ఆ సినిమా కూడా ఫట్.. ఇక కేవీఎన్‌ను ‘కాకా’నే కాపాడాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:38 PM
పాన్ ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడా సంస్థ ఆశలన్నీ చిరంజీవిపైనే ఉన్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ప్రస్తుతం తీవ్రమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. వివిధ భాషల్లో భారీ బడ్జెట్‌లతో అగ్ర నటులతో సినిమాలు నిర్మించినప్పటికీ.. ఆ సంస్థ ఖాతాలో సరైన ఒక్క హిట్ కూడా పడకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కేవీఎన్ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా పరాజయం పాలై నిర్మాతలకు ఊహించని నష్టాలను మిగిల్చాయి.
గతేడాది కన్నడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కోలీవుడ్ దళపతి విజయ్‌తో నిర్మించిన ప్రతిష్టాత్మక తమిళ చిత్రం ‘జననాయగన్’ (Jananayagan) కంటెంట్ పరంగా తీవ్ర విమర్శలపాలై కమర్షియల్‌గా ఘోరంగా ఫెయిలైంది. మలయాళంలో విడుదల చేసిన ‘బాలన్ ది బాయ్’ కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేక చతికిలబడింది. ఇక రాకింగ్ స్టార్ యష్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘టాక్సిక్’ (Toxic) సైతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తాజాగా బాలీవుడ్‌లో రిలీజైన ‘హైవాన్’ (Haiwaan) సినిమాకు కనీస ప్రేక్షకాదరణ కరువై, బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక బోల్తా కొట్టింది.
ఇలా అన్ని భాషల్లో ఎదురైన వరుస వైఫల్యాలతో డీలా పడ్డ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇప్పుడు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాకా’ (Kaaka). సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పండుగ బరిలో మెగాస్టార్ చూపే మాస్ మేనియా, బాక్సాఫీస్ స్టామినాపై నిర్మాతలు కొండంత నమ్మకంతో ఉన్నారు. కేవీఎన్ పరువును నిలబెట్టి, వారి వరుస ఫెయిల్యూర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ‘కాకా’ భుజస్కంధాలపైనే పడింది. అన్ని ఇండస్ట్రీలలో ఎదురుదెబ్బ తిన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు టాలీవుడ్ ఎలాంటి విజయాన్ని ఇస్తుందో? సంక్రాంతి బరిలో చిరంజీవి ఇచ్చే హిట్ ఈ నిర్మాణ సంస్థను మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కిస్తుందో లేదో తెలియాలంటే.. ఇంకా మూడు నెలలకు పైగా వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి!
ప్రధాన పాత్రలన్నింటితో.. ‘ఫీల్ మై లవ్’ స్పెషల్ పోస్టర్ వైరల్
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సూరి, సుహాస్.. ‘మండాడి’ కలెక్షన్ల సునామీ
నాడు అడుగేస్తే చప్పట్లు.. నేడు జైలులో ఊచలు