నేపాల్‌కు ‘చేయూతనివ్వండి’.. రంగంలోకి రియల్ హీరో
ABN, Publish Date - Sep 04 , 2026 | 12:13 PM
కష్టాల్లో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచి ‘రియల్ హీరో’గా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
కష్టాల్లో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచి ‘రియల్ హీరో’ (Real Hero)గా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవల ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్‌లో ఆయన స్వయంగా పర్యటించారు. వరదల ధాటికి (Nepal Floods) తీవ్రంగా దెబ్బతిన్న నువాకోట్ తదితర ప్రభావిత ప్రాంతాలకు తన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ బృందంతో కలిసి వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. మోకాళ్ల లోతు బురద, కొట్టుకుపోయిన రోడ్ల గుండా నడుచుకుంటూ వెళ్లిన సోనూసూద్.. సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను, చిన్నపిల్లలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను కదిలిస్తోంది.
ఆ వీడియోలో అక్కడి హృదయ విదారక పరిస్థితులను వివరిస్తూ సోనూసూద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రకృతి ప్రకోపానికి ఇక్కడి గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మూడు, నాలుగు అంతస్తుల భవనాలు సైతం బురద, శిథిలాల కింద కూరుకుపోయి కనిపిస్తున్నాయి. ఎంతో మంది తమ సొంత ఇళ్లను, ఆప్తులను కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి వేదన చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. సర్వస్వం కోల్పోయిన నేపాల్ తిరిగి నిలబడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం’’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
‘‘ఒక్కరితోనే అంతా సాధ్యం కాదు.. మనమందరం చేతులు కలిపితేనే ఈ విధ్వంసం నుంచి వారిని గట్టెక్కించగలం. ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి గూడు కల్పించేందుకు, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా మా వంతు పూర్తి సాయం అందిస్తున్నాం. ప్రపంచంలో మీరెక్కడున్నా సరే.. మీ స్తోమత కొద్దీ నేపాల్ బాధితులకు తోచిన సహాయం చేసి అండగా నిలవండి’’ అని పిలుపునిచ్చారు. ఈ వీడియోకు ‘నేపాల్‌కు మీ సహాయం కావాలి.. మీ వంతు చేయూతనివ్వండి’ అంటూ క్యాప్షన్ జోడించారు. విపత్తు వేళ హద్దులు చూడకుండా సరిహద్దులు దాటి నేపాల్ ప్రజలకు అండగా నిలుస్తున్న సోనూసూద్ సేవాతత్పరతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ట్విన్స్‌తో జన్మాష్టమి.. ఉపాసన షేర్ చేసిన పిక్ వైరల్
సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చరణ్, సుక్కు మూవీకి ముహూర్తం ఖరారు