Nandi Awards: అన్ని సంవత్సరాలకూ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు!
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:34 PM
నంది అవార్డులలో మార్పులు చేర్పులు జరిగాయి. 2017 నుంచి 2024 వరకూ కేవలం రెండు చిత్రాలకు కాకుండా మూడు చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అలానే ఎన్టీఆర్ నేషనల్ అవార్డులనూ ఆ సంవత్సరాలకు ప్రకటించబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతున్న నంది అవార్డులలో మార్పులు, చేర్పులు జరిగాయి. తొలుత 2017 - 2024 సంవత్సరాలకు గానూ కేవలం ప్రథమ ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డులు మాత్రమే ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అలానే ఆ యా సంవత్సరాలలో ఇద్దరు వ్యక్తులకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వబోతున్నట్టు తెలిపింది. అదే విధంగా 2017 నుంచి 2024 వరకూ ఇతర ప్రత్యేక అవార్డులను ఇవ్వబోవడం లేదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మొదటి నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు బంగారు, వెండి, కాంస్య నందులు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం రెండు సినిమాలకే అవార్డులు ఇవ్వడం సబబు కాదని, అదే విధంగా ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా తప్పనిసరిగా పునరుద్ధరించి అన్ని సంవత్సరాలకు ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. వారి కోరికను మన్నించిన ప్రభుత్వం ఇప్పుడు 2017 నుంచి 2024 వరకూ ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలకు నంది అవార్డులను ఇవ్వనుంది. అదే విధంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డులనూ ఆయా సంవత్సరాలకు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. తమ విన్నపాన్ని మన్నించి, ఈ మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వానికి నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలియచేసింది.

అయితే ఇప్పుడు మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. 2017 నుంచి 2024 వరకూ కేవలం ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ఇచ్చి సరిపెట్టుకోకుండా రఘుపతి వెంకయ్య, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులనూ ప్రభుత్వం ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. మరికొందరైతే, ఈ ఎనిమిదేళ్ళకు ఐదు అవార్డులతో (మూడు సినిమాలు, రెండు స్పెషల్ జ్యూరీ) సరిపెట్టుకోవడం సబబు కాదని, ప్రభుత్వం కాస్తంత సమయం తీసుకుని అయినా... అన్ని కేటగిరిల్లో అవార్డులు ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుందని అంటున్నారు. మరి ఈ అంశాలను ఏపీ ప్రభుత్వం ఎంతవరకూ పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రెండు పార్టులుగా సాయిపల్లవి రెండు సినిమాలు
‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. అక్టోబర్‌లోనూ డౌటే!
స్మిత్ మచ్చార్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం: చిరంజీవి