'డెకాయిట్' చూడాలంటే ఇదే సరైన సమయం!
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:58 PM
అడివి శేష్ తాజా చిత్రం 'డెకాయిట్' టిక్కెట్ రేట్లు శుక్రవారం నుండి తగ్గుతున్నాయి. ప్రేక్షకులకు అందుబాటు ధరలో తమ చిత్రాన్ని ఉంచాలని మేకర్స్ భావించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.
అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలు పోషించిన 'డెకాయిట్' (Dacoit) మూవీ ఏప్రిల్ 10న జనం ముందుకు వచ్చింది. షానీల్ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత పనితనం చూపించినా... కథ, కథనంలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే భిన్నంగా ఉందని వారు భావించారు. దాంతో ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని మేకర్స్ భావించారు. సహజంగా కొన్ని చిన్న సినిమాలను విడుదల రోజు నుంచి తక్కువ రేట్లకే నిర్మాతలు ప్రదర్శిస్తున్నారు. సింగిల్ స్క్రీన్ ధర వంద రూపాయలుగా, మల్టీప్లెక్స్ థియేటర్ల టిక్కెట్ ధర 150గా వారు ఫిక్స్ చేస్తున్నారు. తాజాగా 'డెకాయిట్' చిత్ర నిర్మాతలు అదే నిర్ణయం తీసుకున్నారు.
ప్రేక్షకులకు అందుబాటు ధరలో తమ చిత్రాన్ని ఉంచాలనే ఉద్దేశ్యంతో సుమారు మూడు వందల రూపాయలు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ టిక్కెట్ ధరను శుక్రవారం నుంచి తెలంగాణలో రూ. 150కు తగ్గించారు. అలానే రూ. 150 నుండి 175 వరకూ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల టిక్కెట్ ధరలను రూ. 105కు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ లోని మిగిలిన రెండు క్లాసుల ధరలను రూ. 80, రూ. 50 పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ధరలు రూ. 105, రూ. 70గా ఫిక్స్ చేశారు. హీరో అడివి శేష్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాను భారీగా తెరకెక్కించడం, షూటింగ్‌ను ఎక్కువ రోజులు చేయడం, రీ-షూట్ జరపడం... ఇవన్నీ నిర్మాతకు భారమయ్యాయన్నది విశ్లేషకుల మాట. ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సందర్భంగా మేకర్స్ ఇటీవల థ్యాంక్స్ మీట్ నిర్వహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరి ఇప్పుడు టిక్కెట్ రేట్లను తగ్గించడమనేది ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!