Christopher Nolan: నోలన్ మనసు దోచిన భారతీయ సినిమా..
ABN, Publish Date - Jul 26 , 2026 | 06:37 PM
నోలన్‌కు నచ్చిన సినిమాల జాబితా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా నోలన్ తనకు ఎంతో ఇష్టమైన కొన్ని సినిమాల గురించి వెల్లడించారు.
క్రిస్టఫర్ నోలన్ (Christopher Nolan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే ఇన్సెప్షన్, ది డార్క్ నైట్ ట్రైలాజీ, ఇంటర్‌స్టెల్లార్, ది ఒడిస్సీ వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తొస్తాయి. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే నోలన్‌కు నచ్చిన సినిమాల జాబితా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా నోలన్ తనకు ఎంతో ఇష్టమైన కొన్ని సినిమాల గురించి వెల్లడించారు.
ఇందులో భారతీయ సినీ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే (Satyajit Ray) తెరకెక్కించిన చిత్రాలు ఉండటం విశేషం. ఇటీవల నోలన్ న్యూయార్క్‌లోని ‘క్రైటీరియన్ క్లోజెట్' (The Criterion Collection) కార్యాలయాన్ని సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా గుర్తింపు పొందిన సినిమాలను భద్రపరిచే ఈ సంస్థలోని ‘క్రైటీరియన్ క్లోజెట్’లో ఎన్నో అరుదైన చిత్రాల కలెక్షన్ ఉంది. ఈ ప్రత్యేకమైన గదిలోకి వెళ్లిన ప్రముఖ దర్శకులు తమకు నచ్చిన సినిమాలను ఎంపిక చేసుకుని, వాటి ప్రత్యేకతలను వివరిస్తుంటారు. అదే విధంగా నోలన్ కూడా తనకు ఇష్టమైన చిత్రాల గురించి మాట్లాడారు. ఆయన ఎంపిక చేసిన సినిమాల్లో సత్యజిత్ రే రూపొందించిన ‘ది అపూ ట్రైలాజీ’ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులోని మొదటి చిత్రం ‘పథేర్ పాంచాలి’ (1955) తనను ఎంతగానో ఆకట్టుకుందని నోలన్ తెలిపారు. సత్యజిత్ రే భారతీయ సినిమాకు అందించిన గొప్పతనం గురించి ఆయన ప్రశంసించారు. సత్యజిత్ రే తెరకెక్కించిన ‘ది అపూ ట్రైలాజీ’ (పథేర్ పాంచాలి అపరాజితో, అపుర్ సంసార్) ప్రముఖ బెంగాలీ రచయిత బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన నవలల ఆధారంగా రూపొందాయి.
క్రిస్టఫర్ నోలన్ మాట్లాడుతూ “భారతీయ సినీ చరిత్రలో సత్యజిత్ రే ఒక గొప్ప దర్శకుడు. ఆయన తెరకెక్కించిన ‘ది అపూ ట్రైలాజీ’లోని తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’ నన్నెంతో ఆకట్టుకుంది. ఆ సినిమాను చూసిన అనుభూతి అద్భుతంగా ఉంది. అయితే ఈ ట్రైలాజీలో మిగిలిన రెండు చిత్రాలను ఇంకా చూడాల్సి ఉంది. అందుకే ఆ సినిమాలను నాతో తీసుకెళ్లి, అపు జీవిత ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన క్రిస్టఫర్ నోలన్ వంటి దర్శకుడు కూడా సత్యజిత్ రే సినిమాలను ప్రశంసించడం భారతీయ సినీ ప్రతిభకు మరోసారి గౌరవాన్ని తీసుకొచ్చింది. కాలంతో సంబంధం లేకుండా గొప్ప సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని ‘అపూ ట్రైలాజీ’ మరోసారి గుర్తుచేస్తోంది.