నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రధాని మోదీ ప్రశంసలు
ABN, Publish Date - Sep 16 , 2026 | 06:25 PM
భారతీయ చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత, అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ (2024 సంవత్సరానికి గాను) దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌ను వరించింది.
భారతీయ చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత, అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ (2024 సంవత్సరానికి గాను) దిగ్గజ నటుడు అనంత్ నాగ్ (Anant Nag)ను వరించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన అసమానమైన సేవలు, తరతరాలకు స్ఫూర్తినిచ్చిన ఆయన సుదీర్ఘ నట ప్రయాణాన్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మహోన్నత గౌరవాన్ని ప్రకటించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award 2024) ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్ (కేవడియా) వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రదానోత్సవంలో అనంత్ నాగ్‌కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు తన సహజ సిద్ధమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనంత్ నాగ్.. జాతీయ స్థాయిలో భారతీయ సినిమా గర్వించదగ్గ నటులలో ఒకరిగా నిలిచారు. తెలుగులోనూ ఆయన అనేక చిత్రాలలో నటించారు. మరీ ముఖ్యంగా ‘కెజియఫ్’ మొదటి పార్ట్ స్టోరీని అనంత్ నాగ్ రన్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు. అలాగే తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషించారు.
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన లెజెండరీ నటుడు అనంత్ నాగ్ గారికి హృదయపూర్వక అభినందనలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ప్రదర్శించిన సహజ నటన, అద్భుతమైన వైవిధ్యం భారతీయ చిత్ర పరిశ్రమపై, ముఖ్యంగా కన్నడ సినిమాపై బలమైన ముద్ర వేశాయి. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో అరుదైన గాంభీర్యం, ప్రామాణికత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. నిజంగా ఓ విశిష్ట కళాకారుడికి దక్కిన అర్హమైన గౌరవం ఇది’’ అని ప్రధాని ప్రశంసించారు. అనంత్ నాగ్‌కు ఈ అత్యున్నత పురస్కారం లభించడంపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి!
ఆ సినిమా కూడా ఫట్.. ఇక కేవీఎన్‌ను ‘కాకా’నే కాపాడాలి
ప్రధాన పాత్రలన్నింటితో.. ‘ఫీల్ మై లవ్’ స్పెషల్ పోస్టర్ వైరల్
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సూరి, సుహాస్.. ‘మండాడి’ కలెక్షన్ల సునామీ