Jamuna Rani: ఐదు భాషలు... ఆరు వేల పాటలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:36 PM

1950 నుంచి 1970 వరకూ జమునారాణి దిగ్విజయ యాత్రను సాగించిందని చెప్పాలి. ఐదు భాషల్లో ఆరు వేలకు పైగా పాటలను ఆమె పాడారు. అందులో అత్యధిక శాతం తమిళ పాటలే!

Singer Jamuna Rani

సేలం మోడరన్ థియేటర్ వారి ఆస్థాన గాయని అయ్యాకే జమునారాణికి చక్కని గుర్తింపు వచ్చింది. దరఖాస్తు చేసుకుని మరీ ఆ సంస్థలో నేపథ్య గాయనిగా ఎంపికయ్యిందామె. అక్కడ రెండేళ్లు వుంది. అప్పట్లో ఆ సంస్థ దక్షిణ భారత దేశ భాషలన్నిటిలో సినిమాలు తీసేది. జమునారాణి వాళ్లకు ఎక్కువగా తమిళంలో పాడింది. అలానే వాటి తెలుగు వెర్షన్స్ పాడింది. తమిళంలో ఆమెకు మొదటగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా కల్యాణి (1952), అయితే, అక్కడ ఆమె గొంతు బాగా పాప్యులర్ అయ్యింది గులేబకావలి సినిమాతో! అందులో రాజసులోచనకు జమునా రాణి పాడిన ఆశయుం నేశయుం... అన్న పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. కైపు గొంతుకతో ఎక్కిళ్లను మిళితం చేసి పాడే పాట అది. జమున గొంతులో నిషా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసినపుడు అక్కడ కూడా ఆమే పాడింది. ఆజ్ హం యిన్ నైనన్ అంటూ సాగే ఆ పాటలో కూడా జమున ఎక్కిళ్లు ఉత్తరాదివారిని బాగా అలరించాయి.


అప్పట్లో శ్రీలంక నిర్మాతలు సేలం వచ్చి మోడరన్ థియేటర్స్ స్టూడియోలో తమ సినిమాలు తీసేవారు. అలా 1953లో అక్కడ రూపుదిద్దుకున్న సుజాత అనే సింహళ సినిమాలో జమునారాణి పాడింది. తమ స్టూడియోలో తీసే సినిమాలో తమ గాయనీ గాయకులే పాడాలని మోడరన్ థియేటర్స్ అధినేత స్పష్టం చేయడంతో ఆ సినిమాలో పాడే అవకాశం జమునకు దక్కింది. హిందీలో వచ్చిన బడీ బహెన్ కు సింహళ రూపమది. ఏడాది ఆడింది అక్కడ. ఆ వెంటనే సింహళ చిత్రాల్లో కూడా జమునకు విరివిగా అవకాశాలు వచ్చాయి. సుమారు పాతిక సినిమాల్లో 150 దాకా సింహళ పాటలు పాడింది ఆమె.


తెలుగులో జమునకు మొదటగా బాగా పేరు తెచ్చిన పాట సంతానం చిత్రంలోనిది. ఆ చిత్రంలో సంతోషమేల సంగీతమేలా.... అన్న పాట పాడింది. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించిన ఆ పాటలో జమునారాణి సహ గాయకుడు దరిమిలా సంగీత దర్శకునిగా సుప్రసిద్ధుడైన ఎస్.పి. కోదండపాణి. తరువాతి కాలంలో అన్నతమ్ముడులో రగులుతుంది రగులుతుంది... పాట జమునకు మంచి గుర్తింపు తెచ్చింది. భాగ్యదేవతలో జమున చక్కటి మెలొడీ పాటలు పాడింది. అలాగే కృష్ణ లీలలు లో పాడిన కొలది నోములు... అనే పాటతో ఆమె అన్ని రకాల పాటలూ పాడగలదన్న విషయం పరిశ్రమకు తెలిసింది. తర్వాత వచ్చిన కులదైవంలో పాడిన పద పదవే వయ్యారి గాలిపటమా పాట శ్రోతలను బాగా అలరించింది. అలానే మాంగల్య బలంలోని తిరుపతి వెంకటేశ్వరా... పాట కూడా! కుముదంలో ఆమె సౌందర్ రాజన్ తో పాడిన 'మామా మామా' పాట, తెలుగులో ఘంటసాలతో మంచి మనసులుకు పాడింది. ఈ పాట దశాబ్దాల పాటు సినిమా అభిమానుల నోళ్ళలో నానుతూనే ఉండిపోయింది. 1950 నుంచి 1970 వరకూ జమునారాణి ఐదు భాషల్లో ఆరు వేలకు పైగా పాటలు పాడారు. అందులో 75 శాతం తమిళ పాటలే.

ఇవి కూడా చదవండి:

సినిమా రివ్యూ: ‘నూటన్స్‌ థర్డ్‌ లా’

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

Updated Date - Jul 31 , 2026 | 02:38 PM