EVV Satyanarayna: 'అల్లరి' నరేష్ తాతయ్య కన్నుమూత
ABN, Publish Date - Jan 20 , 2026 | 01:30 PM
ప్రముఖ నటుడు 'అల్లరి' నరేశ్ తాతయ్య ఈదర వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈదర వెంకట్రావు పెద్దకొడుకు ఈవీవీ సత్యనారాయణ కాగా ఆయన పిల్లలిద్దరూ సినిమా రంగంలోనే నటులుగా రాణిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ ఇవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) తండ్రి ఈదర వెంకట్రావు (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియచేస్తూ, వృద్ధాప్య కారణాలతో కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, జనవరి 20వ తేదీ తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారని తెలిపారు.
ఈదర వెంకట్రావు భార్య భార్య వెంకట రత్నం 2019 మే 27న మరణించారు. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ కాగా, రెండవ కుమారుడు ఈవీవీ గిరి. మూడో అబ్బాయి ఈవీవీ శ్రీనివాస్. వీరిద్దరూ కూడా అన్న ఈవీవీ సత్యనారాయణతో పాటు సినిమా రంగంలో ఉండేవారు. ఈదర వెంకట్రావు దంపతుల కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ. ఆవిడ భర్త బ్రహ్మానందం సినిమా నిర్మాతగా వ్యవహరించేవారు. ఇవీవీ సత్యనారాయణ కుమారులు ఆర్యన్ రాజేశ్, 'అల్లరి' నరేశ్. వీరిద్దరూ సినిమా నటులే. ప్రస్తుతం రాజేశ్ (Rajesh) నటనకు దూరంగా ఉండగా, నరేశ్ (Naresh) హీరోగా రాణిస్తున్నాడు. ఈదర వెంకట్రావు అంత్యక్రియలు జనవరి 20వ తేదీ నిడదవోలు మండలం కోరుమామిడిలో సాయంత్రం జరుగుబోతున్నాయి.