రవితేజ 'ఇరుముడి' రివ్యూ
ABN, Publish Date - Aug 21 , 2026 | 01:06 PM
రవితేజ నటించిన 'ఇరుముడి' కేవలం ఫాదర్, డాటర్ సెంటిమెంట్ మూవీ మాత్రమే కాదు.. అంతకు మించి! అదేమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
మాస్ మహరాజా రవితేజకు సక్సెస్ వచ్చి చాలా యేళ్ళయ్యింది. దాంతో ఆయనకో హిట్ వస్తే బాగుండు అని ఇటు ఫ్యాన్సే కాదు... సినిమా రంగంలోని వారూ కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో కాస్తంత భిన్నంగా 'ఇరుముడి' ప్రచార చిత్రాలు ఉండటంతో, ఈ మూవీతో రవితేజ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. మరి వారు ఆశించినట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం.
అది ఉత్తరాంధ్రలోని ఓ పల్లె. పేరు పొల్లూరు. ఆ గ్రామంలో అరటి చెట్లను పండిస్తూ, ఆటో నడిపే త్రినాథ రావుకు (రవితేజ) ఒక్కగానొక్క కూతురు. ఆమే మణెమ్మ (నక్షత్ర). తన భార్య కావేరి (ప్రియ భవానీ శంకర్) కోరిక మేరకు త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కూతురు పుడుతుంది. అందుకే కూతురంటే త్రినాథరావుకు అయ్యప్ప స్వామంత ప్రేమ! అయితే అతనికి తాగుడనే వ్యసనం ఉంటుంది. తాగినప్పుడు ఎవరు ఏం చెప్పినా బుర్రకెక్కించుకోడు, తన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే, ఎంత వరకైనా వెళ్ళిపోతాడు. అదే ఊరిలో ఉండే గురుస్వామి (సాయికుమార్) ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆయన కూతురు గాయత్రిని కూడా త్రినాథ్ సొంత కూతురులానే చూసుకుంటాడు. ఆరో తరగతికి వచ్చిన తన కూతురు మణెమ్మను, గాయత్రితోనే పట్టణంలోని హైస్కూల్ కు పంపుతాడు. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏదో జరగకూడనిది జరుగుతుంటుంది. అక్కడ చదువుకునే నలుగురు అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతారు. వారి మరణాలకు కారణం ఏమిటీ? అదే స్కూల్ లో చదువుకోవడానికి వెళ్ళిన త్రినాథరావు కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తన కళ్లముందు ఏది జరిగినా తండ్రికి వెంటనే చెప్పేసే మణెమ్మ అక్కడి దారుణాన్ని ఎందుకు వెంటనే చెప్పలేకపోయింది? దాని పర్యవసానం ఏమిటీ? అనేదే ఈ సినిమా కథ.
కూతురంటే ప్రాణంగా భావించే త్రినాథ్, తన పల్లెలోని ప్రతి ఆడ బిడ్డనూ కూతురుగానే భావిస్తాడు. కానీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం, ఆడపిల్లకు అన్యాయం జరిగిందనే తట్టుకోలేక పోవడం అనే బలహీనతలతో అతనికి చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది శత్రువులు తయారవుతారు. వాళ్ళంతా త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకుంటే అతనిపై పగ తీర్చుకోవాలని వేచిచూస్తుంటారు. తీరా అతను మాల వేసుకున్న తర్వాత జరగరాని సంఘటనలు ఒక్కొక్కటీ జరిగిపోతాయి. ప్రేక్షకుల ఊహకు కూడా అవి అందనివి! ఆ ట్విస్టుల కారణంగా, ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియచేసేందుకు తీసిన ఈ సినిమాలోని ప్రధానాంశం పలచపడిపోయింది. జరిగిన మరణాలకు సంబంధించిన దోషులను వెలికి తీసే క్రమంలో ప్రేక్షకులను కావాలని కన్ ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అందుకోసం రకరకాల సంఘటనలను, సన్నివేశాలను క్రియేట్ చేశాడు. ఈ వ్యవహారంతో కథ కాస్త గాడి తప్పింది. త్రినాథ్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదలై... రకరకాల మలుపులు తిరిగి అతను గురుస్వామిగా మారడంతో కథ సుఖాంతమౌతుంది. ఈ మధ్యలో ప్రేక్షకులకు కొన్ని కొరుకుడు పడని వాస్తవాలు, అంగీకరించలేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వీటిని అధిగమించేలా... అయ్యప్ప మాలలో రవితేజ కనిపించిన ప్రతి సన్నివేశం డివోషనల్ టచ్ తో బాగుంది. మరీ ముఖ్యంగా అయ్యప్పపై పెట్టిన మూడు పాటలు చాలా బాగున్నాయి. పాపులర్ సాంగ్ 'మల్లెపూల పల్లకి' పాట రీమిక్స్ చేయడం విషయంలో కొంత అసంతృప్తి లేకపోలేదు.
నటీనటుల విషయానికి వస్తే... రవితేజ సహజనటన ప్రదర్శించాడు. పోరాట సన్నివేశాలూ ఇరగదీశాడు. బేబీ నక్షత్రకు ఇదే మొదటి తెలుగు సినిమా. చాలా చక్కగా ఆ పాత్రను పోషించింది. ప్రియ భవాని శంకర్ సగటు తల్లి పాత్రలో ఒదిగిపోయింది. గురుస్వామిగా సాయికుమార్ బాగా సెట్ అయ్యారు. అయితే ఆయన క్యారెక్టర్ లోని ట్విస్ట్ ను జీర్ణించుకోవడం కాస్తంత కష్టమే. మలయాళ నటి శ్వాసిక తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా... భిన్నమైన పాత్రలే ఆమెకు లభిస్తున్నాయి. ఇదీ ఆ కోవకు చెందిదే. ఇతర ప్రధాన పాత్రలను అజయ్ ఘోష్, సురభి ప్రభావతి, రమేశ్ ఇందిర, మీసాల లక్ష్మణ్, కిశోర్ కుమార్, కసిరెడ్డి రాజ్ కుమార్, రమణ భార్గవ్ తదితరులు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపర్చిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవథిలో తెలుగులో వచ్చిన అతని నాలుగో సినిమా ఇది. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రథమార్థం తండ్రీ కూతుళ్ళ అనుబంధంతో సరదాగా సాగిన సినిమా, ద్వితీయార్థంలో కథలోతుల్లోకి వెళ్ళే సరికీ భారంగా మారింది. అయితే చివరి ఇరవై నిమిషాలు రేసీగా సాగింది. ఏదేమైనా... డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో, తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌తో, నటీనటుల సహజ నటనతో రూపుదిద్దుకున్న 'ఇరుముడి' ఇటీవల వచ్చిన రవితేజ చిత్రాలతో పోల్చితే ఫార్ బెటర్ మూవీ!
ట్యాగ్ లైన్: సెంటిమెంట్ 'ఇరుముడి'!
రేటింగ్: 3/5