Tollywood: నంది అవార్డుల ప్రదానోత్సవంకు రంగం సిద్థం

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:24 PM

నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. డిసెంబర్‌లో 2012 నుంచి 2025 వరకూ నంది సినిమా, టీవీ అవార్డులను ప్రదానం చేయనుంది.

Nandi Awards

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 'గద్దర్ సినిమా' అవార్డులను ప్రకటించారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి యేడాదికి మూడు సినిమాల చొప్పున అవార్డులను అందించారు. అలానే 2024, 2025కి పూర్తి స్థాయిలో వివిధ కేటగిరిల్లో అవార్డులను ప్రదానం చేశారు. దాంతో గతంలోని 2016 వరకూ ప్రకటించిన నంది అవార్డులను ప్రదానం చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై పడింది. దానిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం 2012 నుంచి 2016 వరకూ ప్రకటించిన పూర్తి స్థాయి అవార్డులను ఈ యేడాది డిసెంబర్ లోగా అందించడానికి పథక రచన చేసింది. అలానే పనిలో పనిగా 2017 నుంచి 2024 వరకూ యేడాదికి నాలుగు అవార్డుల చొప్పున అంద చేయబోతోంది. ఇందులో ప్రధమ ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రంతో పాటు రెండు జ్యూరీ అవార్డులను ఇస్తారు. ఇక 2025కు పూర్తి స్థాయిలో వివిధ కేటగిరిల్లో 46 నంది అవార్డులను ప్రకటిస్తారు. బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసా పత్రం, నగదు పారితోషికం అంద చేస్తారు. అలానే వివిధ కేటగిరిల్లో ఎనిమిది గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. వీటి ఎంపికకు సంబంధించిన జ్యూరీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఎ.పి.ఎఫ్.డి.సి. ఛైర్మన్ పి. భరత్‌ భూషణ్ మీడియాకు తెలియచేశారు.


WhatsApp Image 2026-09-22 at 2.57.23 PM.jpegసినిమా అవార్డులతో పాటు ఇప్పటికే ప్రకటించిన టీవీ నంది అవార్డులను, 2017 నుంచి ప్రకటించాల్సి ఉన్న అవార్డులను సైతం డిసెంబర్‌లోఇవ్వబోతున్నారు. టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలోనూ, సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతి లేదా విజయవాడలో జరుపుతామని ఆయన తెలిపారు. అలానే 2025కి గానూ జాతీయ అవార్డులను ఎంపిక చేసి అదే వేదికపై అందిస్తామని తెలిపారు. గతంలో ఉన్నట్టుగానే ఎన్టీఆర్ నేషనల్‌ అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డ్, బి. నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు, బి.ఎన్. రెడ్డి అవార్డునూ అందిస్తామని అన్నారు. ఇందులో ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.5 లక్షలు, బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు, నాగిరెడ్డి – చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డుకు రూ.2 లక్షలు పారితోషికంతో పాటు జ్ఞాపిక, సన్మాన పత్రంను అందిస్తారు. అలానే నంది టీవీ అవార్డులకూ 48 కేటగిరిల్లో అవార్డులు అందిచనున్నారు. ఆ రకంగా తెలుగు సినిమా, టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించడమే నంది అవార్డుల ప్రధాన ఉద్దేశ్యమని భరత్‌ భూషణ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్.డి.సి. ఎండీ కె.ఎస్. విశ్వనాథన్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

Updated Date - Sep 22 , 2026 | 03:33 PM