IFFI: 57వ ఇఫి ముగింపు వేడుకలు.. ‘కాంతార’కు డబుల్ ధమాకా!
ABN, Publish Date - Nov 29 , 2026 | 12:55 PM
గోవాలో 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ముగిశాయి. ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ చిత్రానికి రిషబ్ శెట్టి రెండు అవార్డులు అందుకున్నారు. ఇతర విభాగాల విజేతల వివరాలు ఇవే.
గోవాలో నిర్వహించిన 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిత్రాలు, నటీనటులు, దర్శకులకు పురస్కారాలు అందజేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఫెస్టివల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్, ఎన్ఎఫ్డీసీ ఛైర్మన్ కృష్ణ కుమార్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ తదితరులు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా స్పానిష్ సినిమా ‘అక్వి’ నిలిచింది. ఈ చిత్రానికి గానూ దర్శకుడు టియాగో గీడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు.
కన్నడ నటుడు రిషబ్ శెట్టికి ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ చిత్రానికి రెండు విభాగాల్లో గుర్తింపు లభించింది. ఉత్తమ నటుడి పురస్కారంతో పాటు స్పెషల్ మెన్షన్ అవార్డు కూడా ఆయనకు దక్కింది. జర్మనీ దర్శకుడు వోల్కర్ ష్లాండోర్ఫ్ ‘విసిటేషన్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘మెల్ట్‌డౌన్’ చిత్రంలో నటనకు మాయా ఓరూర్క్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా విశాల్ చతుర్వేది (‘హనుమాన్ అంశ్’) అవార్డు పొందారు. తొలి ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ విభాగంలో ‘ది గోల్డెన్ ఏజ్’ చిత్రానికి బెరెంగర్ థౌయిన్ పురస్కారం అందుకున్నారు. ఇక ఉత్తమ వెబ్ సిరీస్ విభాగంలో ‘మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటన్ స్టోరీ’ విజేతగా నిలిచింది. అర్జెంటీనా చిత్రమైన ‘ది రివైర్ ట్రైన్’ స్పెషల్ జ్యూరీ అవార్డును దక్కించుకుంది. ‘రహ్మా’ చిత్రానికి ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్ లభించింది. ఈసారి ‘సరిహద్దులు లేని కథలు’ అనే థీమ్‌తో ఇఫి వేడుకలను నిర్వహించారు. 86 దేశాల నుంచి వచ్చిన 159 అంతర్జాతీయ చిత్రాలతో పాటు 76 భారతీయ సినిమాలను ప్రదర్శించారు. తొమ్మిది ప్రపంచ ప్రీమియర్లు, రెండు అంతర్జాతీయ ప్రీమియర్లు, 24 ఆసియా ప్రీమియర్లు, 116 భారతీయ ప్రీమియర్లు, 14 గాలా ప్రీమియర్లు ఈ వేడుకల్లో భాగమయ్యాయి. ఇండియన్ పనోరమా విభాగంలో 18 భాషలకు చెందిన 76 చిత్రాలను ప్రదర్శించారు. విభిన్న దేశాలు, భాషలకు చెందిన సినిమాలతో సాగిన ఈ వేడుకలు సినీ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందించాయి.
ALSO READ:
Nithya Menen: యంత్రంలా ఆగకుండా పనిచేయలేను.. కృత్రిమంగా నటించలేను
Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..
‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!