సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:44 PM

తన అమృత గాత్రంతో దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన గాన కోకిల, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.

MS Subbulakshmi Biopic Launch

తన అమృత గాత్రంతో దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన గాన కోకిల, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి (M.S. Subbulakshmi) జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాన్-ఇండియా బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహిస్తుండగా, ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా ఈ ప్రాజెక్ట్‌ను లెజెండరీ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. రశ్మిక మందన్నపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కమల్ క్లాప్ కొట్టారు. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకనాయకుడు కమల్ హాసన్ (Ulaganayagan Kamal Haasan) మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ తన గానంతో దేశాన్ని, ముఖ్యంగా దక్షిణాదిని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె పాడిన సుప్రభాతం, లలితా సహస్రనామం, రంగపుర విహార వింటే మనసు భక్తితో పరవశిస్తుంది. స్వయంగా మహాత్మా గాంధీ సైతం ఆమెకు పెద్ద అభిమాని. ఈ దేశ స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఐకానిక్ ఉమెన్ ఆమె. రశ్మికను చూస్తే నాకు అసూయ కలగడం లేదు, ఎందుకంటే గడ్డం తీసేసినా నేను ఆ పాత్రలో నటించి మెప్పించలేను. ఈ గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్‌లకు అభినందనలు. ఈ సినిమాతో అనిరుధ్ సంగీత ప్రస్థానం మరో స్థాయికి వెళ్తుంది’’ అని కొనియాడారు. రశ్మిక మందన్న స్పందిస్తూ.. ‘‘ఈ వేదికపై నిలబడితే సాక్షాత్తూ దేవుడి సమక్షంలో ఉన్నట్లే ఉంది. ఎంఎస్ అమ్మ జీవిత ప్రయాణంలో ఓ చిన్న భాగంగా మారడం నా అదృష్టం, ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా కష్టపడతాను’’ అని భావోద్వేగంగా తెలిపారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. ‘‘గతేడాదిగా మా యూనిట్‌కు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పేరే ఒక మంత్రంలా మారింది. మధురైలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఆమె కేవలం సంగీతకారిణి మాత్రమే కాదు.. ఓ కూతురిగా, కళాకారిణిగా, మహిళగా ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు చూసిన అసాధారణ వ్యక్తిత్వం ఆమెది. నేటి కాలంలో సోషల్ మీడియా లైక్స్, ఫాలోయర్లతో సక్సెస్‌ను కొలుస్తున్నారు, కానీ అమ్మ జీవితకాల క్రమశిక్షణ, ఓర్పుతో ఆ శిఖరాలను అధిరోహించారు. అదే విషయాన్ని ఈ సినిమా ద్వారా నేటి తరానికి చాటిచెప్పబోతున్నాం’’ అని వివరించారు.


నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వెనుక దాదాపు ఏడెనిమిదేళ్ల సుదీర్ఘ రీసెర్చ్ ఉందని, ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మే తమను, రశ్మికను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకుందని తాము బలంగా నమ్ముతున్నామని, ఆమె సంగీతాన్ని రీక్రియేట్ చేసే సాహసం చేయకుండా అనిరుధ్ సహకారంతో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇస్తామని స్పష్టం చేశారు. యానిమేటర్‌గా ఉన్న తనను అల్లు అర్జున్ ప్రోత్సహించి నిర్మాతగా మార్చారని, ఈ గొప్ప సినిమా తీయడంతో నిర్మాతగా తన ప్రయాణానికి సార్థకత చేకూరిందని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఈ వేడుకలో సుహాసిని, శివకుమార్, సముద్రఖని, దర్శకుడు మహేంద్రన్, కలైపులి ఎస్. థాను, రాజేంద్రన్, కాట్రగడ్డ ప్రసాద్ తదితర ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులు శ్రీనివాసన్, చంద్రశేఖర్, మాల పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి!

కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు

‘లేతమనసులు’ చిత్రానికి 60 ఏళ్లు.. విశేషాలివే

నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు

Updated Date - Sep 16 , 2026 | 09:44 PM