జనసైనికుడి కుటుంబానికి నాగబాబు ఓదార్పు
ABN, Publish Date - Sep 21 , 2026 | 05:50 PM
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, విద్యుత్ షాక్‌కు గురై రోళ్ల ప్రేమ్ కుమార్ అనే జనసైనికుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని నాగబాబు ఓదార్చారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంక గ్రామంలో ఇటీవల ఓ విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, విద్యుత్ షాక్‌కు గురై రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) అనే జనసైనికుడు ప్రాణాలు కోల్పోయారు. నిండు నూరేళ్ల భవిష్యత్ ఉన్న యువకుడు, అప్పుడే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించిన చేతికందిన కొడుకు ఇలా అనుకోని ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మెగా బ్రదర్, ఏపీ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Mega Brother Nagababu) చొరవ తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్‌తో కలిసి ఆయన ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. వారిని ఓదారుస్తూ మనోధైర్యాన్ని చెప్పారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇస్తూ, నిర్మాత ఎస్.కే.ఎన్ ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయం రూ.2 లక్షలను ఆన్‌లైన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాకు బదిలీ చేశారు. ఆపదలో ఉన్న అభిమాని కుటుంబాన్ని గుర్తించి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందించినందుకు నిర్మాత ఎస్.కే.ఎన్ (Producer SKN)ను నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. కన్నబిడ్డను కోల్పోయిన లోటును ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఇలాంటి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఎంత చెప్పినా నియంత్రించలేని ఇటువంటి దురదృష్టకర సంఘటనలు తమను తీవ్రంగా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే జనసైనికుల కుటుంబాలు ఏనాడూ ఒంటరి కావని, పార్టీ కుటుంబం ఎల్లవేళలా వారికి వెన్నంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమ్ కుమార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, భవిష్యత్తులో వారికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
46 కోట్లు కొట్టేయడానికి కుట్ర.. తోడబుట్టిన వారిపై నటి రాధ ఫిర్యాదు
వైష్ణవి చైతన్య రియల్ ఏజ్.. ఆధార్ కార్డు చూపించి మరీ చెప్పిందిగా
Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది