శ్రుతి మించి రాగాన పడుతున్న పర్శంటేజ్ వ్యవహారం
ABN, Publish Date - Apr 09 , 2026 | 03:15 PM
యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కోసం వెలసిన 'గిల్డ్'లో 'పర్సంటేజ్ సిస్టమ్' సెగ కారణంగా బీటలు వారుతున్నాయి. రెంటల్ సిస్టమ్‌తో ఎంచక్కా ఎంజాయ్ చేసిన కొందరు నిర్మాతలు ఇప్పుడు 'పర్సంటేజ్ సిస్టమ్'ను వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు 'పర్సంటేజ్'కు జై కొడుతోంటే, కొందరు ప్రొడ్యూసర్స్ మాత్రం 'నై' అంటున్నారు.
'రెంటల్ సిస్టమ్' కారణంగా సింగిల్ థియేటర్స్ మనుగడ కష్టమై పోయింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిబిటర్స్‌ను రక్షించే క్రమంలో 'పర్సంటేజ్ సిస్టమ్'ను అమలు చేయాలని అధిక శాతం సింగిల్ థియేటర్స్ వారు భావించారు. దీనికి మద్దతుగా ఇకపై తాము పర్సంటేజ్ సిస్టమ్ తోనే సాగుతామని హైదరాబాద్ నగరంలోని 23 థియేటర్స్ వారు మద్దతు ప్రకటించారు. అయితే ఈ 'పర్సంటేజ్ విధానం' ఇతర థియేటర్స్‌కూ వ్యాపిస్తే కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు నిర్మించిన తాము నష్టపోతామని వాపోతున్నారు 'యాక్టివ్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్'కు చెందిన కొందరు నిర్మాతలు. ఈ నేపథ్యంలో 'గిల్డ్'కు చెందిన 16 మంది 'పర్సంటేజ్ సిస్టమ్'ను వ్యతిరేకిస్తూ 'తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్'కు లేఖ రాయడం చర్చనీయాంశమయింది.
'గిల్డ్'లో విభేదాలు....
'యాక్టివ్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్'ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతలు ఆరంభించారు. తెలంగాణలో అధిక సంఖ్యలో థియేటర్లు చేతిలో ఉన్న దిల్ రాజు, సునీల్ నారంగ్ గిల్డ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఎగ్జిబిటర్స్ మనుగడ కోసం ఇటీవల బెంగళూరులో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఈ ఇద్దరితో పాటు మరికొందరు 'గిల్డ్' నిర్మాతలు కూడా మద్దతునిచ్చారు. ఈ 'పర్సంటేజ్ సిస్టమ్' అమలయితే భారీ నష్టం వాటిల్లుతుందని భారీ చిత్రాలు నిర్మిస్తున్న 16 సంస్థల అధినేతలు దీనిని వ్యతిరేకిస్తూ 'తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్'కు లేఖ రాశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్, స్రవంతి మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్, స్వప్న సినిమా, షైన్ స్క్రీన్స్, ఫస్ట్ ఫ్రేమ్, వృద్ధి సినిమాస్, వాల్ పోస్టర్ సినిమా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, బన్నీ వాస్ వర్క్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థల అధినేతలు ఉన్నారు. 'గిల్డ్'లోని కొందరు 'పర్సంటేజ్'కు జై కొడుతోంటే, ఈ 16 సంస్థల అధినేతలు 'నై' అంటూ ఉండడం చర్చనీయాంశమయింది. దీంతో 'గిల్డ్'కు బీటలు వారినట్టే అంటున్నారు తెలుగు సినీజనం.
ఏమిటి పరిష్కారం....!?
ఇక్కడో విచిత్రం కనిపిస్తోంది. 'గిల్డ్'లో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటివారు కూడా ఉన్నారు. వారు ఈ 16 మందికి మద్దతుగా నిలచినట్టు లేదు. అంటే వారు దిల్ రాజు, సునీల్ నారంగ్ వైపే ఉన్నట్టుగా భావించాలి. అయితే అరవింద్‌కు అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, ఎస్కేయన్, ధీరజ్ మొగిలినేని వంటివారు ఈ 16మంది జాబితాలో ఉండడం గమనార్హం!. అలాగే మొన్న 'పర్సంటేజ్ సిస్టమ్'కు జై కొడుతూ ముందుకు వచ్చిన హైదరాబాద్‌లోని 23 థియేటర్స్‌లోని కొన్ని థియేటర్స్‌కు, ఈ 16 మందిలోని కొందరికి అనుబంధం ఉండడం గమనార్హం. బాలానగర్ - విమల్ థియేటర్ ప్రస్తుతం 'మైత్రీ' సంస్థ అధీనంలోనే ఉంది. అలాగే నాచారం - వైజయంతీ థియేటర్‌కు 'స్వప్న సినిమాస్' అధినేత స్వప్నదత్‌కు బంధం ఉంది. మరి థియేటర్స్ పరంగా 'పర్సంటేజ్'కు జై కొడుతున్నవారే, నిర్మాతలుగా అదే విధానాన్ని వ్యతిరేకించడం వెనక సినిమాల హై బడ్జెట్ టెన్షన్ ఉందని టాక్. పర్శంటేజ్ విధానం అమలులోకి వస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవలసి ఉంటుంది. అయితే స్టార్స్, ముఖ్యమైన టెక్నీషియన్స్ దీనికి తలొగ్గి పారితోషికాలు తగ్గించుకోవాలి. అయితే అది సాధ్యమయ్యే పని కాదు. దాంతో ఈ నిర్మాతల పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి చందంగా మారుతుంది. పర్శంటేజ్ లేకుంటే అటు సింగిల్ థియేటర్స్ యజమానులు, అమలు చేస్తే గిల్డ్ లోని నిర్మాతలు ఎవరికి వారు తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భీతి చెందుతున్నారు. ఈ వ్యవహారం శ్రుతి మించి రాగాన పడి ఎవరికి వారు మంకుపట్టు పడితే ఏం జరుగుతుంది!? ఈ వ్యవహారాన్ని 'తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్' ఎలా పరిష్కరిస్తుందనేని చూడాలి.