పహల్గామ్ దాడికి ఏడాది- దర్శకుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:47 PM
పహల్గామ్ దాడి ఒక జ్ఞాపకం. 22 ఏప్రిల్. ఒక ఏడాది గడిచిపోయింది. కానీ కొన్ని రోజులు మాత్రం కాలాన్ని అనుసరించవు, అవి ఎక్కడ విషాదాన్ని మిగిల్చాయో, అక్కడే నిలిచిపోతాయి. పహల్గామ్‌లో మనం కోల్పోయిన ఆ 26 మంది ప్రాణాలు.. ఆ నిశ్శబ్దం నేటికీ మనల్ని బాధిస్తూనే ఉంది.
‘‘పహల్గామ్ దాడి (Pahalgam Attack) ఒక జ్ఞాపకం. 22 ఏప్రిల్. ఒక ఏడాది గడిచిపోయింది. కానీ కొన్ని రోజులు మాత్రం కాలాన్ని అనుసరించవు, అవి ఎక్కడ విషాదాన్ని మిగిల్చాయో, అక్కడే నిలిచిపోతాయి. పహల్గామ్‌లో మనం కోల్పోయిన ఆ 26 మంది ప్రాణాలు.. ఆ నిశ్శబ్దం నేటికీ మనల్ని బాధిస్తూనే ఉంది’’ అంటూ ఎమోషనల్ అయ్యారు సంచలన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri). ఒక ఫిల్మ్ మేకర్‌గా తన ప్రత్యేకతను చాటుతూ వస్తున్న వివేక్ అగ్నిహోత్రి.. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో తెలుగు వారికి కూడా బాగా పరిచయమయ్యారు. ఈ క్రమంలో పహల్గామ్ దాడి జరిగి ఏడాది అయిపోయిందంటూ.. ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో..
‘‘పహల్గామ్‌లో మనం కోల్పోయిన ఆ మనుషుల గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. పెళ్లయిన ఆరో రోజే, కొత్త జీవితం మొదలవ్వాల్సిన హనీమూన్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఒక యువ నావికాదళ అధికారి. గుండె నిండా దైవభక్తితో వచ్చి, ద్వేషం అనేది ప్రాణాలు తీసేముందు పేరు అడగదని తెలియని ఒక అమాయకుడు. కొన్ని రోజుల్లో తిరిగి వస్తానని ఇంటి నుండి బయలుదేరి, శాశ్వతంగా దూరమైన కాన్పూర్‌కు చెందిన ఒక యువకుడు.
వేర్వేరు ఇళ్లు. వేర్వేరు కలలు. కానీ హింస మాత్రం ఒక్కటే.
26 మంది ప్రాణాలు పోయాయి. 26 మంది వితంతువులయ్యారు. 26 కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కానీ జరిగిన నష్టం అంతకంటే పెద్దది. లక్షలాది ఆశలు కూలిపోయాయి, దేశానికి గాయమైంది, మానవత్వం మీద ప్రశ్నలు తలెత్తాయి. ఉగ్రవాదం అంటే కేవలం మనుషులను చంపడం మాత్రమే కాదు.. అది జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తుంది. పూర్తికాని సంభాషణలను, గడపని ఏళ్లను, నిశ్శబ్దంతో జీవించడం నేర్చుకోవాల్సిన కుటుంబాలను మిగిల్చుతుంది. ఈ రోజు కేవలం గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు. ఏ ఆలోచన, ఏ కారణం, ఏ నమ్మకం కూడా అమాయకుల ప్రాణాలను తీయడాన్ని సమర్థించలేదనే నిశ్శబ్దమైన, దృఢమైన నిశ్చయానికి ప్రతీక. మనం వారికి ఒక స్మృతిని ఇవ్వాలి. వారికి గౌరవాన్ని ఇవ్వాలి. ఇటువంటి దాడులు సహజం అని అంగీకరించని ఒక ప్రపంచాన్ని వారికి మనమంతా బాకీ పడ్డాం’’ అని వివేక్ రంజన్ అగ్నిహోత్రి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన వారంతా పహల్గామ్ దాడి ప్రాణాలను కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!