా యన్టీఆర్ కెరీర్ లో హిందీ రీమేక్స్ ఉన్నప్పటికీ 'నిప్పులాంటి మనిషి' ఘనవిజయం తెలుగు చిత్రసీమలోనే హిందీ కథలకు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. ఈ క్రమంలో అప్పటి నుంచీ యన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళే దాకా ప్రతీయేటా ఒక్క హిందీ రీమేక్ అయినా ఉండేది. 1976లో యన్టీఆర్ హీరోగా నాలుగు హిందీ రీమేక్స్ వెలుగు చూశాయి. అవి "ఆరాధన, మగాడు, నేరం నాదికాదు ఆకలిది, మా దైవం". ఈ చిత్రాలన్నిటిలోకి 'ఆరాధన' బిగ్ హిట్ గా నిలచి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. యన్టీఆర్ గ్లామర్ ను చూసి ఆయనతో దుష్యంతుని పాత్ర వేయించాలని ఆశించారు ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్. అలాంటి శాంతారామ్ తెరకెక్కించిన చిత్రాల్లో ఆణిముత్యం లాంటి సినిమా 'దో ఆంఖే బారా హాత్'. ఆ సినిమా ఆధారంగానే 'మా దైవం' చిత్రం రూపొందింది. ఉదయం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వం వహించారు. 1976 సెప్టెంబర్ 17న 'మా దైవం' విడుదలయింది. ఇందులోని కథాంశం, పాటలు ఆకట్టుకున్నాయి.


తల్లీకూతుళ్ళ సరసన నాయకునిగా నటించి అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం. అంతకు ముందు తల్లీకూతుళ్ళు సంధ్య- జయలలితతో హీరోగా నటించిన రామారావు 'మా దైవం'లో నటి అమ్మాజీ కూతురు జయచిత్రతో నాయకునిగా నటించడం విశేషం. అమ్మాజీని కొన్ని చిత్రాల్లో జయశ్రీగానూ పేర్కొన్నారు. ఈమె 'రాజు-పేద' చిత్రంలో యన్టీఆర్ కూతురుగా నటించారు. తరువాత 'దైవబలం' సినిమాలో రామారావు జంటగా జయశ్రీ కనిపించారు. అలా యన్టీఆర్ తో నటి జయశ్రీ చిత్రబంధం ప్రత్యేకమైనది. ఆమె కూతురు జయచిత్ర 'మా దైవం'లో యన్టీఆర్ నాయిక కావడంతో ఈ సినిమాకు ఓ స్పెషల్ బజ్ నెలకొంది. తరువాత యన్టీఆర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం'లో ఎరుకలసాని పాత్రలో కాసేపు కనిపించారు జయచిత్ర. యన్టీఆర్ 'బొబ్బిలిపులి'లో ఆయన భార్యగా నటించారు జయచిత్ర. ఇలా యన్టీఆర్ తో జయచిత్ర తక్కువ చిత్రాల్లో నటించినా జనం మదిలో నిలచే పాత్రల్లో కనిపించారు.


'దో ఆంఖే బారా హాత్' సినిమాలో శాంతారామ్ నటించి, దర్శకత్వం వహించారు. ఆ సినిమా 1957 టాప్ హిట్స్ లో ఒకటిగా నిలచింది. దాదాపు 19 ఏళ్ళ తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో 'మా దైవం'గా తెరకెక్కించడం విశేషం. ఆరుమంది నరరూపరాక్షసుల లాంటి ఖైదీలను తన మానవత్వంతో మార్చివేసే ఓ జైలర్ కథ ఇది. శాంతారామ్ సినిమాలో హీరో చివరలో మరణిస్తాడు. 'మా దైవం'లో యన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని హీరో జీవించి ఉండేలా మార్చారు. ఈ సినిమాకు డి.వి.నరసరాజు రచన చేశారు. ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, రాజశ్రీ రాసిన పాటలకు కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త నారాయణగురు చాటిన 'ఒకే కులం ఒకే మతం.అందరు ఒకటే... 'అన్న భావనతో రూపొందిన రాజశ్రీ గీతం 'మా దైవం' సినిమాకు ఓ ఎస్సెట్ అని చెప్పవచ్చు. నాగభూషణం, నంబీయార్, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, భీమరాజు ఖైదీలుగా నటించారు. రాజనాల, గిరిబాబు, పండరీబాయి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు

Updated Date - Sep 17 , 2026 | 12:50 PM