కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ
ABN, Publish Date - Jul 13 , 2026 | 09:36 PM
డ్యాన్స్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న నేపథ్యంలో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డ్యాన్స్ అసోసియేషన్‌లో కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్గత విభేదాలు, వివాదాలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న నేపథ్యంలో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందిస్తూ.. ‘‘నేను గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టాననే ఒకే ఒక్క కారణంతో నాపై కక్ష గట్టారు. నేను బిగ్ బాస్ ముగించుకుని, ‘బీబీ జోడి’ విజేతగా నిలిచిన తర్వాత అసోసియేషన్ సభ్యురాలిగా నాకు సన్మానం చేయాలని జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీను అన్న ప్రతిపాదించారు. జానీ మాస్టర్ (Jani Master)పై కేసు పెట్టిన అమ్మాయికి వీరు ఎలా మద్దతు ఇస్తారనే కక్షతోనే అప్పటి నుంచి పాత విషయాలన్నీ తవ్వి తీస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు’’ అని శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేశారు.
ఆదివారం రోజు అసోసియేషన్‌లో ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదని కొందరు చెబుతున్న మాటలను ఆమె తీవ్రంగా ఖండించారు. జానీ మాస్టర్ అసిస్టెంట్లు అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీనుతో పాటు నాగేశ్ వంటి సీనియర్లపై భౌతిక దాడికి దిగేలా దూసుకువచ్చారని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనను మ్యాన్ హ్యాండ్లింగ్ అనకుండా ఇంకేమంటారని ఆమె ప్రశ్నించారు. అసోసియేషన్‌లో సెక్రటరీ లేదా ట్రెజరర్ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడాలని, కానీ ఏ తప్పూ చేయని ఈసీ మెంబర్లను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు. గత కమిటీ మీటింగ్స్ తాలూకు వీడియోలను పరిశీలిస్తే అవినీతికి ఈసీ సభ్యులు ఎవరూ సపోర్ట్ చేయలేదనే విషయం స్పష్టమవుతుందని, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో ఫెడరేషన్‌తో కలిసి పనిచేయడంపై వస్తున్న వివాదాలకూ ఆమె స్పష్టతనిచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా ఫెడరేషన్ పర్యవేక్షణలోనే తమ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని, గతంలో తమ వేతనాలు పెంచాలని చేసిన ప్రొటెస్ట్ సమయంలోనూ ఫెడరేషనే తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ‘‘ఫెడరేషన్ అనేది మాకు తల్లిదండ్రుల లాంటిది, మరి అలాంటి ఫెడరేషన్‌ను మేము ఎలా వదిలేస్తాం? ఇప్పుడున్న ప్రెసిడెంట్.. నాడు వేతనాల కోసం జరిగిన ధర్నాలో ఎక్కడ ఉన్నారు?’’ అని శ్రష్టి వర్మ ప్రశ్నించారు. నిన్నటి మీటింగ్‌లో కొందరు ఫెడరేషన్ వద్దంటూ చాలా రూడ్ గా, హార్ష్ గా బిహేవ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న తనతో పాటు ఉన్న శేఖర్ మాస్టర్ ఒపీనియన్ కూడా ఇదేనని, ఎలక్షన్స్ ఎలాగైనా పెట్టనివ్వండి కానీ ఫెడరేషన్ సహకారంతో, వారి సమక్షంలోనే జరగాలని కోరుకుంటున్నట్లు శ్రష్టి వర్మ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్యకి అన్నయ్యగా ఆ బాలీవుడ్ స్టార్.. నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!
పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది
‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!