సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫెడరేషన్‌‌కు షాకిస్తూ.. నిర్మాతలకు జానీ, సుమలత మాస్టర్స్ లేఖలు

ABN, Publish Date - Jul 17 , 2026 | 10:08 PM

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో అవినీతి వివాదం రాజుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్‌కు షాకిచ్చేలా జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

TFTDDA Controversy Update

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో అవినీతి వివాదం రాజుకుంది. అసోసియేషన్‌లో డాన్సర్లకు చెందాల్సిన డబ్బులను, ప్రొడక్షన్ కంపెనీలకు అక్రమ బిల్లులు పెడుతూ కొంతమంది ప్రోగ్రాం ఇంచార్జీలు, జనరల్ సెక్రటరీ దోచుకుంటున్నారని ప్రముఖ కొరియోగ్రాఫర్, మాజీ ప్రెసిడెంట్ ఎస్.కె. జానీబాషా (జానీ మాస్టర్), ప్రస్తుత ప్రెసిడెంట్ వి.వి. సుమలతా దేవి ఆరోపించారు. ఈ అవినీతికి వ్యతిరేకంగా తాము తీసుకుంటున్న చర్యలను అడ్డుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఫెడరేషన్ పెద్దలు జులం ప్రదర్శిస్తున్నారని, బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ వారు తెలుగు సినిమా నిర్మాతలకు విడివిడిగా సుదీర్ఘ లేఖలు రాశారు.


సుమలతా దేవి (Sumalatha Devi) తన లేఖలో.. అసోసియేషన్‌లో ఒరిజినల్ బిల్లులను పరిశీలించి తప్పు చేసిన జనరల్ సెక్రటరీని, వారికి సహకరించిన కమిటీ సభ్యులను మెజారిటీ సభ్యుల తీర్మానంతో పదవుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఖాళీ అయిన ఆ పోస్టులకు చట్టబద్ధంగా ఉపఎన్నికలు జరుపుకోవాలని భావిస్తుంటే ఫెడరేషన్ పెద్దలు తమను అణచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ చాంబర్ పెద్దల సూచనల ప్రకారం అవినీతికి సంబంధించిన కొన్ని బిల్లులను చాంబర్‌కు అందజేస్తున్నామని, తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆమె ప్రాధేయపడ్డారు.


మరోవైపు జానీ మాస్టర్ (Jani Master) స్పందిస్తూ.. దైవసమానులైన నిర్మాతలను, డాన్సర్లను మోసం చేసిన వారిని వెనకేసుకొస్తూ ఫెడరేషన్ పెద్దలు 16-07-2026 నాటి మీటింగ్‌లో తమ ప్రెసిడెంట్ సుమలతను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ‘దోచుకుంది నిర్మాతల డబ్బులే కదా’ అనేలా కౌన్సిల్ సభ్యులు మాట్లాడటంపై ఆయన తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ఒక ఒంటరి మహిళ అవినీతిపై పోరాడుతుంటే లింగభేదం చూపిస్తూ, ఫెడరేషన్ నుంచి బహిష్కరిస్తామని, నాన్-కోఆపరేషన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిర్మాతల పెద్దలు చొరవ తీసుకుని ఫెడరేషన్ జోక్యాన్ని అరికట్టి, తాము స్వేచ్ఛగా ఉపఎన్నికలు జరుపుకునేలా చూడాలని ఆయన వేడుకున్నారు. అంతకు ముందు వీరిద్దరికి ఫెడరేషన్ పెద్దలు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

తెల్లచీర, మల్లెపూలు.. స్రవంతి చొక్కారపు ఏంటి కథ?

‘వృషకర్మ’.. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ డీల్!

మిల్కీబ్యూటీ మరో బోల్డ్ స్టెప్.. గ్లామరస్ హారర్ రోల్‌ చిత్రం ప్రారంభం

Updated Date - Jul 17 , 2026 | 10:08 PM