సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

ABN, Publish Date - Sep 14 , 2026 | 08:32 PM

త్వరలోనే హీరోయిన్ సమంత మాతృత్వపు మధురిమలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన సంప్రదాయ సీమంతం వేడుక అత్యంత పవిత్రంగా, వైభవంగా జరిగింది.

Samantha Seemantham

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జీవితంలో అత్యంత మధురమైన, నూతన అధ్యాయం మొదలైంది. త్వరలోనే ఆమె మాతృత్వపు మధురిమలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన సంప్రదాయ సీమంతం (Seemantham) వేడుక అత్యంత పవిత్రంగా, వైభవంగా జరిగింది. సాధారణ వేడుకలలా కాకుండా సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ క్రతువుకు సంబంధించిన ఫొటోలను సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పసుపు రంగు పట్టుచీరలో గర్భవతిగా నిండుదనంతో, చేతులకు గాజులు, మెడలో పూలమాలతో సమంత వెలిగిపోతుండగా.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. తన జీవితంలో జరిగిన ఈ దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని వివరిస్తూ ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

తన పోస్ట్‌లో సంప్రదాయాలపై తనకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తూ సమంత రాసుకొచ్చారు.. ‘‘మన సనాతన సంప్రదాయాలపై నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంది. ప్రతి పూజా విధానం వెనుక ఉన్న అసలైన అంతరార్థం నాకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఒక మంత్రం చేసే శబ్దంలో, ఉచ్ఛారణ ద్వారా వెలువడే దివ్యమైన శక్తిలో, తరతరాలుగా మన పెద్దలు కాపాడుకుంటూ వస్తున్న ప్రాచీన ఆచారాల్లో ఏదో ఒక నిగూఢమైన పరమార్థం దాగి ఉందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఈ వేడుకను నిర్వహించిన శ్రీవిద్య ఉపాసకులు ఒక్కో అడుగు వెనుక ఉన్న లోతైన ఆంతర్యాన్ని వివరించినప్పుడు.. ఈ పూజా విధానం ఎంతటి అర్థవంతమైనదో నాకు అర్థమైంది. ఇక్కడ ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. సమర్పించే ప్రతి నైవేద్యానికి ఒక విశిష్ట అర్థం ఉంది. పాటించే ప్రతి అడుగుకు ఒక ప్రాధాన్యత ఉంది’’ అని పేర్కొన్నారు.


ఈ ప్రత్యేక వేడుక గురించి సమంత విపులంగా వివరిస్తూ.. ‘‘శ్రీవిద్య సంప్రదాయంలో ‘కళా ఆవరణ’ (శ్రీ కల్పం) అనేది అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక పూజా విధానం. దేవీమాతకు చెందిన 94 దివ్య కళలను, కాబోయే తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా ఆరాధించడం ఈ పూజ ముఖ్య ఉద్దేశం. పవిత్రమైన తీర్థం, వేద మంత్రాల ద్వారా ఆ శక్తి కేంద్రాలను శుద్ధి చేసి, చైతన్య పరిచి.. ఆ దివ్య స్పృహ గర్భవతి గుండా ప్రవహించేలా చేస్తారు. అన్నింటికంటే నన్ను ఎక్కువగా కదిలించిన విషయం ఏమిటంటే.. ఈ క్రతువులో కాబోయే తల్లిని కేవలం ఒక మహిళగా కాకుండా సాక్షాత్తూ ఆ పరాశక్తిగా, మరో ప్రాణానికి జీవం పోస్తున్న సృష్టికర్తగా భావించి పూజిస్తారు. ఇది ఆమె కడుపులో ఎదుగుతున్న పసికందుకు మాత్రమే కాదు.. అమ్మగా సరికొత్త రూపం దాల్చుతున్న స్త్రీకి లభించే అద్భుతమైన ఆశీర్వాదం’’ అని తెలిపారు.

అభిషేకం పూర్తయిన తర్వాత చోటుచేసుకున్న పవిత్ర ఘట్టాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అభిషేకం అనంతరం కాబోయే తల్లిని శ్రీచక్ర యంత్రం కేంద్ర స్థానంలో కూర్చోబెడతారు. ఆధ్యాత్మిక సాధనలో వివిధ దశలను సూచించే తొమ్మిది ఆవరణలు ఈ శ్రీచక్రంలో ఉంటాయి. వాటన్నింటి మధ్యలో సృష్టి మూలాన్ని, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి సాన్నిధ్యాన్ని సూచించే ‘బిందు’ స్థానం ఉంటుంది. ఆ సమయంలో ‘దేవీ ఖడ్గమాల’ స్తోత్ర పఠనం జరుగుతుంది. ఈ తొమ్మిది ఆవరణలతో ముడిపడి ఉన్న దేవతల, దివ్య శక్తుల నామాలను జపిస్తారు. ఈ పఠనం క్రమంగా వెలుపలి పొరల నుంచి లోపలి కేంద్ర బిందువు వైపు సాగుతూ.. మనసును అంతర్ముఖం చేసి రక్షణను, దివ్యాశీస్సులను ఆహ్వానిస్తుంది. ఈ నిరంతర మంత్రోచ్ఛారణ తల్లితో పాటు ఆమె గర్భంలోని బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. బిడ్డ భూమిపైకి అడుగుపెట్టక ముందే పవిత్ర మంత్రాల ద్వారా ఒక దివ్య సంస్కారాన్ని అందించడం ఇందులో భాగం. అక్కడ కూర్చుని, నాకోసం.. నా కడుపులోని బిడ్డ కోసం ఏ శక్తిని ఆవాహన చేస్తున్నారో తెలుసుకుంటూ అనుభవించడం మాటల్లో చెప్పలేనంతటి మహత్తరమైన శక్తిని ఇచ్చింది’’ అని సమంత భావోద్వేగంగా వెల్లడించారు.


చివరిగా తన మనసులోని కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తూ.. ‘‘ఈ వేడుక ప్రారంభమైనప్పుడు దీని గురించి నాకేమీ తెలియదు. కానీ పూజ పూర్తయ్యేసరికి సాక్షాత్తూ ఆ దైవం నన్ను ఆశీర్వదించి, కవచంలా రక్షిస్తున్న భావనతో బయటకు వచ్చాను. ఇంతటి అద్భుతమైన, పవిత్రమైన అనుభవాన్ని పొందే అవకాశాన్ని నాకు కల్పించిన నా మిత్రురాలు శిల్పా రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు.

మన చుట్టూ ఉన్న ప్రాచీన సంప్రదాయాల్లోని జ్ఞానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నేను కాబోతున్న ‘అమ్మ’ అనే సరికొత్త రూపానికి.. భగవంతుడు నన్ను నమ్మి నా చేతుల్లో పెట్టిన ఆ చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’ అంటూ సమంత తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఆమె ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

‘జెన్ జీ’ నాడి పట్టుకోవడం బ్రహ్మవిద్యా.. మరి ఇదేంటి?

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

Updated Date - Sep 14 , 2026 | 08:35 PM