సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhartha Mahasayulaku Wignyapthi: భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ

ABN, Publish Date - Jan 13 , 2026 | 01:16 PM

రవితేజ, కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మంగళవారం సంక్రాంతి కానుకగా జనం ముందుకు వచ్చింది.

Bhartha Mahasayulaku Wignapthi Movie

'ధమాకా', 'వాల్తేరు వీరయ్య'తో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న రవితేజ (Ravi Teja) కు ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్సే దక్కలేదు. వరుసగా ఐదు పరాజయాలను అందుకున్నాడు. దాంతో మాస్ మహరాజా అభిమానులంతా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దూరంగా ఉంటున్న రవితేజ ఇప్పుడు మళ్ళీ వాళ్ళను టార్గెట్ చేస్తూ చేసిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఎలా ఉందో తెలుసుకుందాం.

రామ సత్యనారాయణ (రవితేజ), తన భార్య బాలామణి (డింపుల్ హయతీ)తో కలిసి ఓ బేవరేజ్ కంపెనీ నడుపుతుంటాడు. వాళ్ళ కొత్త ప్రొడక్ట్ అనార్కలి కోసం స్పెయిన్ లో ఉన్న మరో ఇంటర్నేషనల్ బేవరేజ్ కంపెనీతో టై అప్ కు ట్రై చేస్తే అది కాస్త రిజక్ట్ అవుతుంది. దానికి కారణం తెలుసుకోవడానికి తన పి.ఎ. లీలా (వెన్నెల కిషోర్)తో కలిసి రామ్ స్పెయిన్ వెళతాడు. ఆ కంపెనీ ఓనర్ మానసా శెట్టి (ఆషికా రంగనాథ్) ని కలిసిన తర్వాత ఇందులో ఆమె పి.ఎ. వింద ఉరఫ్ బెల్లం (సత్య) హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. వింద నిజ స్వరూపాన్ని మానసకు తెలియచేయడంతో పాటు అనార్కలి బ్రాండ్ ప్రమోషన్ విషయంలో అతను సక్సెస్ అవుతాడు. ఆ క్రమంలో రామ్ అనుకోకుండా మానసకు శారీరకంగా దగ్గరై పోతాడు. ఈ విషయాన్నిఅక్కడతో వదిలేయాలని ఇద్దరూ అనుకుంటారు. రామ్ ఇండియా తిరిగి వచ్చి బిజినెస్ రొటీన్ లో పడిపోయిన టైమ్ లో మానస అతన్ని కలవడానికి హైదరాబాద్ వస్తుంది. 'నా మొగుడు నాకే సొంతం' అని భావించే బాలామణికి, రామ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మానసకు మధ్య అతనెలా నలిగిపోయాడన్నదే ఈ చిత్ర కథ.


ఇటు లవర్, అటు వైఫ్ మధ్య నలిగిపోయిన మగవాళ్ళ కథతో వేలాది చిత్రాలు వచ్చాయి. ఈ తరహా సినిమాలన్నీ ఒకే టెంప్లేట్ తో సాగుతాయి. భార్యకు తెలియకుండా ప్రియురాలితో రాసలీల సాగించిన భర్త... ఇద్దరినీ ఒకేసారి కలిస్తే ఏం జరుగుతుందనే దాని లోంచే ఎవరైనా ఎంటర్ టైన్ మెంట్ ను క్రియేట్ చేస్తారు. అదే పని దర్శకుడు కిశోర్ తిరుమల ఇందులోనూ చేశాడు. ఇలాంటి సినిమాలు చూస్తున్నంత సేపు బాగానే అనిపిస్తాయి. హాయి నవ్వుకుంటాం.... ఇద్దరు ఆడవాళ్ల మధ్య మగాడు నలిగిపోతుంటే ఎంజాయ్ చేస్తాం. అయితే తనను అమితంగా ప్రేమించే భార్యను కాదని వేరొకరితో అతను ఎందుకు శారీరకంగా దగ్గరయ్యాడు? అతనికి పెళ్ళి అయిపోయిందని తెలిసి కూడా ప్రియురాలు అతన్నే ఎందుకు కోరుకుంటోంది? చేసిన తప్పుకు హీరో ఎలా పశ్చాత్తాపం చెందాడు? అనే అంశాల దగ్గర హృదయాన్ని కదిలించే లేదా హత్తుకునే బలమైన కారణం ఉండాలి. కానీ ఈ కథలో అది మిస్ అయ్యింది. అదే సినిమాను తేలిపోయేట్టు చేసి, కేవలం టైమ్ పాస్ మూవీగా మిగిల్చేసింది.

రవితేజకు ఇలాంటి పాత్రలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కుపోయినప్పుడు, అందులోంచి బయటపడే క్రమంలో బోలెడంత ఫన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో రవితేజ ఈ స్థాయి ఎంటర్ టైన్ మెంట్ ను మరే సినిమాలోనూ ఇవ్వలేదు. అయితే తన ఫేస్ లో కొంచెం ఏజ్ బార్ అయినట్లు తెలుస్తోంది. డింపుల్ హయతీ, ఆషికా రంగనాథ్ పాత్రలను దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు కానీ సీన్స్ చాలా బలహీనంగా ఉండటంతో ఆ క్యారక్టర్స్ తేలిపోయాయి ప్రత్యేకించి డింపుల్ హయతి ఆ పాత్రకు రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. సత్య, వెన్నెల కిశోర్, సునీల్, మురళీధర్ గౌడ్ తమదైన శైలిలో వినోదాన్ని అందించారు. ఫస్ట్ హాఫ్ లో సత్య మీద తీసిన సీన్స్ మరో లెవెల్ లో ఉన్నాయి. అయితే ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన తారక్ పొన్నప్ప, గెటప్ శ్రీను పాత్రలు అంత బలంగా లేవు. అజయ్ ఘోష్ ది కూడా అర్థం లేని పాత్రే! సునీల్ భార్యగా సోనియా సింగ్ రక్తికట్టించింది.


భీమ్స్ సంగీతం అందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సోమవారం విడుదలైంది. మర్నాడే ఈ సినిమా వచ్చింది. సో... సంక్రాంతి బరిలో భీమ్స్ సినిమాలు రెండూ బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. ఈ మూవీలో పాత సినిమా పాటలను సందర్భానుసారంగా బాగానే ఉపయోగించుకున్నారు. కానీ నాలుగున్నర దశాబ్దాల క్రితం వచ్చిన శోభన్ బాబు సినిమా 'కార్తీక దీపం'లోని 'ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం' పాటను పబ్ సాంగ్ గా రీమిక్స్ చేస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్న క్రెడిట్ కిశోర్ తిరుమలకే దక్కుతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదన్నది తెలిసిపోతుంది. ప్రేక్షకులకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని మేకర్స్ ప్రయత్నమైతే చేశారు. కానీ ఈ రీమిక్స్ తరహా స్టోరీ, స్క్రీన్ ప్లే ను... ఆడియెన్స్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రేటింగ్ : 2.5/ 5

ట్యాగ్ లైన్ : రొట్టకొట్టుడు కథతో విజ్ఞప్తి!

Updated Date - Jan 13 , 2026 | 01:16 PM