చేదు జ్ఞాపకాలను వదిలేసి... మళ్ళీ కెమెరా ముందుకు...
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:23 PM
ప్రముఖ నటి నివేదా పేతురాజ్ గత యేడాది వ్యక్తిగత జీవితంలో ఎదురైనా చేదు అనుభవాలను మర్చిపోవాలనుకుంటోంది. తిరిగి నటనలో బిజీ కావడం ద్వారా సరికొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని భావిస్తోంది.
అన్ని రోజులూ ఒకలా ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామంటే అందరికీ ఒక్కోసారి కుదరదు కూడా! ప్రస్తుతం ప్రముఖ నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj ) పరిస్థితి అలానే ఉంది. ఫిల్మ్ ఆఫర్స్ బాగానే ఉన్న సమయంలోనే నటనకు ఫుల్ స్టాప్ పెట్టి, వైవాహిక జీవితంవైపు మళ్ళాలని నివేదా పేతురాజ్ భావించింది. గత యేడాది ఆగస్ట్ లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో నిశ్చితార్థం జరిగినట్టు తెలిపింది. మొదట్లో తన రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచిన నివేదా పేతురాజ్... ఇక పెళ్ళి పీటలు ఎక్కడే తరువాయి అనుకున్న సమయంలో ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె సహ నటీనటులు, అభిమానులు అభినందనల జల్లులో ఆమెను తడిపేశారు. అయితే ఈ వ్యవహారం అంతా పాలపొంగులా చప్పున చల్లారిపోయింది. రాజ్‌హిత్‌కు వేరొకరితో నిశ్చితార్థం జరిగిందనే వార్త బయటకు పొక్కింది. దాంతో నివేదా పేతురాజ్ అతన్ని అన్ ఫాలో చేయడమే కాకుండా... తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అయితే ఇంతవరకూ నివేదా పేతురాజ్ ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే... వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలను తట్టుకుని, ముందుకు సాగాలని నివేదా పేతురాజ్ భావించిందని తెలుస్తోంది. ఇప్పట్లో మళ్ళీ ప్రేమ, పెళ్ళి అనే జంఝాటాల జోలుకు పోకుండా... కొంతకాలం నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటోందట. దాంతో గతంలో తనతో సినిమాలు తీసిన దర్శక నిర్మాతలకు, తనతో నటించిన హీరోలకు టచ్‌లోకి వెళ్ళి... తనకు తగ్గ పాత్రలు ఏమైనా ఉంటే ఇవ్వమని అడుగుతోందట. నిజానికి కెరీర్ ప్రారంభం నుంచి కూడా నివేదా పేతురాజ్... కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేయాలని గిరి గీసుకోలేదు. 'అల వైకుంఠపురములో...' వంటి సినిమాలో సుశాంత్ సరసన సైడ్ క్యారెక్టర్ కూడా చేసింది. అదే సమయంలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ సైతం చేసింది. ఇప్పుడు మళ్ళీ నటిగా బిజీ కావడంకోసం నివేదా తనవంతు కృషి తాను చేస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. ఇంతవరకూ నివేదా పరిమితమైన సినిమాల్లోనే చేసినా... నటిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు గాయపడిన వ్యక్తిగా మరింత ఫోకస్ట్‌గా ఆమె సినిమాలు చేసే ఆస్కారం ఉంది. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో నివేదా పేతురాజుకు ఎలాంటి పాత్రలు లభిస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్