సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Marichika Movie: అనుపమా పరమేశ్వరన్‌ 'మరీచిక' మూవీ రివ్యూ

ABN, Publish Date - May 29 , 2026 | 01:44 PM

విరాజ్‌ అశ్విన్, అనుపమా పరమేశ్వరన్‌, రెజీనా కసండ్రా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'మరీచిక'. సతీశ్‌ కాశెట్టి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిల‌క‌, మేఘా చిల‌క‌ నిర్మించారు.

Marichika Movie

రెండు దశాబ్దాల క్రితం 'హోమ్‌' సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నారు దర్శకులు సతీశ్‌ కాసెట్టి. ఆ తర్వాత 'కలవరమాయే మదిలో, టెర్రర్‌' వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆయన రూపొందించిన తాజా చిత్రం 'మరీచిక'. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల ఈ సినిమాకు కథ, మాటలు అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన 'మరీచిక'ను రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

సంజు (విరాజ్‌ అశ్విన్) సిటీలో ఓ బేకరీ షాప్‌ నడుపుతుంటాడు. లోయర్‌ మిడిల్‌ క్లాస్ కు చెందిన కాలేజీ స్టూడెంట్‌ వెంకట లక్ష్మీ (అనుపమా పరమేశ్వరన్‌) సంజుని ప్రేమిస్తుంది. తాను పెద్దంత అందంగా ఉండననే ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు ఆమె లోనవుతుంటుంది. తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో ఇక్కడి ఆస్తులు అమ్మేయడానికి ఫారిన్‌ నుంచి వచ్చిన మరీచిక (రెజీనా కసండ్రా)కు వెంకట లక్ష్మీ ద్వారానే సంజు పరిచయం అవుతాడు. వాలెంటైన్స్ డేన తన ప్రేమను సంజుకు చెప్పాలని వెంకట లక్ష్మీ భావిస్తుంది. అదే రోజు సంజు.... మరీచికకు లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. తాను ప్రేమించిన సంజు.. మరీచికకు ఇష్టపడటం చూసి మొదట తట్టుకోలేకపోయిన వెంకట లక్ష్మీ ప్రేమ త్యాగాన్ని కోరుతుందన్నట్టుగా చివరకు తనే వాళ్ళ పెళ్ళి జరిపిస్తుంది. అయితే, సంజు ఆస్తికోసమే మరీచిక అతన్ని ట్రాప్‌ చేసి పెళ్ళి చేసుకుందనే విషయం తెలియడంతో పాటు సంజుని మరీచిక చంపేయడం చూసిన వెంకట లక్ష్మీ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. మరీచికను అరెస్ట్ చేయమని అర్థిస్తుంది. సంజు గురించి వివరాలు సేకరించడానికి పోలీసులు అతని షాప్‌ కు వెళ్ళినప్పుడు, అతనే స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వస్తాడు. తనను ఎవరూ చంపలేదని, వెంకట లక్ష్మీ ఏదో ఊహించుకుని కట్టుకథ అల్లిందని, మరీచిక అనే వ్యక్తే తన జీవితంలోకి రాలేదని స్పష్టం చేస్తాడు. అసలు మరీచిక ఉందా? లేదా? ఆమె లేకపోతే... సంజును చంపిందని పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెంకటలక్ష్మీ ఎందుకు కంప్లైంట్‌ ఇచ్చింది? సంజు చనిపోయాడని వెంకట లక్ష్మీ చెప్పింది నిజమైతే... పోలీస్ స్టేషన్ కు సంజు ఎలా వచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.


సినిమా ప్రారంభమే మరీచిక.. సంజూని చంపడంతో మొదలవుతుంది. దాన్ని చూసిన వెంకట లక్ష్మీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి తన వర్షన్‌ను చెబుతుంది. ద్వితీయార్థం మొదలైన తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సంజు తన వర్షన్ చెబుతాడు. మరీచిక లేదని నమ్మబలికిన సంజుకు... ఆమె ఆత్మ కనిపించడంతో భయం మొదలవుతుంది. మొదట అదంతా డ్రామా అనుకున్న వెంకట లక్ష్మీకీ మరీచిక ఆత్మ కనిపించడమే కాదు... సంజుతో జరిగే పెనుగులాటలో అతన్ని హతమార్చుతుంది. దాంతో మరోసారి పోలీస్‌ స్టేషన్ కు వచ్చిన వెంకటలక్ష్మీ ఈసారి మరీచిక ఆత్మ సంజును చంపేసిందని చెబుతుంది. ఇందులో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియక పోలీసులు తలపట్టుకుంటారు. నిజానికి వాళ్ళే కాదు... థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ను జస్టిఫై చేశారు.

ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్‌. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.


నటీనటుల విషయానికి వస్తే... కీలక పాత్రలు చేసిన ముగ్గురిలో అనుపమా పరమేశ్వర్‌ అదరగొట్టింది. అమాయకురాలి పాత్రలోనే కాదు... ఎంతకైనా తెగించే అమ్మాయిగానూ బాగా చేసింది. ఎన్.ఆర్.ఐ. పాత్రలో రెజీనా కసండ్ర ఒదిగిపోయింది. విరాజ్‌ అశ్విన్‌ సైతం తన పాత్రకు బాగానే న్యాయం చేశాడు. ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్ మూవీలో కాస్తంత వినోదాన్ని పంచిన పాత్ర ఏదైనా ఉందంటే అది ఎస్.ఐ.గా నటించిన అజయ్‌ ఘోష్‌ దే! కొన్ని చోట్ల కాస్తంత ఓవర్‌ గా అనిపించి, ప్రేక్షకులను తన డైలాగ్‌ మాడ్యులేషన్, పెక్యులర్‌ బాడీ లాంగ్వేజ్‌తో ఎంటర్ టైన్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను వడ్లమాని సాయి శ్రీనివాస్‌, తాగుబోతు రమేశ్‌, భద్రం, మేకా రామకృష్ణ, అనీశ్‌ కురువిల్ల తదితరులు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్‌ నటన కోసం ఓసారి చూడండి. అంతే!

రేటింగ్‌: 2/5

ట్యాగ్‌ లైన్: యాప్ట్ టైటిల్‌!

ఇది కూడా చదవండి:

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ


System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 29 , 2026 | 03:31 PM