‘ది ఏజ్ ఆఫ్ భారత్’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరో అడుగు
ABN, Publish Date - Nov 18 , 2026 | 02:36 PM
భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతోన్న దేశపు మొట్టమొదటి ట్రిపుల్-ఏ డార్క్-ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ గేమ్ ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది.
భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతోన్న దేశపు మొట్టమొదటి ట్రిపుల్-ఏ (AAA) డార్క్-ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ గేమ్ ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ (The Age of Bhaarat) నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిష్టాత్మక గేమ్ మోషన్ క్యాప్చర్ (Motion Capture) ప్రొడక్షన్ కోసం తారా గేమింగ్ (Tara Gaming) సంస్థ, హైదరాబాద్‌లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్, మిహిర విజువల్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘A and M మోక్యాప్ ల్యాబ్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హాలీవుడ్ సంస్థ ‘యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్’ సాంకేతిక భాగస్వామిగా ఉన్న ఈ ల్యాబ్, భారతదేశంలోనే అతిపెద్ద మోషన్ క్యాప్చర్ స్టేజ్‌ను కలిగి ఉందనే విషయం తెలియంది కాదు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రచయిత అమిష్ త్రిపాఠి, నౌరెడిన్ అబౌద్ సహ-వ్యవస్థాపకులుగా ఉన్న తారా గేమింగ్ సంస్థ, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత ముకుల్ దేవ్రా భాగస్వామ్యంతో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ను అభివృద్ధి చేస్తోంది. సుమారు 205 మందికి పైగా అంతర్జాతీయ నిపుణుల బృందంతో ‘అన్రియల్ ఇంజిన్’ (Unreal Engine)పై ఈ గేమ్‌ను నిర్మిస్తున్నారు. భారతీయ సినీ వారసత్వం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసిన ఈ భాగస్వామ్యం, ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో దేశీయ AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తారా గేమింగ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నికోలస్ గ్రానాటినో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రేక్షకులకు ఒక విలక్షణమైన, అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం ద్వారా గ్లోబల్ గేమింగ్ రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సీటీఓ (CTO) సి.వి. రావు మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో తమకున్న సుదీర్ఘ అనుభవం, అత్యాధునిక మోషన్ క్యాప్చర్ నైపుణ్యంతో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌కు సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని, సినిమా అలాగే గేమింగ్ రంగాల కలయికలో ఇది ఒక అద్భుతమైన ముందడుగు అని తెలిపారు. ఇప్పటికే ‘వారణాసి’, ‘బాహుబలి: ఎటర్నల్ వార్’ వంటి భారీ చిత్రాలకు మోషన్ క్యాప్చర్ సేవలను అందించిన A అండ్ M మోక్యాప్ ల్యాబ్, ఇప్పుడు ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్‌కు కూడా తన పూర్తిస్థాయి సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఈ గేమ్ ఇప్పటికే స్టీమ్ (Steam), ఎపిక్ గేమ్స్ స్టోర్ (Epic Games Store) లలో అందుబాటులో ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
‘కింగ్100’ సినిమాపై ఇంత సైలెన్స్ ఎందుకు?
మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
సోల్‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?