Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్‌'!

ABN , Publish Date - Jul 14 , 2026 | 09:54 AM

ఐ.ఎం.డి.బి. పోర్టల్ లెక్కల ప్రకారం 'టాక్సిక్' చిత్రాన్ని చూడాలని ఉబలాట పడుతున్న వారు దాదాపు యాభై శాతం మంది ఉన్నారు. ఈ టాప్ టెన్ జాబితాలో తెలుగు సినిమాలు 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్', 'ప్యారడైజ్'కు చోటు దక్కింది.

Most Anticipated Indian Movies

భారతీయ సినిమా రంగానికి ఇవాళ ప్రాంతీయ హద్దులు లేవు. ఏ భాషలో రూపుదిద్దుకున్న అవి ఐదు ప్రధాన భారతీయ భాషల్లో డబ్ అయ్యి రిలీజ్‌ అవుతున్నాయి. ఒకవేళ ఒకే రోజున థియేటర్లకు రాకపోయినా... ఓటీటీల పుణ్యమా అని ఓ నెల రోజులు తిరగగానే వాటిని ఎవరికి వారు వాళ్ళ సొంత భాషల్లో చూసే సౌలభ్యం కూడా లభిస్తోంది. దాంతో స్వ, పర బేధం లేకుండా సినిమాలను జనాలు ఆదరిస్తున్నారు. అయితే... త్వరలో విడుదల కావాల్సి ఉన్న చిత్రాలలో జనాలు వేటిని ఎక్కువగా చూడాలని అనుకుంటున్నారనే విషయంలో ఐ.ఎం.డి.బి. ఓ జాబితాను సిద్థం చేసింది. దాని వెబ్ సైట్ లో నెటిజన్స్ ఏ సినిమాను ఎక్కువగా చూడాలనుకుంటున్నారో తెలిపింది. అయితే... ఇదే జాతీయ స్థాయిలో వర్తిస్తుందని కాదు... ఆ వెబ్ సైట్ వ్యూవర్స్ వరకూ తీసుకున్న లెక్క ఇది. అలా చూసినప్పుడు టాప్ టెన్ ప్లేస్ లో యశ్‌ నటించిన కన్నడ చిత్రం 'టాక్సిక్' అగ్రస్థానంలో ఉంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్‌'ను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఆగస్ట్ 26న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. నయనతార, కియారా అద్వానీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్న వారు 47 శాతం వుండటం విశేషం.

ఇక ఎక్కువ మంది చూడాలని అనుకుంటున్న చిత్రాలలో రెండవది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన 'జన నాయగన్'. ఈ సినిమా ఇదే నెల 24న విడుదల కాబోతోందని తెలుస్తోంది. విశేషం ఏమంటే ఈ సినిమాను కూడా వెంకట కె నారాయణే నిర్మించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటించింది. దీనిని చూడాలని కోరుకుంటున్న వారి శాతం 12.7గా ఉంది. ఈ రెండు ప్రాంతీయచిత్రాల తర్వాత జనాలు చూడాలని కోరుకుంటోంది 'ఆవారపన్ -2' సినిమా! నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన 'ఆవారాపన్ 2' మూవీలో ఇమ్రాన్ హష్మీ, సలీల్ ఆచార్య, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 9.4 శాతం చూడాలని భావిస్తున్నారు. నాలుగో స్థానంలోనూ హిందీ చిత్రమే నిలిచింది. జూలై 24న రాబోతున్న 'ఇంద్రజాల్' చిత్రాన్ని జగేశ్వర్ లలితా ధోబ్లే తెరకెక్కించారు. మహేశ్‌ నిఖమ్, షనాయ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. బ్రిటీష్‌ కాలం నాటి పురాతన నిధిని వెదికే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దీనిని చూడాలని 9.1 శాతం మంది కోరుకుంటున్నారు. ఇక ఐదవ స్థానంలో నిలిచిన చిత్రం 'డి.సి.'. ఈ తమిళ సినిమాను అరుణ్‌ మదేశ్వర్ తెరకెక్కించగా, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్ హీరోగా నటించగా, వామికా గబ్బి హీరోయిన్. ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతోంది. దీనిని వీక్షించాలని 7.4 శాతం మంది ఎదురు చూస్తున్నారు.


చిత్రం ఏమంటే.. ఈ సినిమాల జాబితాలో ఆరవ స్థానంలో ఓ హిందీ వెబ్ సీరిస్ నిలిచింది. 'ఆదర్శ్‌ బాల విద్యాలయం' అనే వెబ్ సీరిస్ ను చూడాలని 2.9 శాతం మంది ఆశపడుతున్నారు. దాని తర్వాత స్థానంలో హిందీ బయోపిక్ 'ఈత' నిలిచింది. సుప్రసిద్థ మరాఠీ జానపద నృత్య కళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది. దీన్ని చూడాలని 2.9 మంది కోరుకుంటున్నారు. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే ఏడవ స్థానంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' నిలిచింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. దీనిని చూడాలని కోరుకుంటున్న వారి శాతం కూడా 2.9 కావడం విశేషం. అలానే దానికి ఒక్కశాతం తక్కువతో తొమ్మిదవ స్థానంలో నాని 'ది పారడైజ్' మూవీ నిలవగా, 'మీర్జాపూర్ : ద ఫిల్మ్' పదవ స్థానంలో 2.8 శాతంతో నిలిచింది. అయితే... ఐ.ఎం.డి.బి. వెబ్ సైట్ లెక్కల ప్రకారం ఈ వరుసను పరిగణనలోకి తీసుకోవాలి తప్పతే... ప్రాంతాల వారిగా చూసినప్పుడు సహజంగా తమ సొంత చిత్రాలను చూడాటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతారనేది మరువరాదు.

ఇవి కూడా చదవండి:

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

Updated Date - Jul 14 , 2026 | 09:57 AM