పెళ్లికి సిద్ధమైన యువ హీరో శివ కందుకూరి.. డిసెంబర్‌లో వివాహం!
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:49 PM
యంగ్ హీరో శివ కందుకూరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహతో ఆయన వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌లో పెళ్లి జరగనుంది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, స్వర్గీయ శివానంద మూర్తి తనయుడు రాజ్ కందుకూరి. ఆయన తండ్రి ఆధ్యాత్మిక బాటలో సాగినా... రాజ్ కందుకూరి మాత్రం సినీ, వ్యాపార రంగాల్లో తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు. 'పెళ్ళిచూపులు', 'మెంటల్ మదిలో', 'చూసి చూడంగానే' వంటి సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే తండ్రి సద్గురు శివానంద మూర్తి ఇచ్చిన కథతో 'గౌతమ్ బుద్ధ' చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 'మై హార్ట్ ఈజ్ బీటింగ్' సినిమాను డైరెక్ట్ చేసి, అందులో కీలక పాత్రను పోషించారు. ఇదిలా ఉంటే రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి సైతం తండ్రి బాటలో సినిమాల్లోనే తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు, అయితే అది నటుడిగా! 'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి ఆ తర్వాత 'గమనం', 'మనుచరిత్ర', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'నవాబ్ కేఫ్' చిత్రాలలో హీరోగా నటించాడు. అలానే 'మనమే, అనగనగా' చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. 'మీట్ క్యూట్' ఆంథాలజీతో పాటు 'దేవిక అండ్ డేనీ' వెబ్ సీరిస్‌లో నటించాడు.

శివ కందుకూరి నటించిన 'టాల్కమ్ పౌడర్' సినిమా త్వరలో జనం ముందుకు రానుంది. ఈ క్రైమ్ కామెడీ సినిమాను సాయినాథ్ పొన్న డైరెక్ట్ చేయగా, దృషికా చందర్ హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ యంగ్ బ్యాచిలర్ హీరో పెళ్ళికి సిద్థమయ్యాడు. అతని వివాహం హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహతో నిశ్చయమైంది. డిసెంబర్‌లో వీరి వివాహం జరుగబోతున్నట్టు తెలిసింది. శివ కందుకూరి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించగానే తోటి నటీనటులు అతనికి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: నా భర్త విజయ్ దేవరకొండ ద్వారా.. సత్యసాయి తత్వం తెలిసింది
‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?
బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్