Mandaadi Review: సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Sep 10 , 2026 | 01:01 PM
సూరి, సుహాస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘మండాడి’ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం
సినిమా రివ్యూ: ‘మండాడి’(Mandaadi Movie Review)
విడుదల తేది: 10-9-2026
సూరి, సుహాస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘మండాడి’. మహిమా నంబియార్ కథానాయిక. సత్యరాజ్, రవీంద్ర విజయ్, 'ఆడుకాలం' మురుగదాస్ కీలక పాత్రధారులు. మధిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. ఎల్రెడ్‌కుమార్, వెట్రిమారన్ నిర్మించిన ఈ చిత్రం గురువారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పోర్ట్స్, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ: (Mandaadi Review)
కళింగపట్నం అంటేనే తెర పడవ పందాలకు పెట్టింది పేరు. అక్కడ పడవ పందాలు ఆట మాత్రమే కాదు.. ఆ ఊరి గౌరవానికి సంబంధించిన విషయం. ఆ ఊళ్లో ముత్తు కాళి (సూరి), సాట్టా పులి (సుహాస్) ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. మునియ్య (సత్యరాజ్) దగ్గర తెర పడవ పందాలు నేర్చుకుని తిరుగులేని ఛాంపియన్లుగా గుర్తింపు పొందుతారు. వీరిద్దరూ పందెల్లో దిగితే విజయం ఖాయం అనేంత నమ్మకం. కానీ ఓ పడవ పందెం వారి జీవితాలను మార్చేస్తుంది. దాంతో గురువైన మునియ్య మరణిస్తాడు. దాని వెనకున్న పలు కారణాలతో కాళి ఊరు వదిలి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి ఆ ఊళ్లో సాట్ట పులి రాజ్యమే నడుస్తుంది. ఆ ఊరి యువతకు ఆటపై ఆసక్తి పోతుంది. పులి కొడుకు కిషోర్‌పై జాతరలో జరిగిన దాడి వెనుక ఏంజల్ చిలకమ్మ (మహిమా నంబియార్) కొడుకు మారి ఉండటంతో అతను గొడవలకు భయపడి అనుకోకుండా హైదరాబాద్‌లో ఉంటున్న కాళి దగ్గరకు చేరుకుంటాడు. 20 ఏళ్ల తర్వాత కాళి కళింగ పట్టణానికి వస్తాడు. ఆ ఊళ్లో ఓడిపోయిన కుర్రాళ్లను సమీకరించి టీమ్‌గా తయారుచేసి ఆటలో దింపుతాడు. ఆ క్రమంలో కాళి, పులి మధ్య పాత గొడవేంటనేది బయటపడుతుంది. ఆ గొడవ ఎవరి వల్ల జరిగింది.. స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? చిలకమ్మ (మహిమ నంబియార్) ఎవరు? ఫైనల్‌గా ఈ ఆటలో దిట్ట అయిన కాళి ఊరిని గెలిపించాడా? లేదా అన్నది కథ.
విశ్లేషణ:
సముద్రంలో తెర పడవ పోటీలు.. ఇద్దరు మిత్రులు శత్రువులు గా ఎందుకు మారారు? తప్పు ఎటువైపు ఉంది? ఫైనల్‌గా ఎవరు గెలిచారు? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ డ్రామా ఇది. ఫస్టాఫ్ అంతా కాళి, పులి మధ్య వైరం, పోటీలు గురించి చూపించాడు దర్శకుడు. ఇంటర్‌వెల్ సమయానికి ఇద్దరి మధ్య వైరానికి గల కారణాన్ని చెబుతూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సినిమాపై మరింత ఆసక్తి కలుగుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే సన్నివేశాలు ఫైట్స్, ఫ్యామిలీ డ్రామా అంతా సోసోగా సాగుతుంది. ఈ సినిమాకు ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ చాలా కీలకం. ఎందుకంటే అసలు కథ అంతా అక్కడే ఉంది. స్నేహితులు ఇద్దరికీ మధ్య శత్రుత్వం పెరగడానికి కారణం చెబుతూ ఇచ్చిన ఫ్లాష్‌బ్యాక్ రొటీన్‌గానే ఉన్నా సూరి, సత్యరాజ్, సుహాస్ నటన ఆ భావన కలగకుండా చేస్తుంది. సత్యరాజ్ శిక్షణ ఇవ్వడం, చిలకమ్మతో కాళి ప్రేమాయణం ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ దర్శకుడు కొన్ని లాజిక్‌లు వదిలేశాడు. కాళి పడవ పందెంతో ఎక్స్‌ఫర్ట్ అని చెప్పారు. కానీ దానిని బ్యాలెన్స్ చేయడానికి ఫస్టాఫ్‌లో అలాంటి వీరోచిత సన్నివేశం సాట్ట పులితో ఒకటి కూడా చూపించలేదు. స్పోర్ట్స్ కథలకు భావోద్వేగం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఆటలో భావోద్వేగం కాకుండా.. ఫ్యామిలీ ఎమోషన్‌ను రీజన్‌గా చూపించి కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. అది అంత కన్వెన్‌సింగ్‌గా అనిపించిలేదు. అయితే సముద్రంలో యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదరగొట్టారు. సుడిగుండం సన్నివేశం అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. నడి సంద్రంలో అలా.. ఎలా.. చేశారు అని ఆశ్చర్యం కలగకమానదు. గ్రీన్ మ్యాట్ వాడి చేసే అవకాశం ఉన్నా రియల్ ప్లేస్‌లో చేయడంతో చిత్ర బృందం రిస్క్ చేసిందనే చెప్పాలి. తెరచాప పడవ పందేల్లో ఇంత విషయం ఉందా? ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయా? అనిపించకమానదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
తమిళనాట కమెడీయన్‌గా మంచి గుర్తింపు పొందిన సూరి ఇప్పటికే మెయిన్ లీడ్‌గా కొన్ని చిత్రాలు చేసి సక్సెస్ అయ్యారు. సహజమైన నటనకు ఆయన కేరాఫ్. ఈ చిత్రంతో కాళిగా ఎప్పటిలాగే సహజంగా నటించి మెప్పించారు. ఇందులో ఆయన కనబర్చిన నటనకు, సముద్రంలో చేసిన సాహసాలకు ‘వావ్’ అనక తప్పదు. ఒక కమెడీయన్‌లో ఇంతా మార్పా అనిపించక మానదు. అదే రేంజ్‌లో తెలుగు నటుడు సుహాస్ కూడా పోటీ పడ్డారు. సాట్ట పులిగా మెప్పించారు. యూ ట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎదిగిన ఆయన ఈ చిత్రంతో మంచి మార్కులే సంపాదిస్తారు. డీగ్లామర్ రోల్‌లో ఏంజల్ చిలకమ్మగా మహిమా నంబియర్ చక్కగా ఒదిగిపోయారు. ఆమె పాత్ర సినిమాకు కీలకం. సత్యరాజ్ నటనానుభవం మునియ్య పాత్రకు ఉపయోగపడింది. రవీంద్ర విజయ్, మిథున్, తదితరులు పాత్రల మేరకు బాగానే చేశారు.
టెక్నికల్ విజయానికొస్తే.. ఈ సినిమాకు కెమెరా పనితనం, సంగీతం కీలక పాత్ర పోషించాయి. పడవ పోటీలు, కళింగ పట్నం సహజత్వం, సముద్రంలో సాహస పోటీలను అద్భుతంగా రియలిస్టిక్‌గా చూపించారు సినిమాటోగ్రఫర్ ఎస్.ఆర్ కథిర్. ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్న జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ఎసెట్. ఎక్కడ సీన్ ఎలివేషన్ కావాలో అక్కడ ఎలివేట్ అయ్యేలా సంగీతం అందించారు. రీ-రికార్డింగ్ అదిరిపోయింది. పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా రెండు పాటలు సందర్భానుసారంగా ఉండి అలరించాయి. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే షార్ప్‌గా కథ నడిచేది. నిర్మాణ విలువలు బావున్నాయి. కళింగ పట్టణం ఆర్ట్ వర్క్ నేచురల్‌గా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ. మధిమారన్ రాసుకున్న కథ కాస్త రొటీన్ అయినా కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు ఊహకు అందేలా ఉన్నాయి. కథలో రివేంజ్ రొటీన్‌గానే ఉన్నా తెరచాప పడవ పోటీల పేరుతో సముద్రంలో ఓ కొత్త అనుభూతి కలిగించారు. సముద్రంలో సాహసాన్ని చూడాలనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ట్యాగ్‌లైన్: అలరించే పడవ పోటీ..
రేటింగ్: 2.5/5
ఇవి కూడా చదవండి:
Sardar 2 Review: కార్తీ సర్దార్ 2 మూవీ రివ్యూ
మోక్షజ్ఞ తొలి సినిమాలో శ్రీలీల!?
NT Ramarao: కాసుల వర్షం కురిపించిన 'పిడుగు రాముడు'