పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:46 AM
హీరో మాట తూలడం- అతనిపై ట్రోల్స్ సాగడం.. హీరోయిన్స్ గ్లామర్ షో - అందులో వల్గారిటీ ఉందని సోషల్ మీడియాలో దాడి.. ఇలా ఓ కొత్త సినిమా వెలుగు చూసే ముందు ఎన్నెన్నో వివాదాలు. ఇవన్నీ ‘పబ్లిసిటీ స్టంట్స్’ అని కొందరు కొట్టి పారేస్తున్నారు.
హీరో మాట తూలడం- అతనిపై ట్రోల్స్ సాగడం.. హీరోయిన్స్ గ్లామర్ షో - అందులో వల్గారిటీ ఉందని సోషల్ మీడియాలో దాడి.. ఇలా ఓ కొత్త సినిమా వెలుగు చూసే ముందు ఎన్నెన్నో వివాదాలు. ఇవన్నీ ‘పబ్లిసిటీ స్టంట్స్’ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. అందులో కొన్ని వాస్తవాలే ఉన్నా జనాల్లో ఆసక్తి నాస్తి అవుతోంది.
ఆ'వేదన'తోనే ధనం..!
‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో దుమారం.. సినీజనం ఆడాళ్ళను ఆటబొమ్మలుగా చూస్తున్నారని పలువురు మహిళల ఆవేదన. ఆ వెంటనే డైరెక్టర్ సారీ చెప్పడం- సదరు దృశ్యాలను తొలగిస్తామని చెప్పడం చకచకా జరిగిపోయాయి. కొద్దిరోజులు సినిమాపై, హీరోయిన్, డైరెక్టర్ పై కూడా ట్రోల్స్ సాగాయి. సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్‌ను సపోర్ట్ చేస్తే మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ సందడి కొద్ది రోజులు నడిచింది. అలా ఈ మూవీ గురించి ముచ్చటించుకోవడంతో పబ్లిసిటీ బాగా సాగిందని పరిశీలకుల మాట. ఇదంతా ‘పీఆర్ స్టంట్’ అంటూ యూత్ కొట్టి పారేస్తున్నారు. ఇలాంటివి గతంలోనూ చాలా చూశామనీ అంటున్నారు.
అభిమానుల రూపంలో...
వేలాది మంది జనం సమక్షంలో ఎంతో పకడ్బందీగా సాగుతున్న ‘పెద్ది’ ఫంక్షన్ లో అచ్చు హీరో రామ్ చరణ్ లాగే ఉన్న ఓ అభిమాని ఎగిరి గంతేసి హీరోను చేరుకొని హంగామా క్రియేట్ చేశాడు.. తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. అంత సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఓ అనామకుడు ఎలా రాగలడు? అన్నది ప్రశ్న. ఇదీ పబ్లిసిటీ స్టంటే అంటున్నారు. ఈ మధ్యే రిలీజ్ అయిన హిందీ సినిమా ‘మై వాపస్ ఆవూంగా’ సినిమా చూసిన ఓ అభిమాని, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, నటుడు వేదాంగ్ రైనాను పట్టుకొని కన్నీరు మున్నీరు అయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది ఫక్తు పబ్లిసిటీ స్టంట్ అని జనం గుర్తించేశారు.
ఆ రోజుల్లోనే అలా..
తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఏ నాటి నుంచో ‘పబ్లిసిటీ స్టంట్స్’ క్రియేట్ చేస్తూనే ఉన్నారు సినీజనం. 1957లో తెలుగు సినిమా ‘తోడికోడళ్ళు’ మూవీకి బజ్ తేవడానికి ఆ సినిమాను బెజవాడ అమ్మవారు చూశారని ఓ టాక్ లేవదీశారు. అది అలా అలా పాకి.. సినిమాను జనం తండోపతండాలుగా చూడటానికి కారణమైంది. ఈ నాటికీ కల్ట్ క్లాసిక్‌గా నిలచిన ‘షోలే’ 1975 ఆగస్ట్ 15న రిలీజైంది. అయితే మొదట్లో ఆ సినిమాను విమర్శకులు తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. అది చూసిన చిత్ర రచయితలు ఆగస్ట్ 23వ తేదీన ‘షోలే’ సినిమా మేజర్ టెరిటరీలో కోటి రూపాయలు వసూలు చేస్తుందని ఓ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఓ సినిమా కోటి రూపాయలు పోగేయడమే విశేషం. హిందీ సినిమాకు మేజర్ టెరిటరీ అంటే ముంబై, దాని చుట్టుపక్కల ఉండే మెయిన్ సెంటర్స్.. ఒక్క ఆ ఏరియాలోనే కోటి రూపాయలు వసూలు చేస్తే, ఇండియా అంతా కలిపి ఎంత చేస్తుందో అన్న ఆసక్తి సినీ ఫ్యాన్స్‌లో కలిగింది. అది మౌత్ టాక్‌గా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత ‘షోలే’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి జిమ్మిక్స్ ఆ రోజుల్లోనే సాగాయి.
తరిగిన నమ్మకం...
టీవీ ఛానల్స్ ఊపందుకుంటోన్న రోజుల్లో ‘పబ్లిక్ టాక్’ అంటూ కొత్త సినిమాల దగ్గరకు వెళ్ళి జనం నాడి తెలుసుకొనేవాళ్ళు. అప్పట్లో ఎంతోమంది జనం టీవీలో కనిపిస్తామన్న ఉద్దేశంతో బాగున్న సినిమాకు, బాగోలేని మూవీకి కూడా ‘సూపర్ హిట్... హండ్రెడ్ డేస్ గ్యారంటీ..’ అంటూ కేకలు వేసేవారు. సదరు క్లిప్స్‌నే మూవీ మేకర్స్ తమ పబ్లిసిటీలోనూ ఉపయోగించుకొనేవారు. ఇప్పటికీ ఆ తంతు సాగుతున్నా, జనం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత కొత్త సినిమాలపై ఏదో ఒక వివాదం రేపడం దాంతో ప్రచారం చేసుకోవడమూ సాగుతూ వచ్చింది. ఇప్పటికీ ఆ పంథా సాగుతూనే ఉంది. దీనినీ ప్రేక్షకులు నమ్మడం లేదు.. దాంతో సినిమా యూనిట్‌కు చెందినవారే ఏదో ఒకటి పేలడం- దానిని కాంట్రవర్సీగా క్రియేట్ చేయడం చేస్తున్నారు. టాప్ స్టార్స్ కూడా ఈ విధానంలో సాగారు. దీనిని కూడా జనం కొట్టి పడేస్తున్నారు.
మెథడ్ మార్కెటింగ్...
తమ సినిమాల పబ్లిసిటీ కోసం ‘పీఆర్ టీమ్స్’ క్రియేట్ చేసిన జిమ్మిక్స్‌ను ఫాలో అవుతున్నారు కొంతమంది నటీనటులు. తమ సినిమాల రిలీజ్‌కు ముందు టీవీ స్టూడియోస్‌లో కూర్చొని యాంకర్‌తోనే మాటా మాటా పెంచుకొని గొడవ పడినట్టు సీన్ క్రియేట్ చేయడం వంటివి అన్ని చిత్రసీమల్లోనూ చోటు చేసుకుంది. కొందరు ప్రమోషనల్ ఫంక్షన్స్‌లోనే సెంటిమెంట్ పండిస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. మరికొందరు అదే పనిగా ఈ ప్రచార కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటన్నిటినీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తమ ప్రాజెక్ట్స్‌కు ఓ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ‘త్రీ ఇడియట్స్’ సమయంలో మారువేషంలో ఉన్న తనను గుర్తు పట్టండి అంటూ ఆమిర్ ఖాన్ ఓ ప్రచారం లేవనెత్తారు. ఇదే పంథాను ‘బాబీ జాసూస్’ టైమ్‌లో విద్యాబాలన్ కూడా అనుసరించారు. ఇలా నటీనటులే ప్రచారంలో పదనిసలు పలికించడం.. ‘మెథడ్ యాక్టింగ్’లాగా ‘మెథడ్ మార్కెటింగ్’ అని పేరుకు కారణమయ్యేలా చేసింది.
కలసి వచ్చేనా...!?
అందరూ ఎవరికి వారు తమ శక్తి మేరకు తాము నిర్మించిన చిత్రాలకు ఆదరణ పెరగాలని ‘పబ్లిసిటీ స్టంట్స్’పై ఆధారపడుతూనే ఉన్నారు. అసలు ఈ తరహా జిమ్మిక్స్ పనిచేస్తాయా అన్న అనుమానం కలగవచ్చు. కానీ, సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఏ చిన్న తప్పు దొర్లినా దానిని ట్రోల్ చేయడానికి యువతలో అత్యధికులు కాచుకు కూర్చుని ఉన్నారు. అలాంటివారు ఏదైనా వివాదం తలెత్తితే చాలు సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్నారు. ఆ తీరున ఉచిత ప్రచారం లభిస్తుందని పలువురు సినీజనం ఆశ. కొందరికి కలసి వస్తుంది.. మరికొందరు ఎన్ని చేసినా అచ్చిరాదు. వీటిని జనం పట్టించుకోవడం తగ్గించేశారు. అయినా మూవీ మేకర్స్ ‘పీఆర్ స్టంట్స్’ సాగిస్తూనే ఉన్నారు.. మరి దీనికి ముగింపు ఎప్పుడో..?
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!
పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి