కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు
ABN , Publish Date - Sep 16 , 2026 | 08:45 PM
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 18 మందితో నూతన బోర్డును ప్రకటించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది ప్రముఖులతో కూడిన నూతన బోర్డును కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం మూడేళ్ల కాలపరిమితికి లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ కొత్త కమిటీ బాధ్యతల్లో కొనసాగనుంది. 2017 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఈ బోర్డును అధికారికంగా కేంద్రం పునర్నిర్మించింది. ప్రస్తుతం సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా తెలుగు వారైన శశి శేఖర్ వేంపటి సారథ్యంలో ఈ బోర్డు పనిచేయనుంది.
ఈ నూతన పాలకవర్గంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda)కు అత్యంత ప్రతిష్టాత్మక స్థానం దక్కింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన సుప్రియ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి చిత్ర నిర్మాణ రంగంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా సమర్థవంతంగా నడిపించడమే కాకుండా.. సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిలో, వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమెకు కేంద్ర సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా చోటు దక్కడంపై టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సుప్రియ యార్లగడ్డతో పాటు సినీ, కళారంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ 18 మంది ప్యానెల్‌లో చోటు దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటీమణులు ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, సీనియర్ నటులు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, మనోజ్ జోషి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీ, దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్, వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతాంగేలను ఇతర సభ్యులుగా నియమించారు. దేశవ్యాప్తంగా సినీ సర్టిఫికేషన్ వ్యవహారాలు, రివైజింగ్ కమిటీల పనితీరును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నూతన కమిటీ బాధ్యతలు నిర్వర్తించనుంది. టాలీవుడ్ నుంచి సుప్రియకు ఈ ఉన్నత స్థానం లభించడం పట్ల పరిశ్రమ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి!
‘లేతమనసులు’ చిత్రానికి 60 ఏళ్లు.. విశేషాలివే
నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు
ఆ సినిమా కూడా ఫట్.. ఇక కేవీఎన్‌ను ‘కాకా’నే కాపాడాలి