46 కోట్లు కొట్టేయడానికి కుట్ర.. తోడబుట్టిన వారిపై నటి రాధ ఫిర్యాదు

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:12 PM

1980వ దశకంలో అగ్ర తారలుగా వెలుగొందిన ప్రముఖ నటీమణులు, అక్కాచెల్లెళ్లు రాధ, అంబికల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఆస్తి, ఆర్థిక వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో కలకలం రేపుతోంది.

Veteran actresses Radha and Ambika

దక్షిణాది చిత్ర పరిశ్రమలో 1980వ దశకంలో అగ్ర తారలుగా వెలుగొందిన ప్రముఖ నటీమణులు, అక్కాచెల్లెళ్లు రాధ (Radha), అంబిక (Ambika)ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఆస్తి, ఆర్థిక వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో కలకలం రేపుతోంది. తన సంతకం ఉన్న ఖాళీ చెక్కులను దొంగిలించి, వాటి ద్వారా ఏకంగా రూ. 46 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారంటూ సొంత సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌లపై రాధ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో వ్యాపార అవసరాల నిమిత్తం తన ఇంట్లో ఉంచిన పాత చెక్కులను వీరు దుర్వినియోగం చేశారని, ఈ భారీ మోసంపై సమగ్ర విచారణ జరిపి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరడంతో ఈ వ్యవహారం అధికారికంగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది.


రాధ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గతంలో తాను నిర్వహించిన ‘ARS గార్డెన్ స్టూడియో’ పేరిట ఉన్న కరెంట్ ఖాతాకు సంబంధించి, ఉద్యోగుల జీతాలు, బిల్లులు, పన్నులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం కొన్ని ముందస్తు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను చెన్నైలోని తన నివాసంలో భద్రపరిచారు. అయితే, జనవరి 2025లో ఆ సంస్థ పేరును ‘RR గార్డెన్స్’గా మార్చి కొత్త చెక్ బుక్ పొందడంతో, పాత చెక్కుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి ఆ విషయాన్నే మరిచిపోయారు. కాగా, సెప్టెంబర్ 17న పాత ఖాతాకు చెందిన ఐదు చెక్కులు అంబిక పేరుతో నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులో సమర్పించినట్లు మెసేజ్ రూపంలో సమాచారం అందడంతో రాధ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాను ఎలాంటి చెక్కులు ఇవ్వలేదని, అంబికతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేస్తూ తక్షణమే ఆ చెల్లింపులను నిలిపివేయాల్సిందిగా బ్యాంకు అధికారులను ఆదేశించారు.


తాను నగరంలో లేని సమయంలో ఇంట్లోని తన వ్యక్తిగత గదిలోకి అక్రమంగా ప్రవేశించి ఆ చెక్కులను కొట్టేశారని, సోదరుడు మల్లికార్జున స్వయంగా ఆ చెక్కులను పూరించి, అంబికతో కుమ్మక్కై భారీ మొత్తాన్ని కాజేసేందుకు యత్నించారని రాధ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఈ వివాదం చెక్కుల వ్యవహారానికే పరిమితం కాకుండా కుటుంబ ఆస్తుల తగాదాగా కూడా మారింది. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో ఉన్న తన వాటాను దక్కకుండా అడ్డుకుంటున్నారని, అందులో దాచిన బంగారం, విలువైన ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలు, ఇతర రికార్డులను తీసుకోకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. సెప్టెంబర్ 21న కమిషనర్ కార్యాలయంలో సమర్పించిన ఈ ఫిర్యాదుపై చెన్నై పోలీసులు విచారణ ప్రారంభించగా, ఒకప్పుడు సినీ రంగంలో స్టార్ సిస్టర్స్‌గా రాణించిన ఈ ఇద్దరి మధ్య ఆర్థిక ఘర్షణ రచ్చకెక్కడం అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఫైనల్‌గా ఈ వివాదం ఏ దరికి దారి తీస్తుందో తెలియాలంటే మాత్రం పోలీసుల విచారణ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

వైష్ణవి చైతన్య రియల్ ఏజ్.. ఆధార్ కార్డు చూపించి మరీ చెప్పిందిగా

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Updated Date - Sep 21 , 2026 | 05:12 PM