గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో పురోగతి.. ఏపీ అభివృద్ధిపై చిరు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:47 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురంలో పర్యటించిన చిరంజీవి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). రాష్ట్రంలోని పంచాయతీలు కూడా దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని రంగాలు బాగుపడుతున్నాయని అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురంలో పర్యటించిన చిరంజీవి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీఎస్ఎల్ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్‌ను మెగాస్టార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.
ఏపీ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేనొచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్‌కి. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? అని ఇందాక ప్రయాణంలో అడుగుతుంటే గనుక.. గతానికి ఇప్పటికి చాలా మార్పులొచ్చినాయి. ఇప్పుడు మంచి రోడ్లు వచ్చినాయి. తర్వాత ఎక్కడో 23, 25 నెంబర్లలో ఉన్నటువంటి పంచాయితీ ఇప్పుడు మనకి దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. నెమ్మది నెమ్మదిగా అన్ని బాగుపడుతున్నాయి. ఇప్పుడు సత్యకుమార్ గారి ద్వారా ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి. ఈ మెరుగు ఇలా అవుతూ, ఎంతో అభివృద్ధి చెందుతూ మన రాష్ట్ర ప్రజలకి మరింత మేలు జరగాలని, అందరికీ న్యాయం జరగాలని, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి పథం వైపు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
‘‘చాలామంది క్యాన్సర్ ముదిరిపోయాక అప్రమత్తం అవుతున్నారు. కానీ ముందుగానే ప్రాథమికంగా ఈ వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా లక్షణాలు గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడటం సులువు. నా భార్య, చెల్లెళ్లు, అమ్మకు తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తాను. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మురళీమోహన్‌గారిని చూసి ఆరోగ్యం విషయంలో నేను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి చాలా హాని ఉంది. గాజు గ్లాసు నీళ్లను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. అదే ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నో సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలే నన్ను ఈరోజున ఇంత యాక్టివ్‌గా ఉండి, ఇంకా ఎనర్జిటిక్‌గా సినిమాల్లో నేను కనబడుతున్నాను, మిమ్మల్ని అలరిస్తున్నాను, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నానంటే గనక ప్రధానమైన కారణం అదే. కాబట్టి సదా మీ అభిమానం కావాలి. అది నాకు మరింత ఉత్సాహాన్ని, మరింత ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా నా అభిమానులకు ప్రత్యేకించి మీరు చూపిస్తున్న ప్రేమకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
ముందుగా ఈ కార్యక్రమానికి వస్తోన్న చిరంజీవికి మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూనే చిరంజీవి హెల్త్‌కేర్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఛైర్మన్ గన్ని భాస్కరరావు, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జీవీబీ చౌదరి, పలువురు మంత్రులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఇదే సమయంలో.. ప్రస్తుతం ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందని చిరంజీవి అన్న మాటలపై సోషల్ మీడియాలో ఓ వర్గం ఫైర్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఏపీ ఫిలిం ఛాంబర్‌లో M4M హవా.. జో శర్మ, మోహన్ వడ్లపట్లకు అవార్డులు
ప్రసవం తర్వాత లుక్స్‌పై కామెంట్స్.. కత్రినా ఇచ్చిపడేసింది
తెలుగు వారిని పట్టించుకోని రజనీ.. రేట్లు పెంచడం అవసరమా?