పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో అభిమాని మృతి.. నిర్మాత ఎస్కేఎన్ సాయం
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:03 PM
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మాత ఎస్కేఎన్ ఆర్థిక సాయం
ఈ విషాద వార్త తెలుసుకున్న ప్రముఖ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరణించిన అభిమాని కుటుంబానికి బాసటగా నిలుస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు. తక్షణ సాయంగా ఆ కుటుంబానికి రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ స్పందిస్తూ.. ‘‘నేను కూడా ఒకప్పుడు రోడ్లపై బ్యానర్లు కడుతూ, కేవలం ఒక సాధారణ అభిమానిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. అందుకే తోటి అభిమాని పడే వేదన, అభిమానం విలువ, వారి ప్రాణాల ప్రాధాన్యత నాకు ఎంత లోతుగా తెలుసో మాటల్లో చెప్పలేను’’ అంటూ తన గత రోజులను గుర్తుచేసుకున్నారు.
‘‘అందులోనూ మన ప్రాణంగా భావించే హీరో పుట్టినరోజు నాడే, మన తోటి అభిమాని ప్రేమ్ కుమార్ ఇలా అకాలంగా మనందరికీ దూరమవ్వడం నా మనసును ఎంతగానో కలచివేసింది. ఈ అత్యంత క్లిష్ట సమయంలో ప్రేమ్ కుమార్ కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక తోటి మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి కుటుంబానికి కలిగిన పుత్రశోకాన్ని ఏదీ భర్తీ చేయలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయంగా రూ. 2,00,000 అందించడం ద్వారా నా ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. మన అభిమాని కుటుంబానికి మనమందరం ఒకరికొకరం అండగా నిలబడాలి’’ అని ఎస్కేఎన్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా అభిమానిగా ఎదిగి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, బాధితుడి కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత ఎస్కేఎన్ ఔదార్యంపై పవన్ అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు యువత విద్యుత్ తీగల వద్ద ప్రమాదకరమైన రీతిలో ఫ్లెక్సీలు కట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమలాపురంలో జన సైనికుడు ప్రేమ్ కుమార్ మృతి కలచివేసింది- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జన సైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని కుటుంబానికి అండగా నిలబడతాము. జీవితం ఎంతో అమూల్యమైనది. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్