Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:44 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసిన చిత్రం స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురువారం ధియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

Spider-Man:

Spider-Man: Brand New Day, స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, రివ్యూ,

ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసిన చిత్రం స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురువారం ధియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే విప‌రీత‌మైన ప్రాచూర్యం సంపాదించుకున్న ఈ చిత్రం 2021లో వ‌చ్చిన స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ (Spider-Man: No Way Home) సినిమాకు కొన‌సాగింపుగా వ‌చ్చింది. హ‌ల్క్‌, ఫ‌నీష‌ర్‌, జీన్ వంటి కొత్త ప‌వ‌ర్‌ఫుల్‌ పాత్ర‌లు సైతం ఈ మారు జ‌త క‌ట్ట‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో అనే అత్రుత‌, ఆస‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలో అంత‌కుమించి అనే స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌రి స్పైడ‌ర్ మ్యాన్ కొత్త చిత్రం వారి అంచ‌నాల‌ను అందుకుందా, ఎమ్జేతో ప్రేమ, స్నేహం చివ‌ర‌కు ఏమైంద‌నేది తెలుసుకోవాలంటే మీరూ ఈ రివ్యూ పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

క‌థ‌:

గ‌త స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రంలో డాక్ట‌ర్ స్ట్రేంజ్‌, స్పైడ‌ర్ మ్యాన్ క‌లిసి చేసిన ప‌ని వ‌ళ్ల పీట‌ర్ పార్క‌ర్ త‌ప్ప ప్ర‌పంచం అంతా స్పైడ‌ర్ మ్యాన్ గురించి పూర్తిగా మ‌రిచిపోతుంది. అందులో ప్రేమికురాలు ఎమ్జే, స్నేహితుడు కూడా ఉంటారు. దీంతో నాటి నుంచి త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని అంతా ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం స్పైడ‌ర్ మ్యాన్‌గానే ఉంటూ న్యూ యార్క్ న‌గ‌రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షిస్తూ ఉంటాడు పీట‌ర్ పార్క‌ర్‌. త‌రుచూ త‌న ప్రేమికురాలిని గుర్తు చేసుకుంటూ వారితో క‌లిసి గ‌డిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఒంట‌రిగా కుమిలి పోతుంటాడు. ర‌హ‌స్యంగా త‌న మిత్రుల‌ను సోష‌ల్‌మీడియాలో ఫాలో అవుతున్న పీట‌ర్ అనుకోకుండా ఓ సారి ఎమ్జే మ‌రొక‌రితో ప్రేమ‌లో ఉండ‌డాన్ని చూసి త‌ట్టుకోలేక పోతాడు. దీంతో మాస‌సికంగా సంఘ‌ర్ష‌ణ‌కు లోనవ‌డంతో త‌న శ‌క్తుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఉన్న‌టుండి హైప‌ర్‌గా మార‌డం స‌డ‌న్‌గా డీలా ప‌డిపోవ‌డం లాంటివి జ‌రుగుతుంటాయి.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో బ‌య‌ట‌కు క‌నిపించ‌ని ఓ అదృశ్య శ‌క్తి క్ష‌ణాల్లో ఎదుటి వారి మైండ్స్‌ను, మ‌నుషుల‌ను త‌న ఆధీనంలోకి తెచ్చుకుంటూ సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DODC) అనే డిఫెన్స్ సంస్థ‌పై మెరుపు దాడి చేస్తుంది. స్పైడ‌ర్ మ్యాన్ ఇది గుర్తించి అక్క‌డికి వ‌చ్చిన‌ప్ప‌టికీ దాడిని పూర్తిగా ఆప‌లేకపోతాడు. చివ‌ర‌కు స్పైడ‌ర్ మైండ్‌ను సైతం ఆ శ‌క్తి అధీనంలోకి తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌లమై అక్క‌డి నుంచి వెళ్లి పోతుంది. త‌ర్వాత స్పైడ‌ర్.. వీ మ్యాక్స్ అనే సీక్రెట్‌ వ‌స్తువు కోసం ఈ దాడి జ‌రిగింద‌ని తెలుసుకుని దాని వెన‌క ఉన్న అ అదృశ్య శ‌క్తి ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ క్ర‌మంలో అప్ప‌టివ‌ర‌కు సాధారణ మనిషిలా ఉన్న హల్క్‌ అదుపు త‌ప్ప‌డంతో అత‌నితోనూ పోరాటం చేయాల్సి వ‌స్తుంది. అస‌లు అంత ప‌వ‌ర్‌ఫుల్ అయిన అ ఆదృశ్య శ‌క్తి ఎవ‌రు, ఎందుకు న‌గ‌రాన్ని స్థంభింప చేసింది దానిని నుంచి స్పైడ‌ర్ న‌గ‌రాన్ని, ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడాడు, అత‌నికి ఫ‌నీష‌ర్ ఎలాంటి సాయం చేశాడు, హ‌ల్క్ ఎందుకు స్పైడ‌ర్‌తో ఢీ కొనాల్సి వ‌చ్చింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

విశ్లేష‌ణ‌:

ఐదేండ్ల క్రితం వ‌చ్చిన స్పైడ‌ర్ మ్యాన్- నో వే హోమ్ సినిమాకు అనుబంధంగా ఎక్క‌డ అయితే ముగిసిందో అక్క‌డి నుంచే సినిమా స‌ట్ఆర్ట్ ఎక్క‌డా సోది లేకుండా నేరుగా సినిమాలోకి తీసుకెళ్లారు. త‌న గురించిన గ‌తాన్ని మ‌రిచిపోయిన మిత్రుల‌ను నేరుగా క‌ల‌వ‌లేక వారి ఎడ‌బాటును భ‌రించ‌లేక లోలోనే కుమిలిపోవ‌డం, శ‌క్తులు స‌న్న‌గిల్ల‌డం వంటి స‌న్నివేశాలు అభిమానులను సైతం అయ్యో పాపం స్పైడ‌ర్ మ్యాన్‌ అనే భావ‌న తెప్పిస్తాయి. తొలుత‌ కోపంతో ర‌గిలిపోతున్న‌ ఫ‌నీష‌ర్‌ను అదే స్థాయిలో ఎదురుకొని అత‌నిని కంట్రోల్ చేసే స‌మ‌యంలో వ‌చ్చే పోరాట‌ స‌న్నివేశాలు హైలెట్‌గా ఉన్నాయి. ఆపై అత‌నితో స్నేహం చేస్తూనే త‌న ప్రేయ‌సిని కాపాడుకునేందుకు పీట‌ర్ ప‌డే తాప‌త్ర‌యం ఈ క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇక చివ‌ర‌కు త‌న‌క‌న్నా రెట్టింపు ప‌వ‌ర్ ఉండి ఇత‌రుల‌ మైండ్స్‌ను కంట్రోల్ చేసే అదృశ్య శ‌క్తితో స్పైడ‌ర్ మ్యాన్ త‌ల‌ప‌డే ప్ర‌తీ స‌న్ని వేశం గూస్‌బంప్స్ తెప్పించి ఫుల్ మై ఇస్తుంది. మ‌రో సంద‌ర్భంలో తీవ్ర కోపంతో ఉన్న హ‌ల్క్‌ను శాంతింప జేసే స‌మ‌యంలో ఫ‌నీష‌ర్‌తో క‌ల‌సి స్పైడ‌ర్ మ్యాన్ చేసే యాక్ష‌న్ సీన్లు, క్లైమాక్స్‌లో నింజాస్‌తో చేసే పోరాట స‌న్నివేశం నెక్ట్స్ లెవ‌ల్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఔట్ అండ్ యాక్ష‌న్ ఉంటుంద‌ని అనుకుని వ‌చ్చే వారికి మాత్రం కాస్త నిరాశ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల క‌న్నా ఎమోష‌న్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఇక విజువ‌ల్స్ అయితే ఇంత‌కుముందు చూడ‌ని రేంజ్‌లో ఉండి థ్రిల్ ఇస్తాయి. అంతేగాక గ‌త చిత్రాల‌కు భిన్నంగా స్పైడ‌ర్ మ్యాన్ ఎగిరే స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా త్రీడీలో సినిమా చూసే వారికి స్పైడ‌ర్ జంప్ చేసే ఒక‌టి రెండు స‌న్నివేశాలు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తాయ‌డంలో అతిశ‌యోక్తి లేదు. మాములు స్క్రీన్ల‌లో చూసే వారికి ఆ ఫీల్ రాక‌పోవ‌చ్చు. అయితే హ‌ల్క్ పాత్ర‌ను ఒక‌టి రెండు ఘ‌ట్టాలకే ప‌రిమితం చేయ‌డం ఫ్యాన్స్‌కు జీర్ణించ‌దు.. అత‌ను ఉన్నంత సేపు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. పీట‌ర్ పార్క‌ర్‌, స్పైడ‌ర్ మ్యాన్ నెండు పాత్ర‌ల్లో టామ్ హాలెండ్ జీవించేశాడు. ఓ వైపు కంటికి క‌నిపించ‌ని అదృశ్య శ‌క్తితో పోరాటం చేస్తూనే, మ‌రోవైపు ప్రేయ‌సి ఎడబాటు, అంత‌కుమించి త‌న శ‌క్త‌లు ప్ర‌భావం కొల్పేయే స‌న్నివేశాల్లో మైమ‌రిపించాడు త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు.. ఇక ప్రేయ‌సి ఎమ్జేగా రియ‌ల్ ల‌వ‌ర్ జెండ‌యానే న‌టించిన‌ప్ప‌టికీ కొన్ని స‌న్నివేశాల‌లో కాస్త బొద్దుగా క‌నిపిస్తుంది. మిత్రుడు నెడ్ పాత్ర నిడివి త‌క్కువైన‌ప్ప‌టికీ క్లైమాక్స్‌లో గ‌తం గుర్తుకు వ‌చ్చే చిన్న క్లిప్ ఫుల్‌ హై తెప్పిస్తుంది. పీట‌ర్ పార్క‌ర్‌ త‌ర్వాత‌ ఫ‌నీషర్‌ (జాన్ బెర్నెత‌ల్‌)కు, జీన్ (సాడీ సింక్‌) (Sadie Sink) ల‌కు ప్రాధాన్యం, నిడివి ఉన్న పాత్ర‌లు ద‌క్క‌గా వారు ది బెస్ట్ ఇచ్చారు. బ్రూస్ బ్యానర్ (హ‌ల్క్) పాత్ర‌లో మార్క్ ర‌ఫెలో (Mark Ruffalo) ఉన్న కాసేపు రంజింప చేశాడు. సినిమాటోగ్ర‌ఫీ, విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీల‌కు ఎక్క‌డా వంక‌లు పెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయ‌య‌డంలో సందేహం లేదు. ఇక ఐదేండ్ల క్రితం షాంగ్ చీ - అండ్ ది లెజెండ్ అఫ్ ది టెన్ రింగ్స్ (Shang-Chi and the Legend of the Ten Rings) వంటి సంచ‌ల‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన డెస్టిన్ డానియ‌ల్ క్రెట్ట‌న్ (Destin Yori Daniel Cretton) త‌న మీద ఉన్న అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా సినిమాను తెర‌కెక్కించాడు. అందుకు అత‌ను ప‌డిన క‌ష్టం సినిమాలో తెర‌పై తెలుస్తుంది. సినిమాలో ఎక్క‌గా ఎలాంటి అస‌భ్య‌, అశ్లీల స‌న్నివేశాలు లేవు. అంతేగాక అదిరిపోయే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా ర‌క్తం క‌నిపించ‌కుండా చూసుకున్నారు. ఎలాంటి జంకు లేకుండా పిల్ల‌ల‌తో, ఫ్యామిలీల‌తో క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి సినిమా ఆస్వాధించ‌వ‌చ్చు. అయితే సినిమాను వీలైనంత వ‌ర‌కు త్రీడీ ఫార్మెట్‌లోనే చూడ‌డం బెట‌ర్‌.

రేటింగ్‌: 3.5

ఎమోష‌న‌ల్‌, విజువ‌ల్ ఫీస్ట్‌

Updated Date - Jul 30 , 2026 | 09:06 AM