పర్సంటేజ్ విధానానికై సుదీర్ఘ పోరాటం
ABN, Publish Date - Apr 11 , 2026 | 12:33 PM
సింగిల్ స్క్రీన్స్‌ను రెంటల్ విధానంలో నడపలేమని చెబుతున్నారు ప్రముఖ ఎగ్జిబిటర్ విజయేందర్ రెడ్డి. పర్సంటేజ్ ప్రకారం సినిమాలు ఆడటానికి అందరూ అంగీకరిస్తున్నారని, కానీ కొందరు నిర్మాతలు మోకాలడ్డుతున్నారని ఆయన వాపోయారు.
పర్సెంటేజ్ విధానానికి తాము అంగీకరించమంటూ ఇటీవల యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు బంతి తిరిగి ఎగ్జిబిటర్స్ కోర్ట్ లో పడినట్టు అయ్యింది. ఎగ్జిబిటర్స్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని, తమకూ థియేటర్లు ఉన్నాయని, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కలిసి కూర్చుకుని సమష్టి నిర్ణయం తీసుకోవాలని ప్రముఖ నిర్మాత యలమంచిలి రవిశంకర్ తెలిపారు. అయితే... పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనేది ఇవాళ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని దాదాపు పదిహేనేళ్ళుగా ఈ విషయంలో తాము పోరాటం చేస్తున్నామని ప్రముఖ ఎగ్జిబిటర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఒక ఎగ్జిబిటర్‌గా నేను చేస్తున్న విజ్ఞప్తిని ఆలకించండి. 1976 నుండి ఎగ్జిబిటర్‌గా ఉన్నాను. మా సమస్య ఎప్పటి నుండో ఉన్నదే. 2008-2009లో కె. ఎస్. రామారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వారు పర్సంటేజ్ ప్రకారం సినిమాలు ఆడమంటూ నిర్ణయం తీసుకుని సర్క్యులర్ పంపారు. ఆ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అప్పటి నుంచి ఈ పర్సంటేజ్ విధానంపై పోరాడుతున్నాం. అప్పుడే కె. ఎస్. రామారావు గారు రోజు రోజుకూ థియేటర్లు తగ్గిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాలంటే పర్సంటేజ్ విధానం తప్పనిసరి అని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ పర్సెంటేజ్ విధానం కావాలని మేం కోరుతూ వస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా పర్సంటేజ్ విధానం అమలులో ఉంది. భారతదేశం అంతటా కూడా అదే విధానం నడుస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో తప్ప అంతటా పర్సంటేజ్ విధానమే ఉంది. దయచేసి దానిని అమలు చేయమని కోరుతున్నాం' అని అన్నారు.
నిర్మాతలు ఎగ్జిబిటర్స్‌తో చేసుకుంటున్న ఒప్పందంతో తామే ఎక్కువ నష్టపోతున్నామని విజయేందర్ రెడ్డి తెలిపారు. 'మీరు అగ్రిమెంట్‌లో పర్సెంటేజ్ లేదా రెంట్ ఏది ఎక్కువ వస్తే అది అని రాసుకోవడం వల్ల మాకు నష్టమే జరుగుతోంది. ఉదాహరణకు పది లక్షలు వచ్చినప్పుడు మాకు రెండు లక్షలు ఇచ్చి మీరు ఎనిమిది లక్షలు తీసుకెళుతున్నారు. అదే ఒక లక్ష నెట్ వచ్చినప్పుడు మీకు యాభై నాకు యాభై అంటున్నారు. మాకు థియేటర్ మెయింటెనెన్స్‌కు వారానికి కనీసం 75 వేల నుండి 80 వేలు ఖర్చు వస్తోంది. వాటిని అందుకోలేక విపరీతమైన నష్టాల్లో ఉన్నాం. దయచేసి సింగిల్ థియేటర్స్ మనుగడ కొంతకాలం సాగాలంటే పర్సెంటేజ్ విధానం అయితేనే మాకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మీరు కూడా నాలుగు నెలల క్రితం సింగిల్ స్క్రీన్స్ కోసం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ అది ఏదీ ఇంప్లిమెంట్ కాలేదు. మొన్న కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పర్సెంటేజ్ ప్రకారమే ఆడదామని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి అందరూ ఇందుకు ఒప్పుకుంటున్నారు. దయచేసి మీరు కూడా తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కొంతకాలం నడవాలని అనుకుంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిర్మాతలు అన్యధా భావించొద్దు. మా మనుగడ కోసమే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది' అని ఆయన పేర్కొన్నారు.