Rashmika Mandanna: నా భర్త విజయ్ దేవరకొండ ద్వారా.. సత్యసాయి తత్వం తెలిసింది
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:23 AM
పుట్టపర్తిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సినీనటి రష్మిక మందన్న పాల్గొన్నారు. మహిళా శక్తిపై ప్రశంసలు కురిపిస్తూ, తన భర్త విజయ్ దేవరకొండ ద్వారా సత్యసాయి తత్వం తెలుసుకున్నానని వెల్లడించారు.
మహిళా శక్తి అనంతమని, మనసుపెట్టి ఏ కార్యక్రమం చేపట్టినా తిరుగులేని విజయం సాధించగల సత్తా మహిళల సొంతమని సినీనటి రష్మిక మందన్న (Rashmika Mandanna) అన్నారు. సత్యసాయి 101వ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీసత్యసాయి (Sathya Sai)జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన మహిళా దినోత్సవంలో గురువారం ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
'నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు. భారతీయ మహిళలు దేనినైనా సాధించ గలరు. సత్యసాయి తన మాతృమూర్తి ఈశ్వరమ్మ కోరిక మేరకు ఏడు దశా బ్దాల కిందటే ఉచిత విద్య, వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. బాబా చేపట్టిన ఈ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. నా భర్త విజయ్ దేవరకొండ సత్యసాయి విద్యార్థి. ఆయన ద్వారా నాకు సత్యసాయి తత్త్వం, ఆధ్యాత్మికత గురించి తెలిశాయి..' అని తెలిపారు.
ప్రశాంతి నిలయం ప్రశాంత జీవనానికి వేదిక అని కొనియాడారు. మహిళలు.. కుటుంబం అనే గృహానికి మూల స్తం భాలని కర్ణాటక మాజీ చీప్ సెక్రటరీ వందిత శర్మ అన్నారు. 1968 వరకు మహిళా విద్యకు సరైన కళాశాలలో లేవని, ఆనాడే మహిళల అభివృద్ధికి పునాది వేస్తూ, అనంతపురంలో విలువలతో కూడిన విద్యను అందించే కళాశాలలను సత్యసాయి ప్రారంభించారని కొనియాడారు. ఇదంతా ఆయన తల్లి ఆశీస్సులతోనే జరిగిందని తెలిపారు.
కాగా, అంతకుముందు.. అనంతపురం సత్యసాయి మహిళా కళాశాల విద్యార్థులు అమ్మవారి కలశం, జ్యోతులతో ర్యాలీగా సాయికుల్వంత్ మందిరానికి చేరుకున్నారు. నటి రష్మిక, డాక్టర్ నీలం జై సాయి, కర్ణాటక మాజీ చీఫ్ సెక్రటరీ వందిత శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.