Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:16 AM

''సినిమా విజయం సాధిస్తే ప్రశంసలు.. పరాజయం ఎదురైతే విమర్శలు. ముఖ్యంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానంటున్నారు యువ సామ్రాట్ నాగచైతన్య.

''సినిమా విజయం సాధిస్తే ప్రశంసలు.. పరాజయం ఎదురైతే విమర్శలు. ముఖ్యంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానంటున్నారు యువ సామ్రాట్ నాగచైతన్య. తాజాగా ‘ఇప్పటిదాకా విత్ జాస్తి’ (Ippatidaaka with Jasti) ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన అత్యంత కఠినమైన దశతో పాటు, జీవితంలో ఆనందాన్ని పంచిన క్షణాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను చివరిసారి ఎప్పుడు ఏడ్చారో చెప్పుకొచ్చారు.

‘'మజిలీ’ సినిమాకు ముందు నా జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అప్పట్లో నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఒకవేళ తర్వాతి సినిమా కూడా విజయం సాధించకపోతే మరో రంగంలో అవకాశాలను అన్వేషించాలేమోనని ఆలోచించాను. ‘అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అగ్ర నటుల కుటుంబం నుంచి రావడంతో నాపై అంచనాలు, బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. అభిమానులు కూడా నా సినిమాల ఫలితాలతో నిరాశ చెందడంతో ఆ దశ నాకు చాలా కష్టంగా అనిపించింది. అయితే, ఆ కఠినమైన రోజులను దాటుకుని ‘తండేల్’తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటి. ఈ సినిమాకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. నా కెరీర్‌లో ఇది మరిచిపోలేని మధురానుభూతి అది' అని చెప్పుకొచ్చారు.

అయితే నాగ చైతన్య చివరిసారి ఏడ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "బాధ కలిగితే ఏడుస్తాను. కానీ ఎక్కువగా నా బాధను బయటకు చూపించకుండా మనసులోనే దాచుకుంటాను. ఓ రెండు నెలల క్రితం చివరిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాను. సినిమాలు చూస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాను. ముఖ్యంగా బ్రాడ్ పిట్ నటించిన ‘హార్ట్ ఆఫ్ ది బీస్ట్’ సినిమా చూస్తూ ఏడ్చాను'' అని అన్నారు. నాగ చైతన్య నటించిన 'వృషకర్మ' చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది.

Updated Date - Nov 29 , 2026 | 11:20 AM