The Odyssey: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది ఒడిస్సీ
ABN, Publish Date - Jul 20 , 2026 | 10:47 AM
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’ (The Odyssey) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’ (The Odyssey) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. హాలీవుడ్ స్టార్ మాట్ డామన్ ప్రధాన పాత్రలో క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్‌లో భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2,548 కోట్లకు (264 మిలియన్ డాలర్లు) పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. నోలన్ కెరీర్‌లో ఇది గొప్ప రికార్డుగా చెబుతున్నారు. ఇండియాలోనూ ఈ సినిమాకు అనూహ్యమైన ఆదరణ లభించింది. తొలి రోజే రూ.20.76 కోట్ల గ్రాస్ వసూలు చేసి హాలీవుడ్ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 39.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) రాబట్టిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసే సరికి మరింత జోరు చూపించింది.
తాజాగా నిర్మాణ సంస్థ వసూళ్ల వివరాలను వెల్లడించింది. మొదటి మూడు రోజుల్లో 264 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో ఉత్తర అమెరికా నుంచే 124 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ వసూళ్లతో నోలన్ గత బ్లాక్‌బస్టర్ చిత్రాలైన ‘ది డార్క్ నైట్ రైజెస్’ తొలి వీకెండ్ 249 మిలియన్ డాలర్లు, ‘ఒప్పెన్‌హైమర్’ తొలి వీకెండ్ 181 మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ సినిమా అధిగమించింది. తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘ది ఒడిస్సీ’ త్వరలోనే 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి గ్రీకు కవి హోమర్ రచించిన ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు రూ.2,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.