సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwanath & Sons: విశ్వనాథ్‌ అండ్ సన్స్ మూవీ రివ్యూ

ABN, Publish Date - Aug 14 , 2026 | 01:11 PM

సూర్య, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'విశ్వనాథ్‌ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.

Vishwanath and Sons

గత కొన్నేళ్ళుగా సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది బాగా కలిసొచ్చింది. సూర్య హీరోగా ఆర్.జె. బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') మంచి విజయాన్ని సాధించింది. దాంతో అతని తాజా చిత్రం 'విశ్వనాథ్‌ అండ్ సన్స్'పై అంచనాలు పెరిగాయి. మరి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం.

సంజయ్‌ విశ్వనాథ్‌ (సూర్య) పెద్ద బిజినెస్ మాగ్నెట్. అంతే కాదు రైఫిల్ షూటింగ్‌లో వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా! అలాంటి సక్సెస్ ఫుల్ పర్శన్‌ జీవితంలో చిన్నపాటి లోటు. నలభై సంవత్సరాలు పైబడినా అతను పెళ్ళి మాత్రం చేసుకోడు. అందుకు కారణం అతని తండ్రి విశ్వనాథ్‌ (రాజీవ్‌ మీనన్). ఆయన తన తల్లి (రాధిక)నే కాకుండా మరో నటి (రవీనా టాండన్)ని రెండో పెళ్ళి చేసుకుంటాడు. తండ్రి చేసిన పనివల్ల సంజయ్‌కు వివాహబంధం మీద విరక్తి కలుగుతుంది. అందుకే అవివాహితుడు గానే ఉండిపోతాడు. అయితే వారసుల లేకుండా పోతున్నారనే తల్లి బాధను అర్థం చేసుకుని, సరొగసీ ద్వారా ఓ బాబుకు జన్మనిస్తాడు. నెలల వయసున్న ఆ పిల్లాడికి అనారోగ్యం ఏర్పడి, బోన్ మ్యారో చేయాల్సి వస్తుంది. దాంతో బాబుకు జన్మనిచ్చిన తల్లి మ్యాడీ (మమితా బైజు)ని వైద్యం నిమిత్తం సంజయ్ ఇండియాకు తీసుకొస్తాడు. తనకంటే ఇరవై యేళ్ళు పెద్దవాడైన సంజయ్ తో మ్యాడీ ప్రేమలో పడుతుంది. అతన్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సంజయ్ అందుకు ఏ మాత్రం అంగీకరించడు. బాబుకు వైద్యం పూర్తయిన తర్వాత మ్యాడీని ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సిందేనని సంజయ్‌ పట్టు పడతాడు. సంజయ్‌ ప్రేమను వదులుకోవడం ఇష్టం లేని మ్యాడీ ఏం చేసింది? కోర్టు వరకూ వెళ్ళిన వారి వ్యవహారం ఎలా సెటిల్‌ అయ్యింది? సవతి తల్లి కారణంగా వివాహ బంధానికి దూరమైన సంజయ్... ఆమె కోసం ఏం చేశాడు? మ్యాడీ - సంజయ్ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది మిగతా కథ.


ఇలాంటి కథలతో, సన్నివేశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. పూర్తిగా ఇది కొత్త కథ అని చెప్పలేం. అలానే ఈ సన్నివేశాలను ఇప్పుడే చూస్తున్నామనీ అనుకోలేం. కాకపోతే... కథను నడిపిన తీరు, నటీనటుల నటన కారణంగా ఇది ఎంగేజింగ్ మూవీ అయిపోయింది. సంజయ్‌ బాల్యం, క్రీడాకారుడిగా, వ్యాపారవేత్తగా అతని ఎదుగుదల, సాధించే విజయాలు, వివాహ బంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉండటం, అందుకు చూపించిన కారణాలు... ఇవన్నీ ఆడియెన్స్ ను ఇంప్రస్ చేసేలా ఉన్నాయి. సరొగసీ ద్వారా బిడ్డను కని ఇంటికి తీసుకు రావడం ఓ ఊహించని మలుపు అయితే, ఆ తర్వాత కుటుంబంలో జరిగే పరిణామాలు, వాటిని అతను మ్యాడీ సాయంతో అధిగమించడం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. బంధాలు అనుబంధాల గురించి దర్శకుడు చెప్పాలనుకున్న దాన్ని హృదయానికి హత్తుకునేలా బలంగా చెప్పాడు. ప్రథమార్ధంలో సంజయ్ ఆఫీస్ కారు డ్రైవర్ ఎపిసోడ్ బాగుంది. అలానే పైకి ప్రాక్టికల్ పర్శన్ గా కనిపించినా, అతని మనసు లోతుల్లోని మెత్తదనాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. సూర్య పాత్రకు పూర్తి కాంట్రాస్ట్ గా మ్యాడీ పాత్రను తీర్చిదిద్దడం కొత్త రంగును యాడ్ చేసినట్టు అయ్యింది. రాధిక, రవీనా టాండన్ పాత్రలు హుందాగా బాగున్నాయి. అరమరికలు మరిచిపోయి, ఇగోలను పక్కన పెట్టి అందరూ కలిసి మెలిసి జీవితాన్ని సాగించాలనే ఓ గొప్ప సందేశాన్ని బాగా చూపించారు. అయితే ఈ క్రమంలో మెలో డ్రామా పైన దర్శకుడు బాగానే ఆధారపడ్డాడు. సూర్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎలివేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను అవసరం లేకపోయినా మిక్స్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా తీశారు. ఇక త్రివిక్రమ్ ను గుర్తు చేసే పంచ్ డైలాగ్స్ కూ ఇందులో కొదవలేదు. చాలా కాలం తర్వాత థియేటర్ లో డైలాగ్స్ కు క్లాప్స్ పడటం కనిపించింది. ఇటీవల సూర్య నుండి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ 'కరుప్పు'ను చూసిన ప్రేక్షకులకు ఇదో ఛేంజ్ ఓవర్. అలానే విపరీతమైన బ్లడ్ షెడ్‌, చిత్ర విచిత్రమైన ఆత్మల సినిమాలు చూసి విసిపోతున్న తెలుగువారికి కాస్తంత రిలీఫ్‌ ను ఇచ్చేదిగా ఉంది! అందువల్ల కథ, కథనాలలో కొత్తదనం లేకపోయినా... హాయిగా దీన్ని ఆస్వాదించే ఆస్కారం ఏర్పడిందనుకోవచ్చు.


నటీనటుల విషయానికి వస్తే సూర్య తన పాత్రకు ప్రాణం పోశాడు. మమితా బైజును తప్ప మ్యాడీగా మరొకరిని ఊహించుకోలేం. రాధిక ఈ సినిమాకు బలమైన పునాదిగా నిలిచింది. రవీనా టాండన్ తన గ్రేస్ తో ఆకట్టుకుంది. సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్‌ రెడ్డి సూపర్ టైమింగ్‌తో కామెడీని అద్భుతంగా పండించాడు. అలానే డాక్టర్ గా నటించిన ఆయన భార్య పాత్రధారిణి కూడా! ఇతర ప్రధాన పాత్రలను వైవా హర్ష, కాళీ వెంకట్, సుధ, సర్వదమన్ బెనర్జీ, నాజర్, రఘుబాబు, హైపర్ ఆది, భవానీ తదితరులు చేశారు. జీవీ ప్రకాశ్‌ సమకూర్చిన నేపధ్య సంగీతం బాగానే ఉంది కానీ సక్సెస్ ఫుల్ ట్యూన్స్ మాత్రం పడలేదు. నిమిష్ రవి కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు తిరుగులేదు. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్థంలో కథ అక్కడక్కడా గాడి తప్పింది. అలానే క్లయిమాక్స్ సైతం పెద్దంత గొప్పగా ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ మాత్రం ఎంగేజ్ చేసే మూవీ ఏదీ రాలేదనే చెప్పాలి. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' ఫస్ట్ ఛాయిస్‌గా నిలువనుంది.

రేటింగ్‌: 3/5

ట్యాగ్‌ లైన్ : విశ్వనాథ్‌ అండ్ ఫ్యామిలీ!

ఇవీ చదవండి:

Agadha Review: ఎమ్మెస్‌ రాజు.. 'అగధ' మూవీ రివ్యూ! కామాక్షీ భాస్కర్ల.. డివైన్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే


క‌న్న‌డ‌ నటిపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు

Updated Date - Aug 14 , 2026 | 02:57 PM