సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

ABN, Publish Date - May 15 , 2026 | 06:34 PM

పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన ‘పొదుపు మంత్రం’ దేశవ్యాప్తంగా పోటాపోటీగా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా రంగానికి సంబంధించి సంచలన ప్రకటన చేశారు.

Kamal Haasan about Indian Film Industry

పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన ‘పొదుపు మంత్రం’ దేశవ్యాప్తంగా పోటాపోటీగా నడుస్తోన్న విషయం తెలిసిందే. సీఎం, మంత్రుల వంటివారి కాన్వాయ్‌‌ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటి నుంచే పని వరకు రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలను ప్రకటిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని.. అనవసరంగా బంగారం కొనుగోళ్లను నివారించాలని పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా జాగ్రత్తలు వహించాలని, అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దని తెలుపుతూ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో..

‘‘పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. దీనివల్ల ఇంధనం, వాణిజ్యం, లాజిస్టిక్స్, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన, రవాణా, ఉత్పత్తి ఖర్చుల ప్రభావం భారతదేశంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే బడ్జెట్‌లు విపరీతంగా పెరిగిపోయి, మార్కెట్ రికవరీలు అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఈ ప్రభావం కేవలం సినిమా నిర్మాణంపైనే కాదు.. ద్రవ్యోల్బణం కారణంగా రాబోయే నెలల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే విధానంపై ఎఫెక్ట్ చూపిస్తుంది.


ఈ భారం నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు.. మొత్తం సినీ రంగంపై పడుతుంది. సినిమా ప్రస్థానం ఇలాగే ముందుకు సాగాలంటే, మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి సినిమా నాణ్యతను పెంచేందుకు ఉపయోగపడాలే తప్ప, కేవలం పైపై హంగుల కోసం కాకూడదు. నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. సినిమా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ఏ ప్రయత్నమైనా సరే.. అది కార్మికుల వేతనాలు, వారి భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతి వంటి వాటిని దెబ్బతీసేలా ఉండకూడదు. రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులపై ఈ భారం పడటానికి వీల్లేదు.

మనం చేయాల్సింది ఇదే..

వృధా ఖర్చులు, సరైన ప్రణాళిక లేకపోవడం, భారీ మేనేజ్‌మెంట్‌, అనవసరమైన విదేశీ ప్రయాణాలు, షూటింగ్ ఆలస్యం కావడం, పెట్టే ఖర్చుకు-సినిమాకు సంబంధం లేకపోవడం వంటి వాటిని అదుపు చేయాలి. ప్రతి ప్రేమకథ ప్యారిస్‌లోనే చిగురించాలని, ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ముగియాలని ఎందుకు అనుకోవాలి? అదృష్టవశాత్తూ, ప్రేమను చూపించడానికి విదేశీ కరెన్సీ అవసరం లేదు. భారతీయ సినిమాకు, భారతీయులకు తమపై, మన దేశంపై మరింత నమ్మకం ఉండాలి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలూ ఏకం కావడానికి, కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయమని నేను నమ్ముతున్నాను. రాబోయే ఆర్థిక సవాళ్లను మనం సమష్టిగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడానికి నిర్మాతలు, నటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్‌ల మధ్య చర్చలు జరగాలని నేను కోరుతున్నాను.


సినిమా నిర్మాణాన్ని సమర్థవంతంగా నడపాలి

క్రమశిక్షణ, పక్కా షెడ్యూల్స్, విలాసాలు - అసిస్టెంట్ల ఖర్చులను తగ్గించడం, స్థానికంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్స్ - స్టూడియోలలో ఇంధనాన్ని ఆదా చేయడం, పర్యావరణానికి అనుకూలమైన సెట్ల నిర్మాణం, మెటీరియల్స్‌ను తిరిగి ఉపయోగించడం వంటివి చేయాలి. చాలా సార్లు అమితమైన ఖర్చునే సినిమా ‘స్కేల్’ అని పొరబడుతుంటారు. కానీ మన గొప్ప చిత్రాలలో కొన్ని.. భారీ ఖర్చులతో కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, ఎంతో నమ్మకంతో రూపుదిద్దుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ఇలాంటి సమయాల్లో, ప్రతి రంగం కూడా ముందుచూపుతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దేశం పిలుపునిస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ సందర్భానికి తగ్గట్టుగా స్పందించాలి.

ఇది వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. మన పరిశ్రమ సంస్కృతిని మారుస్తుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది, ప్రతిరోజూ మిలియన్ల మంది ప్రజలను చేరుకుంటుంది. కాబట్టి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా సినిమాకు అంతకుమించిన బాధ్యతలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నుంచి అత్యధికంగా లాభం పొందిన మనలాంటి వారే మొదటగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు మనం సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటేనే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడినట్లవుతుంది..’’ అని కమల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

Tollywood: డూప్లికేట్ జుత్తు, పాము.. సునీల్ నారంగ్ వర్సెస్ నాగవంశీ!

నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

Updated Date - May 15 , 2026 | 06:46 PM