Jamuna Rani: తెలుగులో అలా వెలిగి... ఇలా కనుమరుగై...
ABN, Publish Date - Jul 31 , 2026 | 03:53 PM
జమునారాణి మరణంతో ఆనాటి సంగీత ప్రియులు ఆమె పాడిన పాటలను తలుచుకుంటున్నారు. దక్షిణభారత సినీ సంగీత ప్రపంచంలో జమునారాణిది విలక్షణమైన శైలి.
తెలుగులో జమునారాణి పాడిన చాలా పాటలు శ్రోతల ఆదరణకు నోచుకున్నవే. అందులో మచ్చుకు కొన్నింటిని తలుచుకోవచ్చు.
ఆమె పాడిన పాటల్లో ఓ జవరాలా ఉషాబాల... (ఉషా పరిణయం), కూరిమిగొనుమా ఓ రాజశేఖరా... (దీపావళి), అందాన్ని నేను... (ముందడుగు), ఎంత టక్కరివాడు నారాజు... (మంచి మనసులు), కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా... (కులదైవం), ఓ వన్నెలా వయ్యారీ... (శభాష్ రాజా), ఎవరని అడిగె మొనగాడా... (బండరాముడు), ఏమయ్యో మావయ్యో... (సవతికొడుకు), ఈ రేయి గడిచిపోతున్నది... (అనుబంధాలు), నాజూకైన గాడిద... (మర్మయోగి), నాగమల్లి కోనలోన... (బంగారు తిమ్మరాజు), ముక్కుమీద కోపం... (మూగమనసులు), దక్కెనులే నాకు నీ మనసు... (ఆత్మబంధువు), రావె రావె బాల... (కులగోత్రాలు), సరదా సరదా సిగరెట్టు (రాముడు భీముడు), అద్దాల మేడవుంది... (లక్షాధికారి), పూసలోళ్ల రాజమ్మ (అనురాగం), రాయుడోరింటికాడ... (కుటుంబగౌరవం), గిలకల మంచం వుంది..., మల్లెపూల పందిట్లోన... (వరకట్నం), మెత్తమెత్తని వయసు (నిండు హృదయాలు), కానీ కానీ సరే దాచుకో... (యమలోకపు గూఢచారి)..., నీవన్నది నేనుకున్నది... (కలెక్టర్ జానకి) వంటి పాటలు వెంటనే గుర్తుకువస్తాయి.
జమునారాణి పాడిన మొదటి ప్రైవేటు గీతం యమునా తీరము సంధ్యాసమయము ఎవ్వరూ లేరిట కృష్ణా... అతి హృద్యంగా ఉంటుంది. దీనికి శ్రీశ్రీ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు పాశ్చాత్య పద్దతిలో వరస చేసి జమునతో పాడించిన ప్రణయసీమ.... కూడా చెప్పుకోదగ్గదే. 1970 నుంచి జమునారాణి గొంతు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. తనను బాగా ప్రోత్సహించిన తమిళ చిత్ర పరిశ్రమలోనే ముందు ఆమెకు అవకాశాలు తగ్గాయి. తర్వాత ఇటు తెలుగులోను సినిమాలు లేకుండా పోయాయి. తెలుగులో తను చివరగా పాడింది తల్లీ కూతుళ్లు సినిమాలో చక్రవర్తి సంగీత సారథ్యంలో వచ్చిన సిగ్గులేని మావయ్యా... పాట. ఆ తరువాత సుమారు ఇరవై ఏళ్ల వరకు జమునారాణిని తలుచుకున్న వారు లేరు. నాయగన్ సినిమాలో మళ్లీ ఇళయరాజా ఆవిడచేత నాన్ సిరిచ్చా దీపావళి... పాట పాడించేవరకు జమునారాణి ఎవరికీ గుర్తులేదు. తెలుగు అనువాదం 'నాయకుడు'లో ఆ పాట నా నవ్వే దీపావళి... గా వచ్చింది. ఇళయ రాజా అప్పుడు నిర్మాతలను శాసించే స్థానంలో వున్నారు కనుకనే జమునకు ఈ అవకాశం దక్కింది. కానీ, నాయగన్ సినిమా ఆమెకు పూర్వ వైభవం తీసుకు రాలేదు. డెబ్బయిల్లో సినిమాలనుంచి తప్పుకున్న జమునారాణి నాయగన్ తర్వాత తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన మిథునంలో వీణాపాణి స్వర రచనకు పాట పాడారు. అదే ఆమె చివరి పాట.
ఇవి కూడా చదవండి:
మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ
సైమా 14వ ఎడిషన్ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..